
దుబ్బాక, వెలుగు : కాంట్రాక్టర్లకు వత్తాసు పలకకుండా అభివృద్ధి పనుల్లో నాణ్యతా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు మున్సిపాల్టీ అధికారులను ఆదేశించారు. గురువారం దుబ్బాక పట్టణంలోని 17వ వార్డులో ఎమ్మెల్యే పర్యటించారు. కాలనీవాసులు పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ గణేశ్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడుతూ మురుగు కాల్వలు, సీసీ రోడ్డు నిర్మాణాలు, తాగు నీరు, శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలు, తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయన వెంట కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి, సర్పంచులు భిక్షపతి, రెడ్డి దేవిరెడ్డి, బీజేపీ నాయకులు అంబటి బాలేశ్‌గౌడ్, వెంకట్‌గౌడ్, సుభాష్‌రెడ్డి, మచ్చ శ్రీనివాస్,పుట్ట వంశీ, బద్రి ఉన్నారు.
సంగారెడ్డి టౌన్/మెదక్‌టౌన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం పలుచోట్ల బీజేపీ లీడర్లు ఆందోళన నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ఎంపీ బండి సంజయ్ కుమార్ ను అక్రమంగా అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రాల్లో రహదారిపై ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సంగారెడ్డిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంత్ రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు అశ్వంత్, పట్టణ అధ్యక్షులు ప్రసాది రవిశంకర్, కంది మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మెదక్‌లో టౌన్ ప్రెసిడెంట్ప్రసాద్, రాష్ట్ర సభ్యులు బక్క వారి శివకుమార్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
పెద్ద శివనూర్ సందర్శించిన ఎమ్మెల్యే
మెదక్ (చేగుంట), వెలుగు : చేగుంట మండలం పెద్ద శివనూర్ లో విరేచనాలతో నలుగురు మృతి చెందిన నేపథ్యంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు గురువారం గ్రామాన్ని సందర్శించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. మరణాలకు కారణమేంటని ప్రశ్నించగా ఇప్పటివరకు పరీక్షలలో ఏమి తేలలేదని వారు తెలిపారు. ఆహార పరీక్షకు సంబంధించిన నివేదిక రావాల్సి ఉందని వివరించారు. కారణాలు వెంటనే గుర్తించి తగిన చికిత్స అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం గ్రామంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను, అస్వస్థతకు గురైన వారిని పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు.
పల్లె దవాఖానాలకు భూమిపూజ
మెదక్ (చేగుంట), వెలుగు : చేగుంట మండలం రెడ్డిపల్లి, గొల్లపల్లిలో గురువారం కేంద్ర ప్రభుత్వం నిధులతో జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద పల్లె దవాఖానాల భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే రఘునందన్‌రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. జాతీయ ఆరోగ్య పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో 2,600 పల్లె దవాఖానాలకు బిల్డింగ్ లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో భాగంగా చేగుంట మండలంలో ఏడు భవనాలు మంజూరైనట్టు వెల్లడించారు. కార్యక్రమంలో చేగుంట వైస్ ఎంపీపీ రామచంద్రం, బీజేపీ మండల అధ్యక్షులు భూపాల్, వేణుగోపాల్, సర్పంచ్ ఎల్లారెడ్డి, ఎంపీటీసీ రవి, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కర్ణం గణేశ్, రఘువీర్ రావు, గోవింద్, పాండు, రాకేశ్ పాల్గొన్నారు.
సీఎంఆర్ సకాలంలో అందజేయాలి
సిద్దిపేట, వెలుగు : గత వానాకాలం సీజన్ కు సంబంధించి ఎఫ్‌సీఐకి బాకీ ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ ను ఇన్ టైంలో అందజేయాలని సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మిల్లర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ పై మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల30 తర్వాత కస్టమ్ మిల్లింగ్ బియ్యం డెలివరీ తీసుకోబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం విధించిన గడువు లోపల తమ టార్గెట్ పూర్తి చేయకపోతే వారి నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 125 శాతం బియ్యం రికవరీ చేస్తామని తెలిపారు. వానాకాలం సీజన్ కు సంబంధించి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. సమావేశంలో సివిల్ సప్లయ్ డీఎం జె.హరీశ్‌తో పాటు అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు.
ఎగ్జామ్ ను పకడ్బందీగా నిర్వహించాలి...
సిద్దిపేట రూరల్, వెలుగు: టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామ్ ను పకడ్బందీగా నిర్వహించాలని సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి ఏర్పాట్ల పై కలెక్టర్ ఆఫీస్ లో గురువారం ఆయన అధ్యక్షతన జిల్లా రెవెన్యూ, రవాణా, పోలీస్, వైద్య శాఖ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 7న ఉదయం 10- నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5- గంటల పరీక్ష నిర్వహించనున్నామని తెలిపారు. ఇందూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే ఈ పరీక్ష నిర్వహణలో పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. అడిషనల్ డీసీపీ మహేందర్, డీఆర్ఓ చెన్నయ్య పాల్గొన్నారు.
భూతగాదాతో వ్యక్తి ఆత్మహత్య
కోహెడ(హుస్నాబాద్), వెలుగు: తండ్రి, కొడుకుల మధ్య ఉన్న భూతగాదాల కారణంగా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గొల్లకుంటలో జరిగింది. ఎస్సై వివేక్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఇట్టబోయిన రాజు(41) తండ్రి కనకయ్యకు ఐదు ఎకరాల భూమి ఉంది. ఇందులో ఎకరంన్నర భూమిని కనకయ్య రెండో భార్య కూతురి పేరిట రాశాడు. మిగతా భూమిలో రాజు వరి పంట సాగు చేశాడు. కోత దశకు వచ్చిన పంటను సోమవారం కోసేందుకు కొడుకు వెళ్లాడు. కానీ తండ్రి తానే వరి పంట కోసుకుంటాననని అడ్డుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన రాజు పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి అతడు చనిపోయాడు. మృతుడి భార్య రాధిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
సిద్దిపేట రూరల్, వెలుగు : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం.. సిద్దిపేట పట్టణం ఇందిరానగర్ కు చెందిన గంగసాని లింగారెడ్డి కుమారుడు నాగేంద్రబాబు (25) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి పని ముగించుకొని స్నేహితులతో కలసి సిద్దిపేట పట్టణ శివారులోని తమిళనాడు హోటల్ కు టీ తాగడానికి వెళ్లాడు. అక్కడే టాయిలెట్ కోసం రోడ్డు దాటుతుండగా కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ అతడిని వేగంగా ఢీకొట్టింది. స్నేహితులు వెంటనే అతడిని అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా చనిపోయాడు. మృతుడి తండ్రి లింగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
కేంద్ర సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా ఉపేందర్గుప్తా
చేర్యాల, వెలుగు : సామాజిక వేత్త, రాష్ట్ర బీజేపీ నాయకుడు మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా కేంద్ర సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా నియమితులయ్యారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామానికి చెందిన ఉపేందర్ గుప్తా పార్టీలో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఆయనను సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా నియమించడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.