ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట పట్టణం 3వ వార్డు పరిధిలోని మిలాన్ గార్డెన్ సమీపంలో 10 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంక్ నిర్మాణ పనులకు మంత్రి హరీశ్​రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.50 కోట్లతో పది తరాలకు సరిపడేలా కొత్త సంవత్సరం నుంచి మల్లన్నసాగర్ ద్వారా సిద్దిపేటకు తాగునీరు అందించనున్నామని తెలిపారు. అనంతరం పట్టణంలో పిరమిడ్స్ స్పిరిచు వల్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా శాకాహార ర్యాలీని సిద్దిపేట బస్టాండు వద్ద ఆయన ప్రారంభించారు. పట్టణంలోని 15వ వార్డు ఇమాంబాద్ లో సీసీ రోడ్లు, వార్డు కార్యాలయం, 40వ వార్డు కాంచీట్ సర్కిల్ లో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీపీ మహేందర్, ఏసీపీ దేవారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం  తదితరులు ఉన్నారు. 

కేజీబీవీ సమస్యలపై టీపీటీఎఫ్ పోరాటం ఆగదు

సంగారెడ్డి టౌన్, వెలుగు : విద్యాశాఖ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, నిధుల విడుదలలో జాప్యం మూలంగా రాష్ట్రవ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అటు సిబ్బంది.. ఇటు విద్యార్థినులు సమస్యలతో సతమతమవుతున్నారని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల రామచందర్ ఆవేదన వ్యక్తం చేశారు.  సమస్యలు పరిష్కరించేంత వరకూ టీపీటీఎఫ్​ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం సంగారెడ్డి లోని ఉపాధ్యాయ భవన్​లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టకుండా  ప్రభుత్వం నిర్లక్ష్యం 
చేస్తోందన్నారు. మూడేళ్లుగా స్టూడెంట్స్​కు నోటు పుస్తకాల సరఫరా చేయడం లేదని, వారికి సరిపడా బెడ్ షీట్లు, దుప్పట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గురుకుల ఉపాధ్యాయులతో సమానంగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ సాధన కోసం ఈనెల 15,16వ  తేదీలలో కేజీబీవీల ముందు నిర్వహించే నిరసన కార్యక్రమాలను సక్సెస్​ చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు లక్ష్మయ్య యాదవ్, విజయభాస్కర్, నాసర్ పటేల్, మల్లికార్జున్, పుండరికం, రామ్ చందర్, ఆనందం తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

జోగిపేట, వెలుగు : విద్యార్థి దశలోనే న్యాయవ్యవస్థలోని చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహనను పెంచుకోవాలని జోగిపేట మున్సిఫ్‌ కోర్టు మెజిస్ట్రేట్‌ ధనలక్ష్మి సూచించారు. ఆదివారం మండల లీగల్‌ సేల్‌ ఆధ్వర్యంలో అందోల్​లోని బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలోని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగంలోని హక్కులు, న్యాయవ్యవస్థలోని చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. అనంతరం  పాఠశాలలో డైనింగ్‌ హాల్‌ను సందర్శించి, వండిన భోజనాన్ని పరిశీలించారు. వాటిని జాగ్రత్తగా భద్రపరచాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన ఇంటర్‌ సెకండీయర్‌ చదువుతున్న సౌజన్యను, జాతీయ స్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు ఎంపికైన సవ్రంతిని ఆమె అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రత్నరాజు, అధ్యాపకులు స్వర్ణలత, సతీశ్, పుష్పలత, ఎస్సై పెంటయ్య పాల్గొన్నారు. 

ఉత్సాహంగా పిల్లల పండుగ

జహీరాబాద్, వెలుగు:  బాలల దినోత్సవం సంద ర్భంగా  పట్టణంలో నిర్వహించిన జహీరాబాద్ పిల్లల పండుగ ఉత్సాహంగా.. ఉల్లాసంగా జరిగింది. శనివారం జహీరాబాద్ శ్రామిక విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పట్టణంలోని ఆదర్శ విద్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 40 స్కూళ్లకు చెందిన 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వేడుకల్లో పాటలు, ఆటలు, డాన్స్, నా టికలు, ఏకపాత్రాభినయం, మ్యూజిక్, మట్టితో బొమ్మలు, రైమ్స్, స్టోరీ టెల్లింగ్, స్టోరీ రైటింగ్, లేఖారచన, డ్రాయింగ్, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. చిన్నారులు ఆకట్టుకునే వేషధారణలో హాజరై సందడి చేశారు. పాల్గొన్న ప్రతి విద్యార్థికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందజేశారు. విజేతలకు జ్ఞాపికలు, మెడల్స్ పంపిణీ చేశారు. చిన్నారుల్లోని నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు జహీరాబాద్ పిల్లల పండుగ పేరుతో చిల్డ్రన్ ఫెస్ట్ నిర్వహించినట్లు నిర్వహణ సమన్వయకర్త డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. 

‘కొండపోచమ్మ’ వార్షికోత్సవాలు ప్రారంభం 

జగదేవపూర్(కొమురవెల్లి ), వెలుగు: మండలంలోని తీగుల్ నర్సాపూర్ సమీపంలోని కొండపోచమ్మ అమ్మవారి 21వ వార్షిక వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకలో భాగంగా మొదటి రోజు అమ్మవారికి గణపతి పూజ, పుణ్యాహ వాచనం, అఖండ దీపస్థాపన, అగ్ని ప్రతిష్ఠాపన, మూలమంత్ర హవనం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, ఆలయ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, ఈఓ మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండపోచమ్మ ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ  మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవం గా నిర్వహిస్తామన్నారు. ఈనెల 15న శివపార్వతుల కల్యాణం ఉంటుందన్నారు. మాదాసు శ్రీనివాస్  మాట్లాడుతూ అమ్మవారి అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఎండోమెంట్ అధికారులకు సీఎం కేసీఆర్ సూచించినట్లు  తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మండల కోఅప్షన్ మెంబర్ ఎక్బాల్, డైరెక్టర్లు ఆర్ కే శ్రీనివాస్, ముచపతి బాలయ్య, శ్రీశైలం యాదవ్​ ఉన్నారు.

ప్రజలను మోసగిస్తున్న గీతారెడ్డి

జహీరాబాద్, వెలుగు :  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ప్రజలను మోసగిస్తున్నాయని మాజీ మంత్రి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గీతారెడ్డి అన్నారు. ఆదివారం జహీరాబాద్ లోని ఆమె స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చి ప్రాణాలను హరిస్తోందన్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కార్​ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో 54 లక్షల దళిత కుటుంబాలు ఉండగా దళిత బంధు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఇంటింటికీ నీరు అందిస్తేనే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానన్నా కేసీఆర్ ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలకు భగీరథ నీళ్లు ఇస్తున్నారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం టన్ను చెరుకుకు రూ.4 వేల చొప్పున ఇస్తుండగా,  ఇక్కడి కర్మాగారాలు రైతులకు రూ.3270 మాత్రమే చెల్లిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోందన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పదివేల మంది శ్రేణులు యాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో  కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నరసింహారెడ్డి, భీమయ్య, ఖండెం నరసింహులు, భాస్కర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సిద్దిపేట ప్లేయర్​

సిద్దిపేట రూరల్, వెలుగు : జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సిద్దిపేట జిల్లా క్రీడాకారుడు ఎంపికయ్యాడు. వంశీకృష్ణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొని ప్రతిభ కనబర్చారు. ఈ నెల 6 నుంచి సరూర్ నగర్ స్టేడియం లో జరిగిన రాష్ట్ర స్థాయి క్యాంపులో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఆదివారం జరిగిన ఫైనల్ సెలక్షన్లలో రాష్ట్ర కబడ్డీ జట్టుకి ఎంపికయ్యాడు.  ఈ నెల 17 నుంచి 20 వరకు రిషికేశ్​ - హరిద్వార్ లో జరిగే 48వ జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలలో వంశీకృష్ణ ఆడనున్నాడు. కాగా అతడి ఎంపిక పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ల శివకుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

రేషన్​ బియ్యంలో కంకర రాళ్లు

పాపన్నపేట, వెలుగు: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్​బియ్యం దారుణంగా వస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఆదివారం పాపన్నపేట మండలం కొడుపాకలోని నంబర్ వన్​ రేషన్​ షాపులోని ఓ బియ్యం బస్తాలో పెద్ద సైజు కంకర రాళ్లు, తాగిన బీడీలు వచ్చాయి. పేదల పట్ల ప్రభుత్వానికి, అధికారులకు ఇంత నిర్లక్ష్యమా? అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రేషన్​ డీలర్​ గోడౌన్​ ఇన్​చార్జి​నర్సింగరావుకు ఫోన్​చేసి విషయం చెప్పారు.