ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో పోడు భూముల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని మెదక్​ లోకల్ బాడీ అడిషనల్​కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళ వారం కలెక్టరేట్ లో పోడుభూముల వెరిఫికేషన్ పై ఫారెస్ట్​, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. గతేడాది డిసెంబర్ 4 నాటికి  జిల్లాలో 15 మండలాలలోని  62 గ్రామ పంచాయతీలలోని 65 నివాస ప్రాంతాలలో 4,022 క్లెయిమ్స్ స్వీకరించి ఆన్ లైన్ లో పొందుపర్చామని తెలిపారు. అందులో గిరిజనుల నుంచి 1,096, గిరిజనేతరుల నుంచి 2,926 క్లెయిమ్స్ స్వీకరించామని చెప్పారు. ఆ క్లెయిమ్ ల వెరిఫికేషన్ కోసం రెవెన్యూ, పంచాయతీరాజ్, అటవీ శాఖలు షెడ్యూల్ రూపొందించుకోవాలని సూచించారు. బుధవారం నుంచి గ్రామస్థాయిలో పర్యటించి 2005కు ముందు నుంచి పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులు, మూడు తరాల నుంచి సాగు చేస్తున్న గిరిజనేతరుల దరఖాస్తులు గ్రామస్థాయి కమిటీలో పరిశీలించాలని చెప్పారు. రోజూ కనీసం 10 నుంచి 15 క్లెయిమ్స్ ను  క్షేత్రస్థాయిలో  జీపీఎస్ డివైస్ ద్వారా సర్వే చేసి మొబైల్ యాప్ లో సర్వే కు సంబంధించిన  వివరాలు నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో డీఎఫ్ వో రవి ప్రసాద్, జడ్పీ సీఈవో శైలేశ్, డీటీవో కేశూరాం నాయక్, డీపీవో తరుణ్ కుమార్, ఈడీఎం సందీప్ 
పాల్గొన్నారు.

కేసుల్లో ఇన్వెస్టిగేషన్ పక్కాగా ఉండాలి

సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రతి కేసులో ఇన్వెస్టిగేషన్ పక్కాగా ఉండాలని సిద్దిపేట సీపీ ఎన్ శ్వేత అన్నారు. మంగళవారం సిద్దిపేట సీపీ ఆఫీస్ లో గజ్వేల్ డివిజన్ పోలీస్ అధికారులతో పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతీ విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని ఆమె ఆఫీసర్లకు సూచించారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేయాలన్నారు. 60 రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని చెప్పారు. రౌడీలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టాలన్నారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, గజ్వేల్ ఏసీపీ రమేశ్, సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ ఫణిందర్, సీఐలు వీరాప్రసాద్, కమలాకర్, రాజశేఖర్ రెడ్డి, సీసీఆర్బీ సీఐ సైదా నాయక్, సీసీఎస్ సీఐ సంజయ్ పాల్గొన్నారు.

నదీపాయలలో గల్లంతైన వ్యక్తి డెడ్​బాడీ లభ్యం

=పాపన్నపేట, వెలుగు: మంజీరా నదీ పాయలలో గల్లంతైన వ్యక్తి డెడ్​బాడీ మంగళవారం లభ్యమైనట్టు పాపన్నపేట ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. రెండు రోజుల కింద హైదరాబాద్ అంబర్ పేట నుంచి ఏడుపాయల వద్ద విందుకు వచ్చిన ప్రసాద్​ (32) నదీ పాయలలో ఈత కొడుతూ నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. రెండు రోజులు గజ ఈతగాళ్ల సహాయంతో ఎంత వెతికినా లాభం లేకపోయింది. మంగళవారం నీటి ప్రవాహం తగ్గడంతో చెక్​డ్యాం సమీపంలో అతడి డెడ్​బాడీ లభ్యమైంది. మృతుడి తండ్రి రామాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. 

భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

రామచంద్రాపురం,వెలుగు : ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రామచంద్రాపురం తహసీల్దార్ శివకుమార్​ హెచ్చరించారు. తెల్లాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్​లో పలు అక్రమ నిర్మాణాలను మంగళవారం అధికారులు కూల్చివేశారు. సర్వే నంబర్ 297 లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన  నిర్మాణాలను నేలమట్టం చేశారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. వీఆర్వోలు, వీఆర్​ఏలు లేకపోవడంతో ఇదే అదునుగా అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్​హెచ్చరించారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి

సిద్దిపేట రూరల్, వెలుగు : ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద జరిగింది. టూటౌన్ సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం..  పట్టణంలోని సాజీద్ పురా కు చెందిన ఎండీ అమిరుద్దీన్(80) సోమవారం రాత్రి  పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ సర్కిల్ రెలింగ్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. సిద్దిపేట డిపో కు చెందిన ఆర్టీసీ బస్సును డ్రైవర్​ సర్కిల్ నుంచి టర్న్ చేస్తుండగా ఆయనను ఢీకొట్టింది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి కుమారుడు ఎండీ ఆసిఫ్ పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. 

బస్సు, మినీ డీసీఎం ఢీకొని.. 

ఆర్టీసీ బస్సు, మినీ డీసీఎంలు ఢీకొని పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన ప్రకారం.. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌‌‌‌ వైపు వెళ్తుతున్న ఆర్టీసీ బస్సు ను సిద్దిపేట రంగీలా దాబా వద్ద ఎదురుగా వస్తున్న మినీ డీసీఎం ఢీ కొట్టింది. దీంతో డీసీఎం డ్రైవర్​ కామారెడ్డి జిల్లా మద్దునూర్ మండలం ఎలిగం గ్రామానికి చెందిన రవీందర్ కు కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణీకులకు స్వల్పగాయాలయ్యాయి. వారిని 108 ఆంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సిద్దిపేట టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నారు.

సిద్దిపేట మెడికల్ కాలేజీకి కొత్తగా 57 పీజీ సీట్లు 

సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట మెడికల్ కాలేజీకి కొత్తగా 57 పీజీ సీట్లకు అనుమతి లభించింది. నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి 11 కోర్స్ లలో 57 సీట్లు మంజూరయ్యాయి. కాలేజీ ఏర్పడిన కొద్దీ రోజుల్లోనే పీజీకి అనుమతి రావడం, అందులో అన్ని కోర్స్ లకు అవకాశం రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం 
కేసీఆర్ నాయకత్వం లో వైద్య విద్యకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు జరిగే కౌన్సిలింగ్ లో  సిద్దిపేట మెడికల్ 
కాలేజీలో 57 పీజీ సీట్లకు అప్షన్ ఉంటుందని చెప్పారు.

లేబర్ ఆఫీస్ ఎదుట బీడీ కార్మికుల ధర్నా 

రామాయంపేట, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎంఎస్ రాష్ట్ర బీడీ కార్మిక సంఘం అధ్యక్షుడు ఇదారి మల్లేశం ఆధ్వర్యంలో  బీడీ కార్మికులు రామాయంపేట లేబర్ ఆఫీస్ ఎదుట మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ చేగుంట దేశాయి బ్రదర్ కంపెనీకి చెందిన 40 బ్రాంచీలలో ప్రతినెలా ఒక్కో కార్మికురాలి నుంచి 2300 వందల బీడీలు కట్​ చేస్తున్నారన్నారు. అక్కన్నపేటలోని ఓ కంపెనీ కేవలం 15 నుంచి 18 రోజులే పని కల్పిస్తోందని ఆరోపించారు. కంపెనీ యాజమాన్యాలు కార్మికులకు వేతనాలు సక్రమంగా ఇవ్వడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం లేబర్ ఆఫీసర్ రాజుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మధు, లక్ష్మణ్, కార్మికులు శ్యామల, భారతి, జ్యోతి   తదితరులు 
పాల్గొన్నారు.

రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి 

కొండాపూర్, వెలుగు :  తమతో ఓటు బ్యాంకు రాజకీయం చేయొద్దని, సర్కారు వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) ఆధ్వర్యంలో కొండాపూర్ లో రైతులు ర్యాలీ నిర్వహించి, స్థానిక​తహసీల్దార్​ఆఫీస్​ ఎదుట ధర్నా చేశారు. తహసీల్దార్ రమాదేవికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బీకేఎస్​అధ్యక్షకార్యదర్శులు నరసింహారెడ్డి, రామకృష్ణారెడ్డి మాట్లాడారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని తెలిపారు. రాయితీలు, సబ్సిడీలు అందాక, ఎరువులు, విత్తనాలపై ధర నియంత్రణ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ధర్నాలో  రైతులు మల్లికార్జున్, మాణిక్ రెడ్డి, మొగులయ్య ,రాజు, వెంకటేశం, లక్ష్మీకాంత్ రెడ్డి, నాగన్న, రామచంద్రారెడ్డి, శంకరయ్య పాల్గొన్నారు.
వీఆర్ఏలకు మద్దతు..వీఆర్ఏలు రెండు నెలలకు పైగా సమ్మె చేస్తున్నా సర్కారులో చలనం లేకపోవడంతో సిగ్గుచేటని బీకేఎస్​ నాయకులు మండిపడ్డారు. వెంటనే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు మద్దతు తెలిపారు.

‘మన ఊరు మన బడి’ వర్క్స్​ స్పీడప్​ చేయాలి

సంగారెడ్డి టౌన్, వెలుగు : మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన  పనులను త్వరగా  కంప్లీట్​ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు ఆఫీస్​లో విద్యాశాఖ,  ఇంజనీరింగ్ శాఖల అధికారులతో పనుల పురోగతిపై మండలాలవారీగా కలెక్టర్ సమీక్షించారు. కొన్ని మండలాల్లో పనుల జాప్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులను వేగవంతం చేసి 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఇంజనీర్ల పై చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తైన పనులకు  బిల్లులు వెంట వెంటనే సమర్పించాలన్నారు. జిల్లాలో  331 పాఠశాలలలో  రూ.30 లక్షల లోపు పనులు చేపట్టామని,104 పాఠ శాలల్లో రూ.30 లక్షలకు పైబడిన పనులు చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు రూ.10 కోట్ల పనులు పూర్తి కాగా, రూ.7 కోట్లు చెల్లింపులు చేశామని వివరించారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ రాజర్షి షా, జిల్లా విద్యాధికారి రాజేశ్​పంచాయితీ రాజ్ ఈ ఈ జగదీశ్వర్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ  ఈఈ శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈ మధుసూదన్ 
పాల్గొన్నారు.

సిద్దిపేట మెడికల్ కాలేజీకి కొత్తగా 57 పీజీ సీట్లు 

సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట మెడికల్ కాలేజీకి కొత్తగా 57 పీజీ సీట్లకు అనుమతి లభించింది. నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి 11 కోర్స్ లలో 57 సీట్లు మంజూరయ్యాయి. కాలేజీ ఏర్పడిన కొద్దీ రోజుల్లోనే పీజీకి అనుమతి రావడం, అందులో అన్ని కోర్స్ లకు అవకాశం రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వం లో వైద్య విద్యకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు జరిగే కౌన్సిలింగ్ లో  సిద్దిపేట మెడికల్ కాలేజీలో 57 పీజీ సీట్లకు అప్షన్ ఉంటుందని చెప్పారు.
 

పోడు భూముల  సమస్యలు పరిష్కరించాలి

సంగారెడ్డి టౌన్/నారాయణ్ ఖేడ్,వెలుగు: పోడు భూముల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్,  లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాశ్​రాథోడ్, జిల్లా అధ్యక్షుడు సురేశ్​నాయక్ డిమాండ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీపీఎం నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏవో స్వర్ణలత కు అందజేశారు. నారాయణఖేడ్​లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడారు. ఫారెస్ట్ అధికారులు సాగు చేసుకుంటున్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లకు గురి కాకుండా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోండి

దుబ్బాక, వెలుగు: వేసిన రోడ్డు కొద్ది రోజులకే ధ్వంసం కావడానికి కారణమైన కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే రఘునందన్​రావు ఆదేశించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు  మిరుదొడ్డి మండలం లింగుపల్లి నుంచి రుద్రారం వరకు వేసిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. ఆరు నెలల కింద వేసిన బీటీ రోడ్డు గుంతలమయంగా మారడంతో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం లింగుపల్లి, -మల్లుపల్లి గ్రామాల శివారులోని పుట్ట ఎల్లమ్మ దేవాలయంలో పూజలు చేశారు. మల్లుపల్లి నుంచి సిద్దిపేటకు వెళ్లే ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని విద్యార్థులు ఎమ్మెల్యేను కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు వచ్చే విధంగా చూస్తానన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో అంబేద్కర్​ భవనం నిర్మించాలని దళిత సంఘాల నాయకులు ఎమ్మెల్యేకు విన్నవించారు. దీనికి స్పందిస్తూ కలెక్టర్​ను కలిసి ప్రోసిడింగ్​ తీసుకొచ్చి ఎమ్మెల్యే నిధుల నుంచి భవనాన్ని నిర్మించి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త కాశపాక భూపాల్​అనారోగ్యంతో మరణించిన విషయాన్ని తెలుసుకుని బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే 
పరామర్శించారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరికలు

జిన్నారం, వెలుగు:  జిన్నారం మండలం సోలక్ పల్లి, రాళ్లకత్వ, ఇమామ్ నగర్ గ్రామాల నుంచి పలువురు కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు మంగళవారం బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు నందీశ్వర్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నందీశ్వర్​గౌడ్​ మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో బీజేపీ జగన్ రెడ్డి, మహేశ్, శ్రీనివాస్,  వెంకటేశ్, నగేశ్,  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

దివ్వాంగులకు 
ఇండ్లు ఇయ్యాలె
నారాయణ్ ఖేడ్,వెలుగు: దివ్వాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని దివ్యాంగుల హక్కుల జాతీయవేదిక రాష్ట్ర ప్రధానకార్యదర్శి అడివయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఖేడ్ మండలం జూకల్ శివారులో నిర్మిస్తున్న డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లను సంఘం నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్వాంగులు వందలాదిమంది సొంతిళ్లు లేక అద్దె ఇండ్లలో ఇబ్బందులు 
పడుతున్నారని తెలిపారు. ఇండ్లలో 5శాతం దివ్యాంగులకు కేటాయిస్తామని 2017లో ప్రభుత్వం జీవో విడుదల చేసినా అమలు చేయడం లేదన్నారు. ఖేడ్ నియోజకవర్గంలోని దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 15 నుంచి 25 వరకు గ్రామాల్లో సభలు, నవంబర్​1 నుంచి 3 వరకు ఖేడ్ ఆర్డీవో కార్యాలయం ఎదుట 72 గంటల నిరాహారదీక్షలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రకాశ్​రావు, గోపాల్​రెడ్డి, డత్తు, బస్మాయిల్, లక్ష్మణ్, సంగమేశ్వర్, లక్ష్మి, ఫర్జానా, రాములు, రాజు, శోభారాణి, శ్రీనివాస్, పెంటయ్య, సుబాష్, సాయిలు 
పాల్గొన్నారు. 
 

స్కూళ్లలోని సమస్యలు పరిష్కరించాలి 
సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డీఈవో రాజేశ్​కు టీపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్​ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, రాంచందర్ మాట్లాడారు. 317 జీవో ప్రకారం వివిధ జిల్లాలకు టీచర్లు బదిలీ కావడంతో కొరత ఏర్పడిందన్నారు.  వెంటనే ఆయా చోట్ల టీచర్లను కేటాయించాలని, గెజిటెడ్ హెచ్ఎం లేని ప్రాంతాల్లో సీనియర్ ఉపాధ్యాయులకు అదనపు బాధ్యత అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్లు సంజీవయ్య, లక్ష్మయ్య యాదవ్, సోమశేఖర్, విజయభాస్కర్, అశోక్ కుమార్, సంతోష్ కుమార్, గోపాల్ ఉన్నారు.