ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

నారాయణపేట, వెలుగు: స్టూడెంట్లకు నాణ్యమైన విద్యనందించి, వారి బంగారు భవిష్యత్​కు బాటలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమం ప్రారంభించిందని కలెక్టర్  శ్రీహర్ష అన్నారు. శుక్రవారం దామరగిద్ద మండలంలోని జడ్పీ హైస్కూల్​, ప్రైమరీ స్కూల్ లో అడిషనల్​కలెక్టర్ మయాంక్​మిట్టల్ తో కలిసి ‘మన ఊరు మన బడి’ పనులను పరిశీలించారు.  అనంతరం కేజీబీవీ లో టెన్త్ క్లాస్​స్టూడెంట్లను కొన్ని ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. బ్లాక్​బోర్డుపై ఇండియా మ్యాప్​గీసి  రాజధానులను గుర్తించాలన్నారు.  అనంతరం ప్రైమరీ స్కూల్లో మిడ్​డే మీల్స్​ను పరిశీలించి నాణ్యత పాటించకపోవడతో ఏజెన్సీ నిర్వాహకులపై కలెక్టర్​సీరియస్​అయ్యారు.  సెక్టోరల్​ఆఫీసర్​పద్మ నళిని, ఎంపీపీ నర్సప్ప, ఎంఈవో వెంకటయ్య, జడ్పీటీసీ లావణ్య తదితరులు పాల్గొన్నారు.

వందశాతం టాక్స్​ వసూల్​ చేయాలి అడిషనల్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్

వనపర్తి, వెలుగు: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో వంద శాతం టాక్స్​వసూలు పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లో మున్సిపల్​కమిషనర్ల మీటింగ్​కు ఆయన హాజరై మాట్లాడారు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్​’ లో రాష్ట్రానికి వివిధ కేటగిరిలో అవార్డులు రాగా, జిల్లాలో కొత్తకోట మున్సిపాలిటీ అవార్డు దక్కిందన్నారు. టాక్స్​వసూళ్లలో అన్ని మున్సిపాలిటీలు వెనుకబడి ఉన్నాయని, డిసెంబర్ 15 లోగా పూర్తి చేయాలని  ఆదేశించారు.  బిల్ కలెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంగ్వాన్​హెచ్చరించారు.  క్రీడాప్రాంగణాలు వెంటనే పూర్తి చేయాలని, స్వచ్ఛసర్వేక్షణ్​పై అవగాహన కల్పించి గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా జిల్లాను తీర్చిదిద్దాలన్నారు.   కమిషనర్లు విక్రమ్ సింహా రెడ్డి, వెంకటేశ్వర్లు, జాన్ కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఆఫీసర్లు స్పందించకుంటే ఆత్మహత్య చేసుకుంటా

సోషల్​ మీడియాలో వైరలైన సర్పంచ్​ వీడియో 

అచ్చంపేట, వెలుగు:  గ్రామ కంఠం భూములలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, ఈ విషయంపై అధికారులు తనకు సహకరించడం లేదని, రెండు రోజులలో స్పందించకపోతే  కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని నాగర్ కర్నూల్​జిల్లా బల్మూర్​ మండలం జినుకుంట సర్పంచ్ గోరటి శ్రీనివాసులు సోషల్​ మీడియాలో పెట్టిన వీడియోలు వైరలయ్యాయి. స్పందించిన డీఎల్​పీవో వెంకటయ్య, తహసీల్దార్​కిష్ట్యానాయక్, ఎంపీడీవో దేవన్న శుక్రవారం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. గ్రామసభ నిర్వహించి సమస్యను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 30 ఏండ్ల కింద ప్లాట్ల విషయంలో లబ్ధిదారులకు ఎలాంటి హక్కులు లేవని, గతంలోనే రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి 30 గుంటల భూమిని గ్రామ కంఠం పరిధిలోకి తీసుకొచ్చారని తహసీల్దార్ ​కిష్ట్యానాయక్​ తెలిపారు. సర్పంచ్​కావాలనే.. సోషల్​మీడియాలో ప్రచారం కోసం ఆత్మహత్య ప్రకటన చేశాడని గ్రామస్తులు ఆరోపించారు. ప్రచారం కోసం ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదని గ్రామస్తులు సర్పంచ్​ను నిలదీశారు. వార్డు మెంబర్లు , గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

‘చిన్నోనిపల్లి’ ని ఆర్డీఎస్ కు ఎట్ల లింక్​ చేస్తరు?

గద్వాల, వెలుగు:  కృష్ణా నదిపై నిర్మించిన చిన్నోనిపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఆర్డీఎస్​కు ఎట్ల లింక్​చేస్తారని? నిర్వాసిత రైతులు ప్రశ్నించారు. చిన్నోని పల్లి రిజర్వాయర్ ను రద్దు చేయాలని 302వ రోజు కూడా నిరసన దీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ  ఆర్డీఎస్​కెనాల్ కు తుంగభద్ర నది  నుంచి బచావత్ ట్రిబ్యునల్​ద్వారా 15.9 టీఎంసీల వాటా హక్కు ఉందన్నారు. అక్కడి పంట కాలువలను రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో  నిర్మించకుండా ఇక్కడి నీటిని తీసుకెళ్లి 12,500 ఎకరాలకు పారిస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు ఆర్డీఎస్ కెనాల్ కి లింకు చేస్తే  తుంగభద్రలో వచ్చే నీటి హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరించారు.  కలెక్టర్ తో జరిగిన చర్చలు విఫలమయ్యాయని రిజర్వాయర్ రద్దు చేసే వరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.

‘ధరణి’ తో పెరిగిన భూ సమస్యలు

ఆమనగల్లు, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్​తో భూ సమస్యలు పెరిగాయని  కేవీపీఎస్​రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామెల్​ఆరోపించారు. శుక్రవారం కడ్తాల్​ తహసీల్దార్​ఆఫీస్​ ఎదుట కేవీపీఎస్​ ఆధ్వర్యంలో భూ సదస్సు నిర్వహించారు. హాజరైన సామెల్​మాట్లాడుతూ1969లో ఏర్పాటు చేసిన భూదాన్​ బోర్డు ద్వారా కడ్తాల్​ మండలం చెల్లంపల్లి, కడ్తాల్​గ్రామాల్లో నిరుపేదలకు 158 ఎకరాల భూమిని పట్టాలు ఇచ్చి పొజీషన్​చూపలేదన్నారు. బాధితులు పొజీషన్​లో ఉన్నా..  ‘ధరణి’ లో పేర్లు నమోదు కాక రైతు బంధు, బీమా రాక నష్టపోతున్నారన్నారు.  ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు. వెంటనే కలెక్టర్​ స్పందించి పేదలకు న్యాయం చేయాలని లేకపోతే ఆ  భూముల్లో జెండాలు పాతి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.  ప్రకాశ్ కారత్​,  చెన్నయ్య, వెంకటేశ్, అశోక్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. 

టాస్క్ ఫోర్స్ బృందాలను రద్దు చేయాలి

వనపర్తి/గోపాల్​పేట, వెలుగు: ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలు, పర్యవేక్షణ కోసం కొత్తగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తున్న టాస్క్ ఫోర్స్ టీమ్స్​ను రద్దు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) లీడర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో డీఈఓ ఆఫీస్​అధికారులకు తపస్ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూళ్లలో  ఓ వైపు టీచర్ల కొరత, క్లాస్ రూం ఇబ్బందులు, శానిటేషన్ సమస్యలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అరకొర వసతులతో ఒత్తిడి పెరిగి టీచర్లు మానసిక  వత్తిడికి గురవుతున్నారన్నారు. నేర వ్యవస్థను కట్టుదిట్టం చేయడానికి ఉపయోగించే టాస్క్​ఫోర్స్ టీమ్​లను  ఏర్పాటు చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. తపస్ జిల్లా అధ్యక్షుడు వేముల అమరేందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్,  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేధింపులు తగదు

టీచర్లపై ‘తొలిమెట్టు’  పేరుతో అధికారుల నిరంకుశత్వం పెరిగిపోయిందని దీనిని పూర్తిగా  ఖండిస్తున్నామని  టీఎస్​యూటిఎఫ్​  జిల్లా ప్రధాన కార్యదర్శి రవి ప్రసాద్ గౌడ్ అన్నారు.  మండల కేంద్రంలోని హైస్కూల్ లో శుక్రవారం  టీఎస్ యూటీఎఫ్​మండల మహాసభ నిర్వహించారు.  హాజరైన  రవి ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ ప్రైమరీ స్కూళ్లలో టీచర్ల కొరత చాలా ఉందని  వెంటనే భర్తీ చేయాలన్నారు.  

ఆశా కార్యకర్తలకు వేతనం ఇవ్వాలి

కొత్తకోట, వెలుగు :  ఆశా కార్యకర్తలకు పారితోషికం కాదు, వేతనం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిబాబు డిమాండ్​చేశారు. శుక్రవారం  కొత్తకోటలో  సీఐటీయూ 3వ జిల్లా మహాసభల్లో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని గవర్నమెంట్​స్కూల్​ప్రాంగణం నుంచి సీఐటీయూ అనుబంధ సంఘాల కార్మికులు ఎర్రజెండాలతో కదం తొక్కారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిబాబు మాట్లాడుతూ.. శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఆశా  కార్యకర్తల శ్రమను దోచుకుంటున్నారన్నారు.  మున్సిపల్ ,  పంచాయతీ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు,  ఉపాధ్యక్షుడు నిక్సన్, కేవీపీఎస్​జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్ రాములు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శారద ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సునీత తదితరులు పాల్గొన్నారు. 

రాజ్యాధికారం కోసం బీసీలు ఉద్యమించాలి

మదనాపురం, వెలుగు:  బీసీలు రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సంగెం సూర్యారావు సూచించారు.  శుక్రవారం మదనాపురం మండల కేంద్రంలో ‘ బీసీ టైమ్స్​’ ఆధ్వర్యంలో బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన సూర్యారావు మాట్లాడుతూ మెజారిటీ బీసీలు చట్టసభల్లో ఉన్నప్పుడే వారి బతుకులు మారుతాయన్నారు.  అనంతరం దేవరకద్ర  బీజేపీ లీడర్​ బాలన్న మాట్లాడుతూ  బీసీల రాజ్యాధికారం బీసీలంతా పార్టీలకతీతంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. సర్పంచ్​ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రణీత్​ చందర్,  మహబుబ్ నగర్  జిల్లా సగర సంఘం కార్యదర్శి సత్యం సాగర్,  అరవింద్ వాల్మీకి,  ప్రవీణ్ వాల్మీకి,  మహేందర్ నాయుడు, అంజాద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు

ఆమనగల్లు, వెలుగు:  విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలుంటాయని రంగారెడ్డి డీఈవో సుఖేందర్​రావు  హెచ్చరించారు. శుక్రవారం కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాల్లోని పలు  స్కూళ్లను  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమనగల్లు కస్తూర్భా  స్కూల్​లో నాన్ టీచింగ్​ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా ఉండడంపై సీరియస్​అయ్యారు. అంతకు ముందు కడ్తాల్  కేజీబీవీ  స్కూల్​ను , ఎమ్మార్సీ బిల్డింగ్​లో జరిగిన కాంప్లెక్స్ మీటింగ్​కు హాజరై తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం తలకొండపల్లి మండలంలోని సూర్యతండా, లక్ష్మీతాండ, చుక్కాపూర్​, తలకొండపల్లి కేజీబీవీ స్కూళ్లను తనిఖీ చేసిన డీఈవో టీచర్లు సమయ పాలన పాటించాలని, ముందస్తు సమాచారం లేకుండా సెలవులు పెట్టొద్దని హెచ్చరించారు. ఎంఈవో సర్దార్​ నాయక్​,  ఎంఎన్​వో జంగయ్య పాల్గొన్నారు. 

మంత్రి పర్యటనను బహిష్కరిస్తాం

మక్తల్, వెలుగు:  పట్టణంలో శనివారం ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ పర్యటనను బాయ్​కాట్​చేస్తున్నామని మున్సిపల్​చైర్​పర్సన్​పావని, వైస్​చైర్​పర్సన్​అఖిల అన్నారు. శుక్రవారం వారు  పట్టణంలో ప్రెస్​మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  గత ఏడాది మున్సిపాలిటీకి ప్రభుత్వం అప్పుగా టీయూఎఫ్డీసీ ద్వారా రూ.5 కోట్లు శాంక్షన్​చేసిందన్నారు. ఆ ఫండ్స్​తో పట్టణంలో  ఎమర్జెన్సీ పనులైన నాలాలు, డ్రైనేజీలు నిర్మించకుండా  రాజకీయ కారణాలతో ఎమ్మెల్యే  రామ్మోహన్​ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు.  బీజేపీ పాలకవర్గం ఉందని అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.