ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెరుగైన వైద్య సేవలే మా లక్ష్యం

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా గ్రామాలలో  ఏఎన్ఎమ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రూరల్ మండలంలో పలు అభివృద్ధి  పనులను ఎంపీపీ శ్రీదేవి, జడ్పీటీసీ శ్రీహారి గౌడ్ తో కలిసి ప్రారంభించారు. బండచర్లపల్లి గ్రామంలో రూ.13.50 లక్షలతో 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను,  పుల్లూరు, చిన్నగుండవెళ్లి  గ్రామాలలో రూ.20 లక్షల నిధులతో నిర్మించబోయే ఏఎన్ఎమ్ సెంటర్ కు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో  వైస్ ఎంపీపీ యాదగిరి, టీఆర్ఎస్ పార్టీ రూరల్ అధ్యక్షులు ఎర్రయాదయ్య,  సర్పంచులు నరేశ్​గౌడ్, వాణి దశరదం, రఘోత్తం రెడ్డి పాల్గొన్నారు.

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

కోహెడ, వెలుగు : మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎంపీపీ కొక్కుల కీర్తి అన్నారు. శుక్రవారం మండలంలోని శనిగరం ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత్స్య సంపద పెరిగిందన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్​ఎంపీపీ తడకల రాజిరెడ్డి, నాయకులు కర్ర రవి, సుతారి కనుకయ్య, నక్క సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ సంక్షేమ పథకాలు

కోహెడ(బెజ్జంకి), వెలుగు : సీఎం కేసీఆర్​ హయాంలో గ్రామంలోని ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ అన్నారు. శుక్రవారం మండలంలోని తోటపల్లి, గాగిల్లపూర్, బెజ్జంకి ఎక్స్ రోడ్, దాచారం, ముత్తన్న పేట, బెజ్జంకి, పోతారం గ్రామాల్లో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కవిత, పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్​రెడ్డి, ఏఎమ్​సీ చైర్మన్​ రాజయ్య, రాష్ర్ట నాయకులు చింతకింది శ్రీనివాస్​ గుప్తా, లింగాల లక్ష్మణ్, మాచం శ్రీనివాస్, శేఖర్​బాబు, బోనగిరి శ్రీనివాస్ , సర్పంచులు పాల్గొన్నారు.

గ్రూప్ వన్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

సిద్దిపేట, వెలుగు : ఈ నెల 16న జరగనున్న గ్రూప్ వన్  ప్రిలీమినరీ పరీక్ష నిర్వహణకు సిద్దిపేట పట్టణంలో  పకడ్బందీగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఆఫీస్​లో  గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న  విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, అధికారులతో  సమావేశం నిర్వహించారు. పరీక్ష నిర్వహణకు ముందస్తు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ప్రిలిమినరీ పరీక్షకు సిద్దిపేట పట్టణంలో 24 కేంద్రాలను టీఎస్పీఎస్సీ గుర్తించిందని, పరీక్ష నిర్వహణకు 6వ తేదీలోగా సిద్ధం చేయాలని  సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రిన్సిపాల్ గదితోపాటు పరీక్ష నిర్వహించే అన్ని తరగతి గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష రోజు 24 గంటలు కోతలు లేని విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్​శాఖ ఎస్ఈ ప్రభాకర్ ను ఆదేశించారు. సెంటర్​ వద్ద మెడికల్​ క్యాంపుతోపాటు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడిచేలా చూడాలన్నారు. పకడ్బందీగా పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేయాలని సీపీకి సూచించారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ కోఆర్డినేటర్ గా జిల్లా అడిషనల్​కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని నియమించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చెన్నయ్య, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సూర్య ప్రకాశ్, కలెక్టరేట్ ఏవో రెహమాన్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. 

మెదక్ ​పట్టణాభివృద్ధికి కృషి 

మెదక్​ టౌన్, వెలుగు : మెదక్​ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా మని  మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్​ మున్సిపల్​ చైర్మన్​ చంద్రపాల్​ అధ్యక్షతన మెదక్​  మున్సిపల్​ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్​ మామిళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ పట్టణంలో గ్రీన్​ పార్కు జోన్, ఇండస్ట్రీయల్​ జోన్​ ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో ప్రభుత్వం పిట్లం చెరువు, గోసముద్రం చెరువులను కలుపుతూ మినీ ట్యాంక్​ బండ్​ ఏర్పాటు చేస్తామని మధ్యలోనే పనులు నిలిపివేశారని, వెంటనే కంప్లీట్​ చేయాలన్నారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ మెదక్​లో మినీ ట్యాంక్​బండ్​కు రూ.9 కోట్లు మంజూరు కాగా, మరో రూ.3 కోట్ల వరకు అదనపు నిధులు అవసరమవుతాయని, త్వరలోనే నిధులు మంజూరు చేయించి పూర్తి చేస్తామని చెప్పారు. మినీ ట్యాంక్​ బండ్​ వద్ద పెద్ద పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో పాటు ఇండస్ట్రీయల్​ జోన్​కు సంబంధించి ఆరు వందల ఎకరాలు తీసుకుంటామని,  రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా భూసేకరణ చేస్తామని తెలిపారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో కమిషనర్​ శ్రీహరి, డీఈ మహేశ్, అధికారులు దేవరాజ్, చంద్రమోహన్​, కౌన్సిలర్లు 
పాల్గొన్నారు. 

పండుగల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

సిద్దిపేట, వెలుగు :  బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సిద్దిపేట మున్సిపాల్టీలో  ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు మున్సిపల్ చైర్ పర్సన్ కడవెర్గు మంజు రాజనర్సు అన్నారు. శుక్రవారం నిర్వహించిన మున్సిపల్ సర్వ సభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. బతుకమ్మ నిమజ్జనాలు నిర్వహించే చెరువుల వద్ద ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పది అంశాల ఎజెండాకు మున్సిపల్ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశంలో వైస్ చైర్మన్ కనకరాజు, కమిషనర్ రవీందర్ రెడ్డితో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

మండల సభ బహిష్కరణ..

జగదేవపూర్, (కొమురవెల్లి), వెలుగు : ఎంపీపీ, అధికారుల తీరుకు నిరసనగా మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీలు బహిష్కరించారు. శుక్రవారం జగదేవపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బాలేశం గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు కిరణ్ గౌడ్, మహేందర్ రెడ్డి, మహేశ్, రమ్య మాట్లాడుతూ గ్రామాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు, ఎంపీపీ సమాచారం అందించడం లేదని, మూడు నెలలకు ఒకసారి జరిగే సభను మధ్యాహ్నం 2 గంటలకు బదులుగా ఉదయం 10 గంటలకు నిర్వహించాలని గత సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించినా విధానం మారలేదని అసహనం వ్యక్తం చేశారు. చాట్లపల్లి, ఇటిక్యాల సర్పంచులు నరేశ్, చంద్రశేఖర్ మాట్లాడుతూ మండల సభ దృష్టికి తీసుకువచ్చినా సమస్యలు పరిష్కారం కావడం లేదని, అలాంటప్పుడు సమావేశానికి ఎందుకు రావాలని ప్రశ్నించారు. మీటింగ్​కు ఎంపీటీసీలు, అన్ని గ్రామాల సర్పంచ్ లు హాజరయ్యేలా చూడాలన్నారు. ఈ క్రమంలో సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఎంపీపీ మాట్లాడుతూ మరో  రోజు సభను ఏర్పాటు చేసుకుందామని ప్రకటించారు.

టీఆర్ఎస్​కు ఓటమి భయం పట్టుకుంది

గజ్వేల్, వెలుగు : గజ్వేల్ ​నియోజకర్గంలో రాబోయే ఎన్నికలలో సీఎం కేసీఆర్​కు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్​రెడ్డి అన్నారు. కేసీఆర్ ​ఎనిమిదేండ్ల పాలనలో గజ్వేల్​ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. శుక్రవారం వర్గల్ ​మండలంలోని నాచారం గ్రామంలో బీజేపీ జిల్లా నాయకులు పూదరి నర్సింహ్మగౌడ్​ నేతృత్వంలో టీఆర్ఎస్​, కాంగ్రెస్​ పార్టీల నుంచి పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గ్రామంలో శ్రీకాంత్​రెడ్డి  పార్టీ జెండాను ఆవిష్కరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోనే రెండవ యాదగిరిగుట్టగా పేరుగాంచిన నాచగిరి లక్ష్మీనారసింహస్వామిని కేసీఆర్​పూర్తిగా విస్మరించారన్నారు. టీఆర్​ఎస్​ చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. రాబోయే రోజులలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గజ్వేల్ నియోజకవర్గంలోనే ప్రజలు బొంద పెడతారన్నారు. బీజేపీలో చేరిన వారిలో నాచారం వార్డు సభ్యులు శీలం నర్సింలు, దూసరి రాముగౌడ్, మాజీ సభ్యుడు రమేశ్, నాయకులు ఆంజనేయులు, కిట్టు, జగన్ గౌడ్ లతో పాటు పలువురు ఉన్నారు. 

అన్ని వర్గాల అభివృద్ధికి కృషి 

మునిపల్లి, వెలుగు: అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎంపీపీ శైలజ శివశంకర్, జడ్పీటీసీ పైతర మీనాక్షి సాయికుమార్​ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బొడశెట్​పల్లి, లింగంపల్లి, మొగ్దుంపల్లి, మేళసంగం గ్రామాల్లో వారు మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్​ప్రవీణ్​కుమార్, ఎంపీడీవో రమేశ్ చంద్ర కులకర్ణి, టీఆర్ఎస్​ లీడర్​ పైతర సాయికుమార్, సర్పంచులు వనిత పాండు,  జయ రంజని వెంకన్న గౌడ్,  బోయిని అశోక్,  కొమ్మగల్ల  శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ సంక్షేమ పథకాలు

కోహెడ(బెజ్జంకి), వెలుగు : సీఎం కేసీఆర్​ హయాంలో గ్రామంలోని ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ అన్నారు. శుక్రవారం మండలంలోని తోటపల్లి, గాగిల్లపూర్, బెజ్జంకి ఎక్స్ రోడ్, దాచారం, ముత్తన్న పేట, బెజ్జంకి, పోతారం గ్రామాల్లో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కవిత, పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్​రెడ్డి, ఏఎమ్​సీ చైర్మన్​ రాజయ్య, రాష్ర్ట నాయకులు చింతకింది శ్రీనివాస్​ గుప్తా, లింగాల లక్ష్మణ్, మాచం శ్రీనివాస్, శేఖర్​బాబు, బోనగిరి శ్రీనివాస్ , సర్పంచులు పాల్గొన్నారు.

లింగాయత్ భవనానికి 2న భూమి పూజ

కొమురవెల్లి, వెలుగు : హైదరాబాద్ లోని కోకాపేట్ లో 2న జరిగే వీరశైవ లింగాయత్ భవన నిర్మాణ భూమి పూజకు జిల్లా నుంచి వీరశైవ లింగాయత్ లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర వీరశైవ ధర్మ ప్రచార సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం కొమరవెల్లిలో వీరశైవ లింగాయత్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నరుకుల శివప్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్యాంక్ బండ్ పై బసవేశ్వర విగ్రహ ఏర్పాటుతో పాటు కోకాపేట్ లో వీరశైవ లింగాయత్ ల భవనానికి ఎకరం భూమి, రూ.10 కోట్లు కేటాయించినందుకు  సీఎం కేసీఆర్, ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కొమురవెల్లి దేవాలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ స్థానాచార్యులు పడిగన్న గారి మల్లేశం, కొమురవెల్లి మండల వీరశైవ లింగాయత్ సమాజం ఉపాధ్యక్షుడు నాగయ్య, కార్యదర్శి శశికర్, కోశాధికారి రవి,  సంయుక్త కార్యదర్శి ఆకుల విజయకుమార్ పాల్గొన్నారు.

మిరుదొడ్డిలో చైన్​ స్నాచింగ్​ 

దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో శుక్రవారం పోలీస్​స్టేషన్​కు కూతవేటు దూరంలో జరిగిన చైన్​ స్నాచింగ్​ ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన శకుంతల ఇంటి ముందు కూర్చొని బీడీలు చేస్తోంది. బైక్ వైచ్చిన​ వచ్చిన దుండగుడు శకుంతల మెడలోంచి ఐదు తులాల బంగారు గొలుసును లాగాడు. దీంతో ఆమె కింద పడిపోయింది. చైన్​ తెగి తూలం మేర అక్కడే పడగా,  నాలుగు తులాలు చైన్​స్నాచర్​ లాక్కెళ్లాడు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్​ ముందు నుంచే వెళ్లడం గమనార్హం. స్టేషన్​ బయట సీసీ కెమెరాలు ఉన్నా పని చేయకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

అట్టహాసంగా బతుకమ్మ సంబురాలు

ఉమ్మడి మెదక్​ జిల్లాలో బతుకమ్మ సంబురాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మెదక్​ పట్టణంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి, అడిషనల్ ​కలెక్టర్​ ప్రతిమాసింగ్, తూప్రాన్​లో జడ్పీ చైర్​ పర్సన్ ​హేమలత, నర్సాపూర్​లోని ఎళ్లంకి డిగ్రీ కాలేజీలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, సిద్దిపేట కలెక్టరేట్​లో కలెక్టర్​ ప్రశాంత్​జీవన్​ పాటిల్,  మిరు దొడ్డి మండలం ఖాజీపూర్​ గ్రామంలో  అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్మన్​ విమలక్క, సంగారెడ్డిలోని  భారతీనగర్ జీహెచ్​ఎంసీ డివిజన్​లో  బీజేపీ రాష్ట్ర మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. రంగురంగుల పువ్వులతో అందంగా పేర్చిన బతుకమ్మలు, మహిళల ఆటలు, కోలాటాలు, హుషారెత్తించే డీజే పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. వేడుకలకు మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. - వెలుగు, నెట్ వర్క్