ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్, వెలుగు : మెదక్​ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వ పనులకు సంబంధించి భూసేకరణ, సర్వే పనులు స్పీడప్​ చేయాలని అడిషనల్​ కలెక్టర్ రమేశ్ సంబంధిత అధికారులను​ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల పురోగతి, భూసేకరణ, 13వ ప్యాకేజీ పనులకు సంబంధించి ఇరిగేషన్​, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఏజెన్సీ లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాల్వ నిర్మాణానికి భూ సేకరణ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. రామాయంపేట, చిన్నశంకరంపేట్ కు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణానికి పెగ్ మార్కింగ్ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే పనులను సైతం పూర్తిచేసి నివేదికను అందజేయాలన్నారు.  ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కొండపోచమ్మ జలాశయం నుంచి ఈ యాసంగిలో రామాయంపేట, చిన్నశంకరంపేట్ మండలాలలోని కొన్నిఎకరాలకైనా సాగు నీరందించేలా కృషి చేయాలని ఏజెన్సీలను కోరారు. సమావేశంలో మెదక్​ ఆర్డీఓ సాయిరామ్, ఇరిగేషన్​ఈఈ శ్రీనివాస్ రావు, ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు  పాల్గొన్నారు.

చెరువు సర్వేను అడ్డుకున్న తండావాసులు

నారాయణ ఖేడ్, వెలుగు : నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగలిగిద్ద మండలం శ్యామ నాయక్ తండా పరిధిలో సుమారు 35 ఎకరాలలో ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన చెరువు సర్వే పనులు బుధవారం గిరిజనులు అడ్డుకుని నిరసన తెలిపారు. లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాశ్​రాథోడ్, జిల్లా అధ్యక్షుడు సురేశ్ ​నాయక్ వారికి మద్దతుగా నిలిచి మాట్లాడారు. ముందస్తుగా గ్రామసభ నిర్వహించకుండా, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఆఫీసర్లు తమ భూముల్లో చెరువు నిర్మిస్తామని సర్వేకు రావడమేంటని అన్నారు.  తమ ప్రాణాలు పోయినా సరే చెరువు కోసం భూములు మాత్రం ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఆందోళనలో శ్యామ నాయక్ తండా, ఇనాక్ పల్లి తండావాసులు  తదితరులు పాల్గొన్నారు.  

పాపన్న పోస్టల్ స్టాంప్ విడుదల చేయడం అభినందనీయం

నర్సాపూర్, వెలుగు :  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పాపన్న గౌడ్ పోస్టల్ స్టాంప్ ను విడుదల చేయడం అభినందనీయమని గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశ్​గౌడ్ అన్నారు. బుధవారం ఆయన నర్సాపూర్ పట్టణంలో గౌడ సంఘం నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎనిమిదేండ్లు అధికారంలో ఉన్న టీఆర్​ఎస్​ సర్కారు గౌడ కులస్తుల సంక్షేమాన్ని  ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రతి గ్రామంలో బెల్టుషాపులను విచ్చలవిడిగా తెరిపించి రూ.10 వేల కోట్ల ఉన్న మద్యం 
ఆదాయాన్ని రూ.46 వేల కోట్లకు పెంచి గౌడ కులస్తులను నిండా ముంచిందని మండిపడ్డారు. కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన వెంట బీజేపీ నాయకులు రమేశ్​గౌడ్, అంజిగౌడ్, గుండం శంకర్  తదితరులు ఉన్నారు.

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి

కంది, వెలుగు :  సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ బుధవారం ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మున్సిపల్ మేనేజర్ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో ని సిద్ధార్థనగర్ కాలనీలో  సర్వే నంబర్ 196లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. కాలనీ వాసుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట సిద్ధార్థనగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లయ్య, తదితరులు ఉన్నారు.

పోలీస్ అమర వీరుల ఆశయ సాధనకు కృషి చేయాలి

సిద్దిపేట రూరల్, వెలుగు: పోలీస్​ అమర వీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిద్దిపేట సీపీ ఎన్. శ్వేత కోరారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం పోలీస్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. రక్తదానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని కోరారు.  శిబిరం ద్వారా సేకరించిన 180 యూనిట్ల రక్తాన్ని సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్  బ్లడ్ బ్యాంకు ఆమె అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, ఏసీపీలు దేవారెడ్డి, రమేశ్, సతీశ్, ఫణీందర్, ఎస్బీ ఇన్స్​పెక్టర్​రఘుపతి రెడ్డి, రిజర్వ్ ఇన్స్​పెక్టర్లు రాజశేఖర్ రెడ్డి,  ధరణి కుమార్, శ్రీధర్ రెడ్డి, రామకృష్ణ, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ పాల్గొన్నారు. 

సిటీ పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 27 నుంచి నవంబర్​3 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ శ్వేత తెలిపారు. అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు. 

వ్యాస రచన పోటీలు 

కంది, వెలుగు :  పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలలో భాగంగా సంగారెడ్డి జిల్లా పోలీస్ కల్యాణ మంటపంలో బుధవారం పోలీసు ఆఫీసర్లు,  సిబ్బందికి వ్యాస రచన పోటీలను నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ ఉషావిశ్వనాథ్, డీసీఆర్​బీ, ఎస్బీ ఇన్స్​పెక్టర్లు జలంధర్​రెడ్డి, మహేశ్​గౌడ్ పోటీలను పర్యవేక్షించారు.

రక్త దానం గొప్పది

నర్సాపూర్, వెలుగు: అన్ని దానాల కన్నా రక్త దానం గొప్పదని నర్సాపూర్ సీఐ షేక్ లాల్ మదర్ అన్నారు. బుధవారం నర్సాపూర్ పోలీస్ స్టేషన్  ఆవరణలో  రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు రక్తదానం చేశారు.  కార్యక్రమంలో ఎస్సై గంగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

కంది, వెలుగు :  అన్ని సౌకర్యాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని  సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ఆఫీస్​ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి ఆఫీసర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.  పోడు భూములు, ఆధార్ లింక్, అంగన్​వాడీ డే,  ధరణి, తదితర విషయాలపై దిశా నిర్దేశం చేశారు.  పౌరసరఫరాలు, మార్కెటింగ్,  వ్యవసాయ తదితర శాఖల ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 

పోడు భూముల వివరాలు ఇయ్యాలి 

జిల్లాలో పోడు భూముల వెరిఫికేషన్ పూర్తి చేసిన మండల, గ్రామపంచాయతీ, అటవీశాఖ అధికారులను కలెక్టర్ అభినందించారు. డివిజన్ స్థాయి కమిటీ సమగ్రంగా పరిశీలించి ఈనెల 31 లోగా జిల్లా కమిటీకి నివేదిక సమర్పించాలని సూచించారు.

ధరణి  సమస్యలపై జాప్యం వద్దు 

ధరణి  సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేయొద్దని కలెక్టర్​ సూచించారు. రిపీట్ పిటిషన్స్ కోసం ప్రత్యేకించి రిజిస్టర్ పెట్టాలన్నారు. బ్యాంకు లింకేజీ లక్ష్యం పూర్తి కావాలన్నారు. ఇటీవల జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధుల నుంచి వివిధ శాఖలపై వచ్చిన పిటిషన్స్ కు సంబంధించి యాక్షన్ టేకెన్ రిపోర్టు ఇవ్వాలని ఆయా ఆఫీసర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్​ కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, డీఆర్ఓ రాధికారమణి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్​డీఓ పీడీ శ్రీనివాసరావు, ఆయా శాఖల జిల్లా, డివిజన్లు, మం డలాల ఆయా ఆఫీసర్లు,  ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.

వంద శాతం పూర్తిచేయాలి

జిల్లాలో ఆధార్ సీడింగ్ వంద శాతం పూర్తి కావాలన్నారు. ఈనెల 31 లోగా ఓటరు ఐడీ కార్డుకు ఆధార్ అనుసంధానం గ్రామీణ ప్రాంతాల్లో  90 శాతం, మున్సిపాలిటీలలో 85 శాతం, అర్బన్ ఏరియాలో (జీహెచ్ఎంసీ) 80 శాతానికి తగ్గ రాదని కలెక్టర్ స్పష్టం చేశారు. లక్ష్యం మేరకు పూర్తి కానట్లయితే బీఎల్ఓ  మొదలు ఏఈఆర్ఓ, ఈఆర్ఓ లపై చర్యలు తీసుకుంటామన్నారు.
.
ఫీజుల పెంపు జీవో ను ఉపసంహరించుకోవాలి

సిద్దిపేట రూరల్, వెలుగు : ఇంజనీరింగ్ ఫీజుల పెంపు జీవో ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల శంకర్ డిమాండ్ చేశారు.  ఈ విషయమై బుధవారం ఏఐవైఏఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ, వృత్తి విద్య కోర్సుల స్టూడెంట్స్ ఫీజు బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో ఏఐవైఏఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మిట్టపల్లి సుధాకర్, బొడ్డు నరేశ్, నవీన్  తదితరులు పాల్గొన్నారు.

ఏపీఓ ఫ్యామిలీకి ఆర్థికసాయం

మెదక్ (నిజాంపేట), వెలుగు : సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ ఉపాధి హామీ ఏపీవో గా పనిచేసిన నిజాంపేట్  మండల పరిధి నస్కల్ గ్రామానికి చెందిన గందే మల్లేశం(48) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడు. ఈ నేపథ్యంలో బుధవారం సిద్దిపేట డీఆర్డీవో గోపాల్ రావు, అసిస్టెంట్ డీఆర్డీవో కౌసల్య గ్రామానికి వచ్చి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.  రూ.2.50 లక్షల సాయం అందజేశారు. వారి వెంట నిజాంపేట్ ఎంపీపీ సిద్ధిరాములు ఉన్నారు.