ఇటు కోతలు..అటు దళారులు

ఇటు కోతలు..అటు దళారులు
  •     సెంటర్లు ఓపెన్ కాకపోవడంతో దళారుల రంగప్రవేశం
  •     మద్దతు ధరకు రూ.300 తగ్గింపు
  •     రెండున్నర కిలోల కటింగ్​
  •     పైగా 2 శాతం కమీషన్​

యాదాద్రి, వెలుగు : వరి కోతలు ఇలా మొదలయ్యాయో లేదో దళారులు రంగంలోకి దిగారు.  ప్రభుత్వం ఇంకా కొనుగోలు ఓపెన్ చేయకపోవడంతో రైతుల నుంచి నేరుగా వడ్లు కొనేస్తున్నరు. క్వింటాల్‌‌‌‌కు మద్దతు ధర కన్నా రూ.300 తగ్గించడంతో పాటు రెండున్నర కిలో కటింగ్​, 2 శాతం కమీషన్​ తీసుకుంటున్నారు. దీంతో రైతులు ఒక్కో క్వింటాల్​కు రూ. 400 రైతులు లాస్​అవుతున్నారు.  ఇప్పటికే పంట చేతికి రావడంతో అమ్మడం తప్ప మరో మార్గం లేదని, ప్రభుత్వం త్వరగా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలని రైతులు కోరుతున్నారు. 

జిల్లాలో 2.93 లక్షల ఎకరాల్లో సాగు 

యాదాద్రి జిల్లా రైతులు యాసంగి సీజన్లో 2.93 లక్షల ఎకరాల్లో 1010,1153,1156 సహా పలు రకాలను వడ్లను సాగు చేశారు.  వ్యవసాయ అధికారులు 5 లక్షల టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు.  అయితే ఈ సారి సరిగ్గా కాకపోవడంతో మోత్కూరు, గుండాల, భూదాన్​ పోచంపల్లి మండలాలకు చెందిన రైతులు మినహా మిగిలిన మండలాల్లో   ఆలస్యంగా విత్తనాలు వేశారు. ప్రస్తుతం మోత్కూరు, గుండాలలో ఇప్పటికే కోతలు ప్రారంభం అయ్యాయి.  కానీ, సివిల్​ సప్లై డిపార్ట్​మెంట్​ ఇంకా కొనుగోలు సెంటర్లు ప్రారంభించలేదు.  

క్వింటాల్‌‌‌‌కు రూ. 400 లాస్​ 

మోత్కూరు, గుండాల మండలాల్లో వరి  కోతలు ప్రారంభం కావడంతో మిర్యాలగూడ రైస్​ మిలర్ల తరపున దళారులు​ రంగంలోకి దిగారు. నేరుగా రైతుల వద్దకే వెళ్లి క్వింటాల్​కు రకాన్ని బట్టి రూ. 1960 నుంచి 1990 వరకూ రేటు ఫిక్స్​ చేస్తున్నరు. వాస్తవానికి ప్రభుత్వం ఏ గ్రేడ్​కు రూ. 2203, సాధారణ రకానికి రూ. 2183 మద్దతు ధర నిర్ణయించింది. దళారులు మాత్రం తేమ, తాలు, మట్టి సంగతి పక్కనపెట్టి కోసిన

వడ్లను కోసినట్టే వే బ్రిడ్జీల వద్దకు తరలించి అక్కడే కాంటా వేయించి తీసుకెళ్తున్నారు. 40 కిలోల వడ్లకు కిలో చొప్పున క్వింటాల్​కు రెండున్నర కిలోలు కట్​చేస్తున్నారు.  రైతులకు మూడు నుంచి నాలుగు రోజుల్లో డబ్బులు ఇస్తున్నప్పటికీ..  2 శాతం కమీషన్​ తీసుకుంటున్నారు. దీంతో రైతులు క్వింటాల్​ వడ్లకు రూ. 400 లాస్​ అవుతున్నరు. 

సెంటర్లు ఓపెన్ చేయకపోవడంతోనే..

 సివిల్ సప్లై డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోతలు ప్రారంభమైనా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతోనే రైతులు దళారులకు  అమ్ముకుంటున్నారు.  అకాల వర్షాల వచ్చే అవకాశం ఉండడం,  సెంటర్లు ఏర్పాటు చేసిన తర్వాత మిల్లర్ల కొర్రీల పెడుతుండడంతో ముందుగానే అమ్మేసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు.  డబ్బుల కోసం కనీసం 15 రోజులు ఆగాల్సి వస్తుండడం కూడా  ఇందుకు కారణంగా తెలుస్తోంది.  కాగా, కొనుగోలు చేసిన వడ్లను దళారులు మిర్యాలగూడకు తరలిస్తున్నట్టు తెలిసింది. 

వచ్చే నెలలో కొనుగోలు సెంటర్లు

ఏప్రిల్‌‌‌‌లో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నం.  ప్రతీ సీజన్​ మాధిరిగానే ఈసారి కూడా దాదాపు 300కు పైగా సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశముంది. జిల్లాలో పండిన ప్రతి గింజను కొంటాం. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.

గోపి కృష్ణ, సివిల్ సప్లై డీఎం