క్రూడ్​ మంటలు ఆరట్లే

క్రూడ్​ మంటలు ఆరట్లే

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌, వెలుగు: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో గ్లోబల్‌‌గా ఆయిల్‌‌ రేట్లు రోజూ పైపైకే ఎగుస్తున్నాయి. తాజాగా 100 డాలర్ల సైకలాజికల్ మార్క్‌‌ను క్రాస్‌‌ చేసిన బ్రెంట్ క్రూడాయిల్‌‌, బుధవారం113 డాలర్లను టచ్ చేసింది. 2014 తర్వాత  బ్రెంట్ క్రూడ్ రేట్లు ఇంతలా ఎప్పుడూ పెరగలేదు. గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌‌లో రష్యా ఎగుమతుల వాటా సుమారు 10 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం రష్యా క్రూడాయిల్ కొనడానికి  చాలా మంది ట్రేడర్లు ఆసక్తి చూపించడం లేదు. యూఎస్‌‌ గల్ఫ్‌‌, న్యూయార్క్‌‌ హబ్‌‌లలోని ట్రేడర్లు రష్యా క్రూడాయిల్‌‌కు దూరంగా ఉంటున్నారు.  ఇతర దేశాల నుంచి క్రూడాయిల్‌‌ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆయిల్ మార్కెట్‌‌లో రష్యా క్రూడాయిల్ రేట్లు తగ్గినప్పటికీ, సప్లయ్ కారణంగా బ్రెంట్ క్రూడ్, డబ్ల్యూటీఐ, మిడిల్‌‌ ఈస్ట్‌‌ క్రూడాయిల్‌‌ రేట్లు దూసుకుపోతున్నాయి. రష్యా నుంచి ఇండియాకు వచ్చే క్రూడాయిల్ దిగుమతుల వాటా చాలా తక్కువ. దీంతో సప్లయ్ సమస్యల కంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌‌లో ఆయిల్ రేట్లు పెరుగుతుండడం ప్రభుత్వాన్ని ఎక్కువ కలవర పెడుతోంది.  బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేటు బుధవారం 7 శాతం ఎగిసి 113 డాలర్లను టచ్ చేసింది. తర్వాత కొంత తగ్గి 110 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

స్ట్రాటజిక్‌‌ రిజర్వ్‌‌ల నుంచి ఆయిల్ వచ్చినా..
ఇంటర్నేషనల్  ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) మెంబర్లయిన యూఎస్‌‌, జపాన్‌‌లు తమ స్ట్రాటజిక్ రిజర్వ్‌‌ల నుంచి 60  మిలియన్ బ్యారెల్ క్రూడాయిల్‌‌ను మార్కెట్‌‌లోకి విడుదల చేస్తామని ప్రకటించాయి. అయినప్పటికీ క్రూడ్‌‌ రేట్లు తగ్గడం లేదు. ఈ 60 మిలియన్ బ్యారెళ్లు గ్లోబల్‌‌గా ఒకరోజు వాడకానికి సమానం. దీంతో మరిన్ని అంతరాయాలు ఏర్పడితే  క్రూడ్ సప్లయ్ సరిపోదనే భయాలు మార్కెట్‌‌లో పెరిగాయి. రష్యా నుంచి ఇతర మార్కెట్‌‌లకు జరిగే క్రూడ్ సప్లయ్‌‌లో కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. 

వచ్చే వారం నుంచి పెట్రోల్ రేట్లు పైకి? 
వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు  వచ్చే వారం ముగియనున్నాయి. దీంతో  పెట్రోల్‌‌‌‌, డీజిల్ రేట్లు పెరగడం మళ్లీ స్టార్టవుతుందని ఎక్స్‌‌పర్టులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌‌లో బ్రెంట్‌‌ క్రూడాయిల్ 113 డాలర్లకు పెరిగిన విషయం తెలిసిందే. దీంతో  గ్లోబల్‌‌ రేట్లతో పోలిస్తే లోకల్‌‌గా పెట్రోల్‌‌, డీజిల్ రేట్లు రూ.9 తక్కువగా ఉన్నాయి. ఐఓసీ, బీపీసీఎల్‌‌, హెచ్‌‌పీసీఎల్‌‌ వంటి కంపెనీలకు లీటర్‌‌‌‌ పెట్రోల్‌‌, డీజిల్‌‌పై రూ. 5.7 లాస్‌‌ వస్తోంది. ఇందులో కంపెనీలకు లీటర్‌‌‌‌పై వచ్చే మార్జిన్ (లాభం)​ రూ.2.5 కలిసి లేదు. కంపెనీల మార్జిన్లు తిరిగి సాధారణ స్థాయికి చేరుకోవాలంటే దేశంలో లీటర్ పెట్రోల్‌‌, డీజిల్‌‌ రేట్లను రూ.9 (లేదా 10 %)  పెంచాల్సి ఉంటుందని మోర్గాన్ స్టాన్లీ ఓ రిపోర్ట్‌‌లో వెల్లడించింది. రూ.1–3 వరకు ఎక్సైజీ డ్యూటీ తగ్గింపు ఉంటుందని, రిటైల్ రేట్లు  రూ. 5-–8  పెరుగుతాయని అంచనాలతో ఈ రిపోర్ట్ విడుదల చేసింది. మార్చి 1 నాటికి ఆయిల్ కంపెనీలు ఇండియా క్రూడాయిల్ బాస్కెట్‌‌ను  బ్యారెల్‌‌కు 101 డాలర్లు చెల్లించి కొనుగోలు చేశాయి. కిందటేడాది నవంబర్‌‌‌‌లో ఈ రేటు యావరేజ్‌‌గా 81.5 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌‌లో లీటర్ పెట్రోల్ రేటు రూ. 108.20 గా, డీజిల్ రేటు రూ. 94.62 గా ఉంది. 

100 డాలర్ల పైన ఉంటే రూ. లక్ష కోట్లు లాస్‌..

బ్రెంట్ క్రూడాయిల్ రేటు మరికొంత కాలం 100 డాలర్ల పైనే కొనసాగి, మరోవైపు ఎక్సైజ్​ డ్యూటీని తగ్గిస్తే..  ప్రభుత్వ రెవెన్యూ ఏడాదికి రూ. లక్ష  కోట్లు తగ్గుతుందని ఎస్‌‌‌‌బీఐ ఎకోర్యాప్‌‌ అంచనావేసింది. కిందటేడాది నవంబర్ 21 నుంచి దేశంలో  పెట్రోల్‌‌, డీజిల్ రేట్లు పెరగలేదు. ప్రస్తుతం గ్లోబల్‌‌గా పెరుగుతున్న క్రూడ్ రేట్లు చూస్తుంటే, లోకల్‌‌గా  లీటర్ పెట్రోల్‌‌, డీజిల్ రేటు రూ. 9–14 చొప్పున పెరగాల్సి ఉందని  ఈ రిపోర్ట్ అంచనావేసింది. మరోవైపు రేట్లను కంట్రోల్‌‌లో ఉంచడానికి ప్రభుత్వం పెట్రోలియం ప్రొడక్ట్‌‌లపై రూ.7 ఎక్సైజ్‌‌ డ్యూటీని తగ్గించాలనుకుంటే గవర్నమెంట్‌‌కు నెలకు రూ. 8 వేల కోట్ల లాస్ వస్తుందని ఈ రిపోర్ట్ పేర్కొంది. ‘ఈ తగ్గించే ఎక్సైజ్‌‌ డ్యూటీ కొన్ని నెలల పాటు కొనసాగుతుందని అనుకుంటే, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ వినియోగం 8–10 శాతం పెరుగుతుందని అంచనావేస్తే,  ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 95 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల వరకు రెవెన్యూ లాస్ వస్తుంది’ అని ఎస్‌‌బీఐ ఎకోర్యాప్ పేర్కొంది. గ్లోబల్‌‌ మార్కెట్‌‌లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేటు 10  డాలర్లు పెరిగితే దేశంలో ఇన్‌‌ఫ్లేషన్‌‌ 20–25 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. దీన్ని బట్టి బ్రెంట్ క్రూడ్‌‌ 100 డాలర్ల పైనే ఉంటే దేశంలో ఇన్‌‌ఫ్లేషన్‌‌ 52–65 బేసిస్ పాయింట్లు  పెరగొచ్చు. ఈ ఏడాది జనవరిలో బ్రెంట్ క్రూడాయిల్  బ్యారెల్ రేటు 84 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. హిస్టరీ చూస్తే పెరిగిన క్రూడ్‌‌ ఆయిల్ రేట్లు మూడు నెలల్లో దిగొచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ రిపోర్ట్‌‌ తెలిపింది. 

మరిన్ని వార్తల కోసం..

గత 24 గంటల్లో ఉక్రెయిన్ నుంచి 6 విమానాలొచ్చాయి

వడ్లు కొనకుంటే రైతులు నష్టపోయే ప్రమాదం