ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

దుబ్బాక, వెలుగు: తొగుట మండలంలోని మల్లన్న సాగర్​ ప్రాజెక్ట్​లో చేపలు పెంచుకోవడానికి మత్స్యకారులకు హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే రఘునందన్​ రావు కోరారు. బుధవారం మిరుదొడ్డి మండల కేంద్రంలోని చెరువులో చేప పిల్లలను సర్పంచ్​ రాములుతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కొర్రమీను చేప పిల్లలను ప్రభుత్వం సరఫరా చేయాలన్నారు. ఈ పథకాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన చిన్నగల్ల భూదవ్వ, పద్మనాభునిపల్లి గ్రామానికి చెందిన కండ్లకోయ వినోద్​ఇటీవల చనిపోవడంతో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్​ వల్లాల సత్యనారాయణ, ఉప సర్పంచ్​అమర్​ తదితరులు  ఉన్నారు. 

ప్రతి గ్రామానికీ అవెన్యూ ప్లాంటేషన్ ఉండాలి

సంగారెడ్డి టౌన్, వెలుగు : ప్రతి గ్రామానికీ కనీసం మూడు కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ ఉండాలని, పెద్ద మొక్కలు నాటాల్సిన బాధ్యత ఎంపీవోదేనని సంగారెడ్డి కలెక్టర్​డాక్టర్​శరత్​అన్నారు. ప్రతి శుక్రవారం అన్ని పంచాయతీలలో వాటర్ డే నిర్వహించాలని సూచించారు. బుధవారం జిల్లా పరిషత్ మీటింగ్​ హాల్​లో డీఎల్పీవో లు, ఎంపీడీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీ సెక్రటరీలు, లీడర్లతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, ఈజీఎస్, వైకుంఠధామాలు, బాడీ ఫ్రీజర్, అవెన్యూ ప్లాంటేషన్, గ్రీన్ బడ్జెట్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను లక్ష్యం మేరకు ఇన్​టైంలో కంప్లీట్​చేసేందుకు ఆఫీసర్లు కృషి చేయాలన్నారు. క్రీడా ప్రాంగణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇంకా స్థలం గుర్తించని 44 గ్రామలలో ఈనెల 26లోగా కంప్లీట్​ చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పనులను గుర్తించి ఎస్టిమేషన్ చేయాలని, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇప్పుడున్న లేబర్ కు రెండింతల మొబైల్ జేషన్ జరగాలని చెప్పారు. వైకుంఠధామంలో అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు. పంచాయతీలకు పొడి చెత్త కంపోస్ట్ ఎరువు అమ్మకం ద్వారా ఆదాయం సమకూర్చాలని, దీనిపై ఎంపీవోలు, సెక్రటరీలు దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ రాజర్షి షా, డీఆర్డీవో శ్రీనివాసరావు, జడ్పీ సీఈ వో ఎల్లయ్య,  డీపీవో సురేశ్​మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పెండింగ్ కేసులు త్వరగా ఛేదించాలి
సిద్దిపేట రూరల్, వెలుగు : మహిళలకు సంబంధించిన పెండింగ్ కేసులను త్వరగా ఛేదించాలని సీపీ శ్వేత ఆఫీసర్లకు సూచించారు. బుధవారం హుస్నాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఇన్వెస్టిగేషన్ లో అలసత్వం వహించవద్దని సూచించారు. కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్, టెక్నికల్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండేలా చూసి నిందితులకు శిక్షలు పడేవిధంగా చూడాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ ఫణిందర్, చేర్యాల, హుస్నాబాద్​సీఐలు శ్రీనివాసులు, కిరణ్, సీసీఆర్బీ సీఐ సైదా నాయక్, హుస్నాబాద్ డివిజన్ ఎస్సైలు శ్రీధర్, నరేందర్ రెడ్డి, వివేక్, భాస్కర్ రెడ్డి, చంద్రమోహన్, నారాయణ   తదితరులు పాల్గొన్నారు.
సిటీ పోలీస్ యాక్ట్ అమలు
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 13 నుంచి 20 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ ఎన్.శ్వేత అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు. 

 

3.10 కోట్ల చేప పిల్లల పంపిణీ

మెదక్ (కొల్చారం), వెలుగు : జిల్లాలోని వివిధ మత్స్య సహకార సంఘాలకు ఇప్పటి వరకు 3.10 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేసినట్టు మెదక్​ జిల్లా మత్స్యశాఖ అధికారి రజని తెలిపారు. బుధవారం కొల్చారం మండలం కిష్టాపూర్, శివ్వంపేట మండలం గుండ్లపల్లి, దొంతి, చేగుంట మండలం పెద్ద శివనూర్​ మత్స్యసహకార సంఘాలకు సబ్సిడీ చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సీజన్​లో జిల్లా వ్యాప్తంగా 5 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాలనేది లక్ష్యమన్నారు. ఈ మేరకు ఆయా సొసైటీలకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.

పాపన్నపేట ఏఎంసీ ద్వారా పత్తి కొనుగోలు

మెదక్, వెలుగు : పాపన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)  ద్వారా కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయనున్నట్టు మెదక్​ అడిషనల్​కలెక్టర్ రమేశ్​ వెల్లడించారు. బుధవారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో2022–-23 సీజన్ లో  41,279 ఎకరాలలో పత్తి సాగు చేయగా, 33 వేల 23 మెట్రిక్ టన్నుల పత్తి వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. పత్తి కొనుగోలుకు ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.6,380గా ప్రకటించిందని చెప్పారు. అందోల్ మండలం రాంసానిపల్లిలోని సిద్దార్థ ఫైబర్ జిన్నింగ్ మిల్లుకు అనుసంధానమైన పాపన్నపేట ఏఎంసీ ద్వారా నవంబర్ మొదటి వారం నుంచి పత్తి కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. పత్తి రైతులకు టోకెన్లు ఇచ్చి ఏ రోజు పత్తిని తీసుకురావాలో అవగాహన కలిగించాలని ఆఫీసర్లకు సూచించారు. జిన్నింగ్ మిల్లు, గోడౌన్ల వద్ద అగ్నిప్రమాదాల నివారణకు నీటి వసతి, ఫైర్ ఫైటింగ్ పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి, లీగల్ మెట్రాలజీ సుధాకర్, జిల్లా మార్కెటింగ్ అధికారి రియాజ్,  ఏఎంసీ కార్యదర్శి ఈశ్వరయ్య, సీసీఐ  ప్రతినిధులు   తదితరులు 
పాల్గొన్నారు.

బీవీఆర్​ఐటీలో సిల్వర్ జూబ్లీ వేడుకలు 

నర్సాపూర్, వెలుగు:  నర్సాపూర్ బీవీఆర్​ఐటీ ఇంజనీరింగ్​ కాలేజీ సిల్వర్​ జూబ్లీ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టెక్నికల్ ఫెస్ట్ తో పాటు క్రీడాపోటీలు నిర్వహించారు. అంతర్జాతీయ టేబుల్​​టెన్నిస్​ క్రీడాకారిణి నైనా జైస్వాల్​ క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరమన్నారు. కాగా, వేడుకలకు జేఎన్​టీయూ ప్రిన్సిపాల్ డాక్టర్​ జయలక్ష్మి, టీఎస్​ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ ​శాంతా చీఫ్​ గెస్ట్​లుగా హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల నుంచి ఇంజనీరింగ్​ స్టూడెంట్స్​ తరలివచ్చారు. 

దుర్గమ్మసేవలో..

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయాన్ని బుధవారం నైనా జైస్వాల్​ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆమెకు ఆలయ మర్యాదలతో ఈవో శ్రీనివాస్​ఘన స్వాగతం పలికారు. 

మెదక్ చర్చి సందర్శన 

మెదక్ టౌన్​, వెలుగు: నైనా జైస్వాల్​ బుధవారం మెదక్​ కెథడ్రల్​ చర్చిని సందర్శించారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణానికి చెందిన కరాటే మాస్టర్​ నగేశ్, ఫిజికల్​ డైరెక్టర్​ ప్రతాప్​సింగ్, క్రీడాకారులు జుబెర్​, శ్రీనివాస్, ఏడుపాయల ఆలయ డైరెక్టర్​ చక్రపాణి ఆమెను సన్మానించారు.

స్వరాజ్య స్థాపనకు సబ్బండ కులాలు ఏకమవ్వాలి

దుబ్బాక, వెలుగు: తరాల నుంచి సామాజిక, ఆర్థిక, రాజకీయంగా అణిచివేయపడుతున్న కులాలు స్వరాజ్య స్థాపన కోసం ఏకమవ్వాలని దళిత్​ శక్తి ప్రోగ్రామ్(డీఎస్పీ)​ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ ​మహారాజ్​ అన్నారు. ఆయన చేపట్టిన స్వరాజ్య పాదయాత్ర బుధవారం మిరుదొడ్డి మండల కేంద్రానికి చేరుకుంది. మండల కేంద్రంలో డీఎస్పీ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వందకు పది మంది లేని రెడ్డి, వెలమలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నారని, 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు మాత్రం రాజకీయ బానిసలుగా బతకాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఓటు చైతన్యం, రాజకీయ విద్యను నేర్పి అట్టడుగు వర్గాలను అధికారంలోకి తీసుకొచ్చేందుకే స్వరాజ్య పాదయాత్రను చేపట్టినట్లు తెలిపారు. రేషన్​ షాపులల్లో సీఎం, పీఎం ఫోటోలు పెట్టుడేందని, భారత రాజ్యాంగం ద్వారా ప్రతి వ్యక్తికి ఆహార భద్రత కల్పించిన అంబేద్కర్ ఫొటోలు పెట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు ధర్మారం లక్ష్మీ మల్లయ్య, సుతారి నర్సింలు, మాజీ జడ్పీటీసీ నర్మాల చంద్రం, ఉప సర్పంచ్​ కనకయ్య, సబ్బండ కులాల నాయకులు పాల్గొన్నారు.

ట్రిపుల్ ఆర్ పేరుతో భూములు గుంజుకుంటే ఊరుకోం

కొండాపూర్, వెలుగు : ట్రిపుల్ ఆర్ పేరుతో రైతుల నుంచి భూములు గుంజుకుంటే ఊరుకోబోమని సీపీఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జయరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటులో భూములు కోల్పోతున్న గిర్మాపూర్, పెద్దాపూర్, చింతలపల్లి, ఇర్గిపల్లి, తాళ్లపల్లి, నాగపూర్ లో ఆయన పార్టీ నాయకులతో కలిసి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏటా రెండు పంటలు పండే సారవంతమైన భూములను గుంజుకొని చిన్న, సన్న కారు రైతులను రోడ్డున పడేసి బడా వ్యాపారులకు భూసాములకు కొమ్ముకాయడం తగదన్నారు. బంగారంలాంటి భూముల నుంచి రింగ్ రోడ్డు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.నరసింహులు, యాదవ రెడ్డి, నాయకులు అశోక్, రాజయ్య, రైతులు ఉన్నారు.

నిర్వాసితులకు న్యాయం చేస్తాం

సిద్దిపేట రూరల్, వెలుగు : కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రభావిత గ్రామాలలో మిగిలిన పునరావాసం, నష్ట పరిహారం చెల్లింపు, ఆర్ అండ్ ఆర్ కాలనీలలో మౌలిక వసతుల కల్పన తదితర సమస్యలన్నింటినీ పరిష్కరించి నిర్వాసితులకు న్యాయం చేస్తామని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆయన కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ముంపు గ్రామం, ఆర్ అండ్ ఆర్ కాలనీ కాంట్రాక్టర్లతో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చించారు. జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సిద్దిపేట గజ్వేల్ ఆర్డీవోలు అనంతరెడ్డి, విజేందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ డీఈ శ్రీనివాస్, కాంట్రాక్టర్ పాల్గొన్నారు.

గ్రూప్​ 1 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి 

మెదక్/సంగారెడ్డి టౌన్, వెలుగు : ఈ నెల 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్​కు అన్ని ఏర్పాట్లు చేశామని మెదక్, సంగారెడ్డి కలెక్టర్లు హరీశ్, శరత్​ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి టీఎస్​పీఎస్సీ చైర్మన్ డాక్టర్ జనార్దన్ రెడ్డి ఎగ్జామ్స్ నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 8,654 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. సంగారెడ్డిలో 12, పటాన్ చెరువులో 7, రామచంద్రాపురం లో 5, సదాశివపేటలో 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. మెదక్​ కలెక్టర్​ మాట్లాడుతూ జిల్లాలో 3,312 అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. మెదక్ లో 4, నర్సాపూర్ లో ఒకటి, తూప్రాన్ లో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.  అనంతరం కలెక్టర్లు సంబంధిత ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం మొదటిసారిగా బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థులను నిశితంగా పరిశీలించి పరీక్షా కేంద్రాలలోకి అనుమతించాలని నిర్ణయించిందన్నారు. అందుకు అభ్యర్థులను ఉదయం 8.30 గంటల నుంచి సెంటర్లలోకి పర్మిషన్​ ఇవ్వాలని సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువుల అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పొలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని ఆఫీసర్లకు సూచించారు