
- దళారీ అవతారమెత్తిన కొందరు పొలిటికల్ లీడర్లు
- ఏ సర్టిఫికెట్‌కైనా ఓ రేట్
- రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇవ్వాలన్నా పైసలు డిమాండ్
- డబ్బులు ఇవ్వకుంటే సర్వర్ బిజీ అంటూ కాలయాపన
మహబూబ్‌నగర్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి ఇటీవల వివాహమైంది. భర్త కుటుంబానికి చెందిన రేషన్ కార్డులో తమ పేరును చేర్చుకోవాలనుకుంది. ఇందుకు ఆమె తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్న తన పేరును డిలీట్ చేయాలని తహసీల్దార్ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకుంది. వారం రోజులైనా రేషన్ కార్డులో పేరు డిలీట్ చేయలేదు. చివరకు తన గ్రామానికి చెందిన ఒక పొలిటికల్ లీడర్‌కు రూ.2 వేలు ఫోన్‌పే చేసింది. ఆయన ఆఫీసులో ఈ పని చేసే ఓ ఉద్యోగికి రూ.2 వేలు ఫోన్ పే చేశాడు. గంట వ్యవధిలోనే ఆ యువతి పేరు రేషన్ కార్డులో డిలీట్అయిపోయింది.
మహబూబ్‌నగర్ జిల్లాలోని ఇదే నియోజకవర్గంలోని ఓ వ్యక్తికి అర ఎకరం పొలం ఉంది. ఈ భూమిపై క్రాప్‌లోన్ కూడా ఉంది. సదరు రైతు ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆ భూమిని తన గ్రామానికే చెందిన వ్యక్తికి అమ్మేశాడు. రెవెన్యూ ఆఫీసులో ఈ ల్యాండ్‌పై క్రాప్‌లోన్ ఉన్నా నాలుగు రోజుల కింద రిజిస్ట్రేషన్ చేశారు. అయితే రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్ ఇవ్వడానికి ఆఫీసులో పని చేసే ఉద్యోగి ఒకరు డబ్బులు డిమాండ్ చేశారు. ఆ రైతు కొడుకు రూ.2,500 ఇచ్చిన తరువాత, డాక్యుమెంట్‌ను అప్పగించాడు.
మహబూబ్‌నగర్, వెలుగు : స్టూడెంట్లు, రైతులు, ప్రజలకు సర్టిఫికెట్ల జారీలో ఆన్లైన్ సిస్టం అందుబాటులోకి వచ్చినా.. రెవెన్యూ డిపార్ట్మెంట్లోని కొందరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రెవెన్యూ ఆఫీసుల్లో జారీ చేసే ఫ్యామిలీ మెంబర్, ఇన్ కం, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్, రెసిడెన్షియల్, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఓఆర్సీ, నో పీటీ, 38(ఈ) ఇలా ఏ సర్టిఫికెట్ కోసమైనా ముందుగా మీ సేవా సెంటర్ల ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ అప్లికేషన్లు ఆర్ఐ, డీటీ, తహసీల్దార్ లాగిన్‌కు వెళ్తాయి.
విచారణ, తదితర వివరాలు వెరిఫై చేశాక సర్టిఫికెట్లను ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఎంక్వైరీ సమయాల్లో, సర్టిఫికెట్లు జారీ చేసే టైమ్‌లో ఆ డిపార్ట్మెంట్కు చెందిన కొందరు ఉద్యోగులు డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. డబ్బులు ఇవ్వకుంటే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నట్లు విమర్శలున్నాయి. సర్వర్బిజీగా ఉందని, సైట్ ఓపెన్ కావడం లేదనే కారణాలు చెబుతూ ముప్పుతిప్పలు పెడుతున్నట్లు తెలిసింది. అడిగినంత డబ్బులు ఇచ్చిన తర్వాతే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే ఈ డబ్బులను సిబ్బంది నేరుగా కాకుండా కొందరు దళారుల ద్వారా వసూలు చేయిస్తున్నారు.
భూసమస్యలపై పెద్ద మొత్తంలో వసూళ్లు..
భూ రిజిస్ట్రేషన్లు, భూ విషయాలకు సంబంధించిన సర్టిఫికెట్లు జారీ చేయడానికి కొందరు సిబ్బంది పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిసింది. ప్రధానంగా సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, మార్టిగేజ్, విరాసత్‌లు చేయడానికి వేలల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. చివరకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యాక క్లైంట్లకు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వడానికి కూడా కొందరు కింది స్థాయి సిబ్బంది రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. డబ్బులు ఇవ్వకుంటే డాక్యుమెంట్లు ఇవ్వకుండా సతాయిస్తున్నారనే విమర్శలున్నాయి. అలాగే భూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్న సమయంలో విక్రయదారులు, కొనుగోలుదారులు మాత్రమే ఆఫీసుల్లో ఉండాల్సి ఉంటుంది.
కానీ, చాలా ఆఫీసుల్లో దళారులు ఉంటున్నారు. ఆన్లైన్ చేసే సమయాల్లో ఎవరి భూమిని ఎవరి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? ఎంత భూమి ఉంది? ధర ఎంత? ఎవరి నుంచి ఎవరు కొంటున్నారు? తదితర వివరాలను గోప్యంగా ఉంచకుండా దళారులకు చెరవేస్తున్నట్లు తెలిసింది. వారి ద్వారా సెటిల్మెంట్లు చేసి డబ్బులు తీసుకుంటున్నారు. అలాగే వ్యవసాయ భూముల మీద క్రాప్ లోన్లు ఉంటే.. ఆ భూములు రిజిస్ట్రేషన్‌కు వస్తే క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటే బ్యాంకుల నుంచి క్రాప్ లోన్ డబ్బులు కట్టినట్లు రిసిప్ట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇవేమి పట్టించుకోకుండా రూ.5 వేల నుంచి రూ.8 వేలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు సమాచారం.
రెవెన్యూ ఆఫీసర్ ఏమన్నాడంటే..
‘తహసీల్ ఆఫీసులో ఉండే పై స్థాయి ఆఫీసర్లను దళారులు బెదిరించే స్థాయికి ఎదిగారు. ఎంక్వైరీలో వివరాలు తప్పుగా ఉన్నా సర్టిఫికెట్ జారీ చేయాలని భయపెడుతున్నారు. రాజకీయ పలుకుబడితో ఒత్తిడి తెస్తున్నారు. వివరాల్లో తప్పులున్నాయని పని చేయకపోతే, ఆ ఊరికి చెందిన కొంత మందిని ఆఫీసులకు తీసుకొచ్చి హంగామా చేస్తున్నారు.’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రెవెన్యూ అధికారి చెప్పారు.
ప్రతి ఊళ్లో దళారులు..
పొలిటికల్ పార్టీల అండతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు రెవెన్యూ ఆఫీసుల్లో దళారుల అవతారం ఎత్తారు. అక్కడ పనులు చక్కబెట్టాలంటే.. ముందుగా వీరినే కలవాల్సి వస్తోంది. వీరిని కాదని సర్టిఫికెట్ల కోసం ఆన్లైన్లో అప్లికేషన్లు చేసుకొని ఆఫీసులకు వెళితే పనులు కావడం లేదు. రోజుల తరబడి ఆఫీసుల్లో వీరి ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. సర్టిఫికెట్లు అత్యవసరం ఉన్నవారు చేసేది లేక చివరకు దళారుల దగ్గరికే రావాల్సి వస్తోంది. ఆఫీసర్లు కూడా ఒక్కో పనికి ఒక్కో వ్యక్తిని దళారీగా నియమించుకొని ఈ దందా సాగిస్తున్నట్లు తెలిసింది.
అలాగే కొందరు దళారులు మీ సేవా సెంటర్ల వద్దే ఉంటూ.. ఏ పని కోసం ఎవరు వస్తున్నారనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. అప్లికేషన్లు పెట్టుకున్నాక ఆఫీసర్ల వద్ద ఆ ఫైళ్లను పెండింగ్ పెట్టిస్తున్నారు. రోజులు గడిచినా పనులు కాపోవడంతో అప్పుడు వీరు తెరమీదకు వచ్చి వారిని కలుస్తున్నారు. పని కావాలంటే కొంత ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి లైన్లోకి తెచ్చుకుంటున్నారు. డబ్బులు తీసుకున్న గంటల వ్యవధిలోనే వారి పనులు పూర్తి చేయిస్తున్నారు.