మళ్లీ మొదటికి వచ్చిన తాళ్ల రాంపూర్​ స్కామ్​

మళ్లీ మొదటికి వచ్చిన తాళ్ల రాంపూర్​ స్కామ్​

ఆరు నెలలుగా సాగుతున్న  వేలం ప్రక్రియకు బ్రేక్​..
ఆస్తుల వేలంపై  ట్రిబ్యునల్​ను ఆశ్రయించిన మాజీ చైర్మన్​
జప్తులో 50 శాతం సొమ్మును డిపాజిట్​చేయాలని తీర్పు
నిందితులను కాపాడుతున్నారని  బాధితుల ఆరోపణ
త్వరగా డబ్బులు చెల్లించాలని డిమాండ్​


నిజామాబాద్ : ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్‌‌ సొసైటీలో అక్రమాల కథ మళ్లీ మొదటికొచ్చింది. స్కామ్ ​రిపోర్టులో అవాస్తవాలు ఉన్నాయని, తన ఆస్తులు వేలం వేయొద్దని  ప్రధాన నిందితుడైన సొసైటీ మాజీ చైర్మన్ గంగారెడ్డి ​ట్రిబ్యునల్ ను ​ఆశ్రయించారు.  స్పందించిన ట్రిబ్యునల్.. ఈ నెల 8 లోగా మాజీ  చైర్మన్ ఆస్తుల జప్తు లో 50 శాతం  సొమ్మును సహకారశాఖ కు డిపాజిట్​ చేయాలని, లేకపోతే వందశాతం సెక్యూరిటీ చూపెట్టాలని తీర్పు ఇచ్చింది.  దీంతో  ఆరు నెలలుగా సాగుతున్న సొసైటీ, నిందితుల ఆస్తులు వేలం ప్రక్రియకు బ్రేక్​పడడంతో తమ డబ్బు చెల్లిస్తరో లేదోనని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీర్మానాలు నామ్​కే వాస్తే..దోషుల నుంచి సొమ్ము రికవరీ చేయాలని సొసైటీ  చేసిన తీర్మానాలు నామ్​కే వాస్తేగా మారాయి.  స్కామ్​ ప్రధాన నిందితుడు, మాజీ చైర్మన్  జిల్లా మంత్రి అనుచరుడు కావడంతోనే  12 నెలలుగా అధికారులు సొమ్ము రికవరీలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  రూ.3.70 కోట్ల రికవరీకి ఇప్పటి వరకు చర్యలు శూన్యమని బాధితులు విమర్శిస్తున్నారు. దోషులపై  రెవెన్యూ రికవరీ యాక్టు, కనీసం  పీఎస్​లో ఎఫ్ ఐఆర్ కూడా నమోదు చేయలేదని చెప్తున్నారు. 

12 నెలలుగా పెండింగే..
సొసైటీ ఆస్తులు వేలం వేసి వచ్చిన సొమ్ముతో డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లిస్తామని 12 నెలల కింద ప్రభుత్వం చెప్పింది. కానీ  ఇప్పటి వరకు  ఆఫీసర్లు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో ఆగ్రహించిన బాధితులు 3 నెలల కిందట నిందితుడు  గంగారెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. వెంటనే అక్రమార్కులపై చర్యలు తీసుకుని, సొమ్మును రికవరీ చేస్తామని సహకార శాఖ అధికారులు ప్రకటించారు. కానీ ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదు. నిందితులను తప్పించేందుకు మంత్రి ఆదేశాలతో అధికారులు యత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.  

విడతల వారీగా చెల్లిస్తం
సొసైటీ ఆస్తుల్లోని రెండు ప్లాట్లకు ఈ వేల వేశాం. వాటికి సంబంధించి 1.10 లక్షల సొమ్ము రావాల్సి ఉంది. మాజీ చైర్మన్ గంగారెడ్డి ఆస్తుల వేలానికి కూడా పిటిషన్​వేశాం. కానీ ఆయన ట్రిబ్యునల్ కు వెళ్లడంతో ఆలస్యం అవుతోంది.   ట్రిబ్యునల్​ తీర్పు ప్రకారం ఈ నెల 8  లోపు ఆయన 50 శాతం సొమ్ము డిపాజిట్​ చేయాలి. డబ్బుల
రాగానే  విడతల వారీగా  చెల్లిస్తాం.  - సింహాచలం,  జిల్లా సహకార శాఖ అధికారి

మంత్రి సారు.. మా డబ్బులు ఇప్పించాలె   
మంత్రి ప్రశాంత్​ రెడ్డి సారు డిపాజిట్​ డబ్బులు ఇప్పించాలె.  సొసైటీ డబ్బులు తిన్నోళ్లను టీఆర్ఎస్​పెద్దలు కాపాడుతున్నరు.  సొసైటీ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే వడ్డీతో సహా వస్తయని చెమటోడ్చి పైసా.. పైసా కూడా బెట్టినం.  కనీసం అసలు కూడా రాకుండా చేస్తున్నరు. అధికారులు మా డబ్బులు వీలైనంత తొందరగా చెల్లించాలి.‌‌‌‌ - మూటపల్లి లక్ష్మీ,  గుమ్మిరియల్ 

సొమ్ము రికవరీని నిర్లక్ష్యం చేస్తున్రు
ఏడాది కాలంగా  ఆస్తుల వేలం వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నరు.  రెండు నెలల గడువులోగా నిందితులు  గంగారెడ్డి, మాజీ సీఈవో  స్కామ్​లో సగ భాగాన్ని డిపాజిట్​ చేయాలని తీర్పు ఉన్నా.. ఆఫీసర్లు ఏం చేస్తున్రు. మళ్లా ఇప్పుడు ఈ నెల 8 లోపు కడ్తరని చెబుతున్నరు.  ఇప్పటికైనా వారి నుంచి పైసలు వసూలు చేసి మాకు చెల్లించాలి. - శ్రీరాముల శంకర్, ఆటో డ్రైవర్

గవర్నర్​ని కలిసిన టీయూ స్టూడెంట్లు
డిచ్​పల్లి : తెలంగాణ యూనివర్సిటీ స్టూడెంట్లు బుధవారం​ గవర్నర్​ తమిళసై ని  రాజ్​భవన్​ లో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీలో ఉన్న పలు సమస్యలను గవర్నర్​ దృష్టి కి  తీసుకెళ్లినట్లు చెప్పారు. టీయూ లో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టాలని, గర్ల్స్​హాస్టల్, ఆడిటోరియం నిర్మించాలని,  ఏటా కాన్వొకేషన్​ నిర్వహించాలని కోరారు. తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని గవర్నర్​ హమీ ఇచ్చినట్లు స్టూడెంట్లు చెప్పారు.  త్వరలోనే వర్సిటీని సందర్శిస్తానని చెప్పినట్లు  తెలిపారు. గవర్నర్​ ని కలిసిన వారిలో సురేశ్​, గజేందర్ ఉన్నారు.

కమిట్​ మెంట్​ సినిమా రిలీజ్​ ఆపివేయాలి
నవీపేట్ : ‘కమిట్​మెంట్​’ సినిమాను రిలీజ్​కాకుండా చూడాలని విశ్వహిందూ పరిషత్​నాయకులు బుధవారం అధికారులను కోరారు.  ముందుగా తహసీల్దార్, డిఫ్యూటీ తహసీల్దార్​, ఎస్సైలకు వారు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం  విశ్వహిందూ పరిషత్ విభాగ కార్యదర్శి తమ్మల కృష్ణ మాట్లాడుతూ హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా సినిమా తీసిన నిర్మాతపై కేసు పెట్టాలని డిమాండ్​చేశారు. సినిమా టీజర్ లో భగవత్ గీత శ్లోకాన్ని కించపరిచే విధంగా ఉందని అన్నారు. సినిమా ఇండస్ట్రీ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు.  ఈ కార్యక్రమంలో గణేశ్, శాఖావార్ రమేశ్​,  రాజు, సంతోశ్, గోపు అఖిలేశ్, చిట్టిబాబు తదితరులు ఉన్నారు.  

కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ ​పార్టీ మారిండు - మాజీ మంత్రి షబ్బీర్​ అలీ
కామారెడ్డి : నియోజక వర్గ డెవలప్​మెంట్​ కోసం కాదు..  కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి పార్టీ మారుతున్నారని కాంగ్రెస్ ​సీనియర్​ లీడర్​షబ్బీర్​ అలీ విమర్శించారు.  బుధవారం కామారెడ్డిలో  మీడియాతో మాట్లాడుతూ..   కాంగ్రెస్​  తోనే రాజగోపాల్​రెడ్డికి గుర్తింపు వచ్చిందన్నారు.  పీసీసీ ప్రెసిడెంట్​ పదవి ఇప్పించమని తన  ఇంటికి వచ్చి రాజగోపాల్​రెడ్డి అడిగారని, వెంకట్​రెడ్డి కూడా పీసీసీ ప్రెసిడెంట్​ కావాలని అడుగుతున్నారు కదా ? అని ప్రశ్నిస్తే.. ఆయనకు  మతిస్థిమితం సరిగా లేదని..చెప్పారని షబ్బీర్​ అలీ పేర్కొన్నారు.‘ తనకు కాకుండా ఒక వేళ రేవంత్​రెడ్డికి పీసీసీ ఇచ్చినా.. సరే’ అని ఆయన అన్నారని, దీనికి తానే సాక్ష్యం అని షబ్బీర్​ అలీ చెప్పారు. కానీ  ఇప్పడు రేవంత్​రెడ్డిపై విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు.   కాంగ్రెస్​ పార్టీని కానీ,  కార్యకర్తలను కానీ విమర్శిస్తే.. రాజగోపాల్​రెడ్డిని మునుగోడు ప్రజలు పాతిపెడ్తారని హెచ్చరించారు.  అనంతరం కామారెడ్డిలో  వీఆర్ఏల  రిలే నిరసన దీక్ష శిబిరాన్ని షబ్బీర్​అలీ సందర్శించి మద్దతు తెలిపారు. డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు,  మండల అధ్యక్షులు  పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్​రెడ్డి, గణేశ్​నాయక్​, యాదవరెడ్డి, బీమ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఈవో రాంరెడ్డి మృతి
బోధన్ : బోధన్​ పట్టణంలోని శ్రీచక్రేశ్వరా శివాలయం, మారుతీ ఆలయ ఈవో రాంరెడ్డి బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. శివాలయం, మారుతి  ఆలయ చైర్మన్లు  భరత్​యాదవ్​, మధు, అర్చకులు ప్రవీణ్​ మహారాజ్​, గణేశ్​ మహారాజ్​లు, డైరెక్టర్లు , సంతాపం వ్యక్తం చేశారు. ఆయన హయాంలో ఆలయాలు  అభివృద్ధికి ఎంతో  కృషి చేశారని కొనియాడారు.   
ఫారెస్ట్​ డివిజన్​ ఆఫీసర్​గా గోపాల్​రావు
కామారెడ్డి : ఫారెస్ట్​ కామారెడ్డి డివిజన్​ఆఫీసర్ ( డీఎఫ్ వో) గా జె. గోపాల్​రావు  బుధవారం బాధ్యతలు చేపట్టారు.  ఇక్కడ పని చేసిన కె. శ్రీనివాస్​ దూలపల్లికి బదిలీపై వెళ్లారు.  ములుగు జిల్లా వెంకటపురం నుంచి జె.గోపాల్​రావు ఇక్కడికి  బదిలీపై వచ్చారు. 
రోడ్డుపై గుంతలు పూడ్చాలని రాస్తారోకో
ఇందల్వాయి : ఇందల్వాయి – ధర్పల్లి రోడ్డు పై  గుంతలను పూడ్చాలని డిమాండ్​ చేస్తూ మండంలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామస్తులు రాస్తా రోకో నిర్వహించారు.  రోడ్డుపై అడుగుకో గుంత పడడంతో  ప్రయాణం  నరకంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోడ్డుపై  సుమారు వెయ్యి వరకు గుంతలుంటాయని వాపోయారు. వెహికల్స్​కూడా పూర్తిగా దెబ్బతింటున్నాయని.. వాటి రిపేర్లకు వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే  పూడ్చివేయాలని డిమాండ్​ చేశారు.  రాస్తారోకో తో  వెహికల్స్​భారీగా నిలిచిపోవడంతో పోలీసులు ఆందోళనకారులను సముదాయించి ట్రాఫిక్​ క్లియర్​ చేశారు. 
తల్లి, కొడుకును అత్తింటివారే చంపేశారు..
జిల్లా ఆస్పత్రిలో బంధువుల ఆందోళన
నిజామాబాద్ క్రైమ్ :  మోర్తాడు గ్రామ శివారులో మంగళవారం లత(28) ఆమె కొడుకు హర్ష(2) అనుమానాస్పద మృతి కాదని, ఆమె  భర్త  రాజబాబు కొట్టి చంపారని   బంధువులు ​ఆరోపించారు.  మోర్తాడ్​ పోలీసులు బుధవారం ఉదయం డెడ్​బాడీలను పోస్ట్​మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ చెల్లికి న్యాయం చేయాలని అన్న  వెంకటేశ్​బంధువులతో కలిసి ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల కింద నవీపేటకు చెందిన రాజబాబుకు తమ చెల్లిని ఇచ్చి పెళ్లి చేశామని చెప్పారు. పెళ్లైన నాటి నుంచి తన చెల్లెలను భర్త రాజబాబు ,ఆడబిడ్డ చిట్టి, ఆమె భర్త శేఖర్ తోటి కోడలు నాగలక్ష్మి చిత్రహింసలు పెట్టేవారని  ఆరోపించారు. ఇటీవల వారికి చెందిన కొంత భూమి అమ్మగా..రూ. 66 లక్షలు వచ్చాయని,  ఆస్తి విషయంలోనే తన చెల్లి, ఆమె కొడుకును చంపేశారని ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్యం రాజు తెలిపారు.   
చదువుతోనే ఉజ్వల భవిష్యత్
స్టేట్​ఎలక్షన్​ కమిషనర్ ​సి. పార్థసారథి
కామారెడ్డి/నిజామాబాద్ : చదువుతోనే ఉజ్వల భవిష్యత్​ఉంటుందని స్టేట్​ఎలక్షన్​కమిషనర్​ సి.పార్థసారథి చెప్పారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్​అవుతున్న అభ్యర్థులు ప్లానింగ్​తో చదివితే జాబ్​తప్పకుండా సొంతమవుతుందన్నారు.  కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతిలో పోటీ పరీక్షలకు ప్రిపేర్​అయ్యే అభ్యర్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్కసారి జాబ్​రాకపోతే ప్రిపరేషన్​ఆపకుండా.. ఆత్మవిశ్వాసంతో మళ్లీ ప్రయత్నిస్తే విజయం వస్తుందన్నారు. సిలబస్​పై పూర్తి అవగాహన పెంచుకుని చదవాలని సూచించారు.  అనంతరం కలెక్టర్​జితేశ్​వి పాటిల్​ మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం వచ్చే వరకు విశ్రమించకుండా పోరాడాలన్నారు. అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్​దొత్రే, అడిషనల్​ ఎస్పీ అన్యోన్య,  డీఎస్పీ సోమనాథం, ఆర్డీవో వాణి,  డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్​ కిష్టయ్య, సౌత్​ క్యాంపస్​ ప్రిన్సిపాల్​  లావణ్య తదితరులు పాల్గొన్నారు.  
సృష్టి అంతా సైన్స్ తోనే ముడిపడి ఉంది    
సృష్టి అంతా సైన్స్​తోనే ముడిపడి ఉందని స్టేట్​ఎలక్షన్​ కమిషనర్​ సి. పార్థసారథి అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్,  అల్ట్రాసోనిక్  సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో  నిర్వహించిన ‘అల్ట్రా సోనిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్ ఫర్ అడ్వాన్స్​డ్​ టెక్నాలజీ’  అనే అంశంపై ఆగస్టు ఒకటి నుంచి 3వరకు  ఇంటర్నేషనల్​కాన్ఫరెన్స్​నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి హాజరైన పార్థసారథి మాట్లాడుతూ..  వ్యవసాయ, పారిశ్రామిక రంగాల పరిణామాలను గ్రీన్ టెక్నాలజీ అధ్యయనం చేస్తోందన్నారు. ఈ కాన్ఫరెన్స్​అడ్వాన్స్​డ్​ టెక్నాలజీలో విస్తృతమైన అధ్యయనం, ఉన్నతమైన పరిశోధన, కొత్త ఆవిష్కరణల పై అవగాహన కలిగించిందని అన్నారు. వీసీ రవీందర్,  అడిషనల్​కలెక్టర్​ బి. చంద్రశేఖర్, రిజిష్ట్రార్ ప్రొఫెసర్​ కె. శివశంకర్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్  సీహెచ్​ఆరతి 
తదితరులు పాల్గొన్నారు. 
కొనసాగుతున్న వీఆర్ఏల దీక్షలు
తమ డిమాండ్లు పరిష్కరించాలని ఉమ్మడి జిల్లాలో వీఆర్ఏలు చేస్తున్న నిరసన దీక్షలు బుధవారం నాటికి పదో రోజుకు చేరాయి. కామారెడ్డి, భిక్కనూరు, ఎర్గట్ల, డిచ్ పల్లి తదితర మండలాల్లో వీఆర్​‌‌ఏలు వివిధ పద్ధతుల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. భిక్కనూరులో ఒంటికాలుపై నిలబడి నిరసన తెలిపారు. డిచ్​పల్లిలో రోడ్లపై వంటా వార్పు చేపట్టారు. ఆయా దీక్షా శిబిరాలను బీజేపీ, కాంగ్రెస్ ​లీడర్లు సందర్శించి సంఘీభావం తెలిపారు. వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కరెంట్​ షాక్​తో రైతు మృతి
లింగంపేట : మండల పరిధిలోని నల్లమడుగు గ్రామానికి చెందిన కొండ రాజులు(42) అనే రైతు బుధవారం  ఉదయం  కరెంట్​ షాక్​తో చనిపోయాడు. ఎస్సై శంకర్ వివరాల ప్రకారం.. ఉదయం 6 గంటలకు రాజులు ఇంట్లో నుంచి పొలానికి  వెళ్లాడని, మోటార్​రిపేర్​కోసమని పొల పక్కనే ఉన్న  ట్రాన్స్​పార్మర్​ను ఆపేసేందుకు  హ్యాండిల్ పట్టుకోగా ప్రమాదవశాత్తు కరెంట్​ షాక్​ తగిలి స్పాట్​లోనే చనిపోయాడన్నారు.  భార్య సావిత్రి కంప్లైంట్​మేరకు  కేసు ఫైల్​ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.  ​మృతుడికి తల్లి బాలవ్వ, కూతురు భార్గవి ఉన్నారు.
బిల్లులు మంజూరు చేయండి సారూ..
మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
ఆర్మూర్ : మధ్యాహ్న భోజన కార్మికు ల బకాయిలు  వెంటనే   చెల్లించాలని   మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నూరు చక్రపాణి డిమాండ్​చేశారు. ఆర్మూర్​తహసీల్దార్​ఆఫీస్​ఎదుట కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు బుధవారంతో మూడో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా హాజరైన చక్రపాణి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న బిల్లులు మంజూరు చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని  హెచ్చరించారు. జిల్లా ఉపాధ్యక్షురాలు సుజాత, మండల అధ్యక్షురాలు గంగామణి , కార్యదర్శి గంగాధర్​, కార్మికులు  భాగ్య ,లక్ష్మి పాల్గొన్నారు.
రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి
ఆర్మూర్ : టీఆర్ఎస్  ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని బీజేపీ కిసాన్​ మోర్చా జిల్లా అధ్యక్షుడు  శ్రీనివాస్ రెడ్డి డిమాండ్​చేశారు. బుధవారం  ఆర్మూర్​ మండలం ఆలూర్​ గ్రామంలో కిసాన్ మోర్చా  ఆధ్వర్యంలో రైతుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్​2018లో ఏక కాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని  హామీ ఇచ్చి మరిచిపోయారన్నారు. రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయకపోవడంతో  రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. పసుపు పంటకు ఎకరానికి రూ. 50 వేలు, మొక్కజొన్నకు రూ.25 వేలు చెల్లించాలని కోరారు.  రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామన్న  సీఎం ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీ మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు  నర్సారెడ్డి, లీడర్లు మల్లయ్య, గంగాధర్, నరేశ్ పాల్గొన్నారు. 
బూరుగిద్దలో దారి దోపిడీ..
లింగంపేట : మండల పరిధిలోని బూరుగిద్ద గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మహిళను బెదిరించి పుస్తెల తాడు, చెవికమ్మలను దోపిడీ చేశాడు. ఎస్సై శంకర్​వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం సంగోజీవాడీ గ్రామానికి చెందిన కయితి విశ్వధ్వని (23) రెండు రోజుల కింద బూరుగిద్దలోని అక్క మానస ఇంటికి  వచ్చింది. బుధవారం ఉదయం బహిర్భూమికి అని  దగ్గరలోని చెట్ల  పొదల్లోకి వెళ్లింది. పల్సర్​బైక్​పై యువతిని వెంబడించిన దుండగుడు మహిళను ఆపి మెడలో ఉన్న  2.7 గ్రాముల పుస్తెల తాడు, 3 గ్రాముల చెవికమ్మలను ఇవ్వాలని,  లేకుంటే చంపుతానని బెదిరించాడు. భయంతో బాధితురాలు నగలను తీసి ఇవ్వడంతో  దుండగుడు కామారెడ్డివైపు పారిపోయాడు.  బాధితురాలి కంప్లైంట్​మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై  తెలిపారు.  ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు కూడా బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు.