ధరణి వచ్చినా ఆగని లంచాలు

ధరణి వచ్చినా ఆగని లంచాలు

మెదక్, వెలుగు : భూ సమస్యలు లేకుండా చేసేందుకు ధరణి పోర్టల్​ తీసుకొచ్చామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ ధరణి వచ్చినా లంచాల దందా మాత్రం ఆగడం లేదు. మెదక్​ జిల్లాలో భూ సంబంధిత సమస్య ఏదైనా పైసలిస్తేగానీ పని అయితలేదని బాధిత రైతులు వాపోతున్నారు. ఇందుకు జిల్లాలో వరుసగా ఏసీబీకి చిక్కుతున్న రెవెన్యూ ఆఫీసర్లు నిదర్శనంగా నిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2017లో భూప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టి రైతులందరికీ కొత్త పాస్​ పుస్తకాలు జారీ చేసింది. ఆ తర్వాత ధరణి పోర్టల్​ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా రైతులకు అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శంగా, సత్వర సేవలు అందుతాయని ప్రకటించింది. కానీ ధరణి పోర్టల్​ వచ్చాక రైతుల సమస్యలు తీరకపోగా అనేక కొత్త సమస్యలు వచ్చాయి. పాస్​ బుక్ లలో భూ విస్తీర్ణంలో ఎక్కువ, తక్కువలు నమోదయ్యాయి. కొన్నిసర్వే నంబర్లలోని భూమి ఆన్​ లైన్​లో మిస్​ అయ్యింది. ఇంకొన్నిచోట్ల కొత్త పాస్​ పుస్తకాలు జారీ కాలేదు. ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసిన అసైన్​మెంట్​భూములు లావాణి భూములుగా నమోదయ్యాయి. చాలా చోట్ల అనేక ఎకరాల పట్టా భూములు ప్రొహిబిటెడ్​ లిస్ట్​లో చేరాయి. ఇలాంటి సమస్యలతో ధరణి లోపాలు సవరించాలంటూ బాధిత రైతులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు పెట్టుకున్నా, రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా పనులు కావడం లేదు. ప్రజావాణిలో వచ్చే ఆర్జీలలోనూ ఎక్కువ శాతం భూముల సమస్యలకు సంబంధించినవే ఉంటున్నాయి. 

ఇదే అదనుగా రెచ్చిపోతున్న ఆఫీసర్లు!

రైతుల భూ సమస్యలను ఆసరా చేసుకుని కొందరు ఆఫీసర్లు లక్షల రూపాయలను డిమాండ్ చేస్తున్నారు. భూ విస్తీర్ణం, ఆయా ప్రాంతాల్లో ఉన్నభూముల విలువలను బట్టి లంచం అడుగుతున్నారు. నెలలకొద్దీ ఆఫీసుల చుట్టూ తిరిగినా కాని పనులు ఆఫీసర్లకు మామూళ్లు ముట్టజెప్పితే వెంటనే అయిపోతున్నాయి. జిల్లాలోని శివ్వంపేట, తూప్రాన్​, చేగుంట, చిన్నశంకరంపేట, కౌడిపల్లి మండలాల్లో ఈ తతంగం ఎక్కువగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారులు డైరెక్ట్​గా వారే లంచం తీసుకుంటుండగా, మరి కొందరు కింది స్థాయి సిబ్బందిని, ప్రైవేట్​ వ్యక్తులను మీడియేటర్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారని బాధిత రైతులు చెబుతున్నారు. 

ఏసీబీకి చిక్కిన కేసుల్లో కొన్ని..

మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండలం చిప్పల్​తుర్తిలో 112 ఎకరాలకు సంబంధించి ఎన్ వో సీ జారీ చేసేందుకు ఎకరాకు లక్ష రూపాయల చొప్పున డిమాండ్ చేసిన కేసులో 2020 అక్టోబర్​లో అప్పటి జాయింట్​కలెక్టర్ నగేశ్, నర్సాపూర్ ఆర్ డీ వో అరుణా రెడ్డి, చిలప్ చెడ్ తహసీల్దార్ సత్తార్ లపై ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. మనోహరాబాద్ తహసీల్దార్ ఆఫీస్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రైవేట్​ వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ధరణిలో భూములు రిజిస్ట్రేషన్ లు చేసుకున్న వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. దీనికి సంబంధించి వీడియో వాట్సప్​ గ్రూప్​లలో వైరల్​ అయ్యింది. 

ఎవరి పేరుమీదలేని ఎకరం భూమిని ఒక వ్యక్తిపేరున చేసేందుకు గాను గతేడాది ఆగస్టు 18న చేగుంట డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ మీడియేటర్​ ద్వారా రూ.4.50 లక్షలు బేరం కుదుర్చుకొని రూ.2.7 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు. చంద్రశేఖర్​ తోపాటు మీడియేటర్​ అనిల్​పై ఏసీబీ ఆఫీసర్లు కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. ఈనెల 6న  చిన్నశంకరంపేట ఆర్​ఐ శ్రీహరి, చందంపేట వీఆర్​ఏ సురేశ్​లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. సంగాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే రైతుకు చెందిన 22 గుంటల భూమి ధరణి పోర్టల్​లో మిస్​ కాగా, దానిని నమోదు చేసేందుకు ఆర్​ఐ రూ.2 లక్షలు లంచం డిమాండ్​ చేసి, వీఆర్​ఏతో కలిసి లక్ష రూపాయలు లంచంగా తీసుకుంటూ దొరికిపోయాడు.