ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెడికల్ కాలేజ్ నేడు ప్రారంభం కానుంది. మంగళవారం హెల్త్​ మినిష్టర్ హరీశ్​రావు మెడికల్​ కాలేజీలో క్లాసులను ప్రారంభిస్తారని హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ వెల్లడించారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్​రావు సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశామని, 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం హామీ ఇచ్చిన మేరకు కాలేజీని నేడు ప్రారంభించుకుంటున్నామన్నారు. దీంతోపాటు జిల్లా మహిళా సమైక్య షాపింగ్ కాంప్లెక్స్ భూమి పూజ, చెక్కుల పంపిణీ, మెడికల్ కళాశాల స్టూడెంట్స్ , పేరెంట్స్ తో ఇంట్రాక్ట్ సమావేశం ఉంటుందన్నారు. 

ఘనంగా స్వాగత ఏర్పాట్లు 

మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవానికి కంది మండల కేంద్రంలోని కింగ్స్ ప్యాలెస్ నుంచి మెడికల్ కాలేజీ వరకు 600 బైకులతో స్వాగతం చెప్పేలా ఏర్పాట్లు చేశామని చింతా ప్రభాకర్​తెలిపారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సక్సెస్​చేయాలని కోరారు. అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చినందుకు సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లాలో వైద్యవసతులు మెరుగుపడటంతో పాటు ,ఉపాధి లభిస్తుందని, జిల్లాలోని స్టూడెంట్స్​కు డాక్టర్​ కోర్సు చదివే అవకాశం కలుగుతుందన్నారు. సమావేశంలో డీసీఎంఎస్​ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, లైబ్రరీ చైర్మన్ నరహరి రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, విజయేందర్ రెడ్డి, విఠల్ పాల్గొన్నారు.

ప్రభుత్వ స్కీంలను ఉపయోగించుకోవాలి 

మెదక్ (పెద్ద శంకరంపేట), వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీంలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట మండలం బద్దారం గ్రామానికి చెందిన శ్రీనివాసచారికి అత్యవసర చికిత్స కోసం  ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.2.50 లక్షల ఎల్​వోసీ అందించారు.  

ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రజావాణి

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అడిషనల్​కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాగా ప్రజావాణిలో భూ సంబంధిత, డబుల్ బెడ్ రూం, ఆసరా పింఛన్లు తదితర అంశాల పై 36 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్వో చెన్నయ్య, కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రహమాన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం బదిలీపై వెళుతున్న  డీఆర్వో చెన్నయ్యను రెవెన్యూ అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి, కొత్తగా జిల్లాకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా వచ్చిన లక్ష్మీ కిరణ్, డీఏవో శివప్రసాద్, హార్టికల్చర్​ఆఫీసర్​రామలక్ష్మి, బీసీ అభివృద్ధి అధికారి సరోజ, పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దు 

సంగారెడ్డి టౌన్ ,వెలుగు:  వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులపై చర్యలు తీసుకోవడంలో  అధికారులు జాప్యం చేయొద్దని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్  పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో  అదనపు కలెక్టర్లు  రాజార్షి షా, వీరారెడ్డి లతో కలిసి అర్జీదారుల  నుంచి   అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై  38 దరఖాస్తులు  వచ్చాయని కలెక్టర్​తెలిపారు. మెదక్​ టౌన్​, వెలుగు: మెదక్​కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్​కలెక్టర్ రమేశ్, డీఎస్వో శ్రీనివాస్ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 44 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఇష్టపడి చదివి ఉన్నతంగా ఎదగండి

పటాన్​చెరు,వెలుగు: విద్యార్థులు కష్టపడి కాకుండా, ఇష్టపడి చదివి భవిష్యత్​లో ఉన్నతంగా ఎదగాలని పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి విద్యార్థులకు సూచించారు.  సోమవారం బాలల దినోత్సవం సందర్భంగా పటాన్​ చెరులోని జడ్పీ బాలికల హైస్కూల్​నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి ప్రభుత్వ స్కూళ్లలో చదివిన ఎంతోమంది ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉన్నారని, తను కూడా ఓ ప్రభుత్వ స్కూల్​విద్యార్థినేనని గుర్తుచేశారు. టీఆర్ఎస్​ పాలనలో ప్రభుత్వ స్కూళ్లకు ఎంతో 
ప్రాధాన్యమిస్తున్నామన్నారు.

సంక్షేమ పథకాలు పేదలకు వరం

దుబ్బాక, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు పేదలకు వరమని, వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్​రావు సూచించారు. సోమవారం మిరుదొడ్డి మండల కేంద్రంలో 105 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను జడ్పీ చైర్​పర్సన్​ రోజా శర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్​ హుస్సేన్​తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని తెలిపారు. పేదింటి ఆడ బిడ్డ తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి పథకం ఊరటనిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గజ్జెల సాయిలు, డీసీసీబీ డైరెక్టర్​ వెంకటయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కర చారి, వైస్​ ఎంపీపీ పోలీస్​ రాజు, సర్పంచ్​ల ఫోరం మండల అధ్యక్షులు బాల్​రాజు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.