ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో మన ఊరు మనబడి కింద పనులు చేపట్టిన మోడల్ ​స్కూళ్లను ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు ఆఫీసులో అడిషనల్​ కలెక్టర్ రాజర్జి షాతో కలిసి పనుల పురోగతి, ఎఫ్టీవోల జనరేట్, తదితర అంశాలపై విద్య, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నా పనులు స్లోగా జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారుల తీరు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.  మనఊరు మనబడిలో చేపట్టిన 66 మోడల్ స్కూళ్ల పనులను జనవరి 5లోగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు.

ఆయా మోడల్ స్కూళ్లకు పెయింటింగ్, ఫర్నిచర్, పాత్ వే, ప్లాంటింగ్, చిల్డ్రన్ ప్లే ఎక్విప్​మెంట్​ ఉండాలని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే ఇవ్వాలని ఎంఈఓలను ఆదేశించారు. పనులు చేసి ఎఫ్టీవోలు జెనరేట్ చేసిన వెంటనే నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. సమావేశంలో  జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్, ఇంజనీరింగ్ శాఖల ఈఈలు, డీఈలు, ఎంఈఓలు, విద్యా శాఖ ప్లానింగ్ కో ఆర్డినేటర్ పాల్గొన్నారు.

మోతి మాత జాతరకు ఏర్పాట్లు చేయాలి

జహీరాబాద్, వెలుగు :  సంగారెడ్డి జిల్లా మొగుడం పల్లి మండలం ఉప్పర్ పల్లి తండా పరిధిలోని గిరిజనుల ఆరాధ్యదైవం మోతి మాత ఆలయంలో జనవరి 5 నుంచి జరిగే జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన మోతి మాతాను దర్శించుకుని ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఉత్సవాల వాల్​ పోస్టర్​ ఆవిష్కరించారు.

‘ఘనపూర్’ నుంచి విడతల వారీగా సాగునీరు

మెదక్​టౌన్, వెలుగు :  మెదక్​ జిల్లాలో ఈ యాసంగిలో  ఘనపూర్ ప్రాజెక్ట్  ఆనకట్ట కింద ఉన్న 21,625 ఎకరాలకు జనవరి 13 నుంచి ఏప్రిల్ రెండో వారం వరకు వాకబందీ పద్ధతిలో  సాగునీటిని అందించనున్నట్లు అడిషనల్​ కలెక్టర్​ రమేశ్​ తెలిపారు.  గురువారం కలెక్టరేట్​లోని ఆయన చాంబర్​లో నిర్వహించిన నీటి పారుదల సలహా బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడారు.  జనవరి 18న మాఘ అమావాస్య సందర్భంగా ఏడుపాయలకు వచ్చే  భక్తులను దృష్టిలో ఉంచుకొని సింగూరు నుంచి ఘనపూర్ ప్రాజెక్ట్ కు 13న నీటిని విడుదల చేయాలని సమావేశం తీర్మానించిందన్నారు. యాసంగి మొత్తంలో 8 నుంచి10 విడతల్లో సాగునీటిని అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

ఎక్కడైనా నీటి పారుదల కాల్వలు నిర్మించాల్సి ఉంటే ఉపాధి హామీ పథకం కింద చేపట్టడానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. నీటి విడుదలపై రైతులు సమాచారం తెలుసుకోవడానికి  వీలుగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్​ ఇంజనీర్​యేసయ్య, ఎగ్జిక్యూటివ్​ ఇంజనీర్​ శ్రీనివాస్ రావు, రైతుబంధు సమితి జిల్లా ప్రెసిడెంట్ ​సోములు, ఆర్డీవో సాయిరామ్​, ఉద్యాన శాఖ అధికారి నర్సయ్య,  సీపీవో మహ్మద్​ ఖాసీం, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. 

పాత నేరస్తులకు ఊరట

పటాన్​చెరు, వెలుగు : పటాన్​చెరు సబ్​డివిజన్​పోలీస్ ​స్టేషన్​పరిధిలోని పాత నేరస్తులకు ఊరట కలిగింది. గురవారం పాత నేరస్తులతో పట్టణంలోని ఓ ఫంక్షన్​ హాల్​లో ఎస్పీ రమణకుమార్, డీఎస్పీ భీంరెడ్డి ఆధర్యంలో సమావేశం నిర్వహించారు. బానూర్, అమీన్​పూర్, బొల్లారం, జిన్నారం, గుమ్మడిదల, హత్నూర పోలీస్ ​స్టేషనల్లో నమోదైన కేసులలో నేరస్తులుగా ఉండి,   గత 11 ఏండ్లుగా ఎలాంటి నేరాలు చేయకుండా ఉన్నవారిని,  50 ఏండ్ల వయసు పైబడిన వాళ్ల కేసులను క్లోజ్​ చేసేందుకు చర్యలు చేపట్టారు. సమావేశంలో సీఐ వేణుగోపాల్​రెడ్డి ఉన్నారు. 

వరకట్న మృతి కేసులో ఏడేండ్ల జైలు

సిద్దిపేట రూరల్, వెలుగు: వరకట్న మృతి కేసులో నేరస్తుడికి ఏడేండ్ల కఠిన కారాగార జైలు శిక్ష ను విధిస్తూ ప్రిన్సిపల్ డిస్టిక్ అండ్ సెషన్స్ కోర్ట్ గురువారం తీర్పునిచ్చింది. సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి తెలిపిన ప్రకారం..  సిద్దిపేట పట్టణం శ్రీనగర్ కాలనీ కి చెందిన నర్మెట నవీన్ కుమార్ కు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామానికి చెందిన పూజితతో 2016 ఏప్రిల్ 2న వివాహం జరిగింది. నవీన్​కు రూ.5 లక్షల వరకట్నం, 5 తులాల బంగారం, ఇతర కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు. వివాహం జరిగిన రెండు నెలలకు పూజితను నవీన్ అదనపు కట్నం కోసం హింసించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో 2017జులై 8న పూజిత పురుగుల మందు తాగింది. చికిత్స పొందుతూ అదేనెల11న చనిపోయింది.

మృతురాలి తమ్ముడు వెంకటేశ్ ​ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అప్పటి వన్ టౌన్ సీఐ నందీశ్వర్ రెడ్డి, ఏసీపీ నరసింహారెడ్డి నేరస్తులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించారు. విచారణ జరిపిన జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి డాక్టర్ టి. రఘురాం నేరస్తుడికి ఈ మేరకు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.  ఈ సందర్భంగా సీపీ శ్వేత కేసు ఇన్వెస్టిగేషన్ పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకట్ లింగం, కోర్టు కానిస్టేబుళ్లు వెంకటరామరాజు, పుల్లరాజు, హోంగార్డు శ్రీనివాస్, కోర్టు లైజనింగ్ ఏఎస్సై స్వామిదాస్, హెడ్ కానిస్టేబుల్ రాజమల్లును అభినందించారు.

బసవేశ్వరుడి ఆశయ సాధనకు కృషి చేయాలి 

మునిపల్లి (కోహీర్​), వెలుగు  :  బసవేశ్వరుడు 12వ శతాబ్ధంలోనే కుల రహిత సమాజం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా​డీసీఎంఎస్​ చైర్మన్ మల్కాపురం శివకుమార్ అన్నారు. కోహీర్​ మండలంలోని రాజినెల్లి  గ్రామంలో ఏర్పాటు చేసిన మహాత్మా బసవేశ్వరుడి విగ్రహాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బసవేశ్వరుడు మహిళల విద్యాభివద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు. శ్రమను నమ్ముకుని జీవించాలన్నదే ఆయన సిద్ధాంతమని తెలిపారు. కార్యక్రమంలో జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, బీఆర్ఎస్​ మండల సీనియర్ ​నాయకుడు మ్యాతరి ఆనంద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

గవర్నర్ వ్యవస్థను రద్దు చేసే వరకూ ఉద్యమిస్తాం

    సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి

సిద్దిపేట రూరల్, వెలుగు:  రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేసే వరకూ ఉద్యమిస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి అన్నారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. నాయకులు కలెక్టరేట్ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు తోపులాట జరిగింది. అనంతరం చాడ వెంకట్​రెడ్డితోపాటు పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్ ను అరెస్ట్ చేసి  త్రీ టౌన్ పోలీస్​స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్​రెడ్డి  మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ, సీఎంలు పంపిన జీవోలను పెండింగ్​లో  పెడుతున్నారన్నారు. గవర్నర్ వ్యవస్థ ను కేంద్రం ఏజెంట్ గా మార్చుకుందని ఆరోపించారు. సమావేశంలో నాయకులు గడిపే మల్లేశ్, వేల్పుల బాలమల్లు, కిష్టపురం లక్ష్మణ్, కనుకుంట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

రేషన్​షాపుల ద్వారా ‘ఫోర్టి ఫైడ్ రైస్’

సంగారెడ్డి టౌన్, వెలుగు: పోషకాహార లోపంతో బాధపడుతున్న వాళ్ల కోసం కేంద్రం రేషన్​ షాపుల ద్వారా విటమిన్లతో కూడిన ఫోర్టి ఫైడ్ రైస్ ను ఇస్తున్నట్లు  సంగారెడ్డి అడిషనల్​ కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. గురువారం సమీకృత కలెక్టరేట్​లోని ఆడిటోరియంలో ఫోర్టి ఫైడ్ రైస్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు, ఐదు కేజీల సిలిండర్ అమ్మకం తదితర అంశాలపై డీలర్లకు అవగాహన కల్పించారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, వివిధ సేవలు డీలర్లు ఉపయోగించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. సమావేశంలో డీఎస్ఓ వనజాత, ఏసీఎస్ఓ నిత్యానందం, సప్లై డీఎం సుగుణ భాయ్ తదితరులు పాల్గొన్నారు.