కొలువుదీరక ముందే.. కూలగొట్టే మాటలు

కొలువుదీరక ముందే.. కూలగొట్టే మాటలు
  • ఆరునెల్లకో, ఏడాదికో కాంగ్రెస్ ​ప్రభుత్వం పడిపోతుందని బీఆర్​ఎస్​, బీజేపీ నేతల కామెంట్లు
  • కాంగ్రెస్​కు బొటాబొటి మెజార్టే ఉంది.. బీఆర్​ఎస్​దే మళ్లీ అధికారం: కడియం శ్రీహరి
  • బీఆర్​ఎస్​, ఎంఐఎం, బీజేపీతో కలిపి 54 సీట్లు ఉన్నాయని వ్యాఖ్య
  • ఆరు నెలలో, ఏడాదో చెప్పలేం.. మళ్లీ కేసీఆరే సీఎం అంటూ కామెంట్​
  • ఏడాది తర్వాత కాంగ్రెస్​ సర్కార్​ పడిపోతది: రాజాసింగ్​ 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ ​ప్రభుత్వం కొలువుదీరకముందే బీఆర్ఎస్, బీజేపీ నేతలు హెచ్చరికలు, శాపనార్థాలు షురూజేశారు. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదని.. ఆరునెల్లకో, యాడాదికో పడిపోతుందని కామెంట్లు చేస్తున్నారు. బీఆర్​ఎస్​  సీనియర్​ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి  మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారని,  మళ్లీ బీఆర్​ఎస్​ ప్రభుత్వం రావడం పెద్ద ఇబ్బందేమీ కాదని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్​కు బొటాబొటి మెజార్టీ వచ్చిందని, ఆరు నెల్లకా.. ఏడాదికా అనే టైం తెల్వది కానీ కేసీఆర్​అనే సింహం బయటికి వస్తుందని, ఆయనే సీఎం అవుతారని బహిరంగంగా అన్నారు. మూడు రోజుల వ్యవధిలోనే ఆయన రెండుసార్లు ఇలాంటి కామెంట్లు చేయడం చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏడాది నడుస్తదని, ఆ తర్వాత పడిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​ కామెంట్లు చేశారు. వీళ్ల కామెంట్లపై  కాంగ్రెస్​ మండిపడుతున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్​ఎస్​, బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నాయని, కొత్త సర్కార్​పై విషం గక్కుతున్నాయని  అంటున్నారు. ఇంకా కొలువుదీరక ముందే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారంటే.. రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు జరగొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు పార్టీల నేతల మనస్సుల్లో అలాంటి కుట్రల ఆలోచన లేకుంటే బాహాటంగా ఎందుకు మాట్లాడుతారని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్​కు బొటాబొటి మెజారిటీ వచ్చిందంటున్న కడియం శ్రీహరి.. మరి 2014లో అప్పటి టీఆర్​ఎస్​కు ఎన్ని సీట్లు వచ్చాయో గుర్తుంచుకుంటే మంచిదని కాంగ్రెస్​ నేతలు హితవుపలుకుతున్నారు. నాడు టీఆర్​ఎస్​కు వచ్చిన సీట్లు 63 మాత్రమేనని గుర్తుచేస్తున్నారు.  అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల సంఖ్యాబలం కూడా అధికార పక్షానికి దీటుగా ఉండేదని , నాడు ప్రతిపక్షాలు ఎప్పుడూ ఇప్పటి బీఆర్​ఎస్​, బీజేపీ నేతలలాగే ఆలోచించలేదని అంటున్నారు. 

కాంగ్రెసోళ్లతో కాదు :  రాజాసింగ్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు నడువదని, నెక్ట్స్​ బీజేపీ సర్కార్​ వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​ వ్యాఖ్యానించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏ విధంగా కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని నడిపిస్తరో చూడాలి. నాకైతే ఒక్కటే నమ్మకం.. కాంగ్రెస్​ ప్రభుత్వం కూడా ఎక్కువ దినాలు నడువదు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటరు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే బీజేపీతో సాధ్యం. రాష్ట్రంలో ఒక్క సంవత్సరం కాంగ్రెస్​ గవర్నమెంట్​ నడుస్తది. దాని తర్వాత పడిపోతది. వాళ్లతో కాదు.. నా క్యాలిక్యులేషన్​ ప్రకారం కష్టమే. నెక్ట్స్​ గవర్నమెంట్​ మా బీజేపీది వస్తదని నేను అనుకుంటున్న” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చదని, గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ‘‘కేసీఆర్ అప్పులు చేసి వెళ్లాడు.. ఆ అప్పులు కట్టడానికే కొత్త ప్రభుత్వానికి టైం సరిపోతుంది.. కేసీఆర్ స్కీంలు అమలు చేస్తమని రేవంత్ చెప్తున్నరు.. ఒకవేళ వాటిని అమలు చేయకపోతే కాంగ్రెస్ సర్కార్ ను బీజేపీ వదలిపెట్టబోదు” అని హెచ్చరించారు.

బీఆర్​ఎస్​ సర్కార్​ వచ్చుడు పెద్ద ఇబ్బందేమీ కాదు: కడియం శ్రీహరి

రాష్ట్రంలో బీఆర్​ఎస్​ సర్కార్​ రావడం పెద్ద ఇబ్బందేమీ కాదని, కాంగ్రెస్​కు ఉన్నది బొటాబొటి మెజార్టీ మాత్రమేనని బీఆర్ఎస్​సీనియర్​నేత, స్టేషన్​ఘన్​పూర్​ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. మూడో తేదీన ఎన్నికల్లో గెలిచిన అనంతరం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఈ కామెంట్లు చేశారు.  ఆ తర్వాతి రోజు ఎర్రవల్లి ఫామ్​హౌస్​లో కేసీఆర్​తో ఆయన భేటీ అయ్యారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఓ సమావేశంలో కడియం మళ్లీ కాంగ్రెస్​ప్రభుత్వంపై కామెంట్లు చేశారు. కేసీఆర్​ను కలిసిన తర్వాత కూడా కడియం మళ్లీ అలాంటి వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్​ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

రెండుసార్లు కడియం శ్రీహరి ఏమన్నారంటే.. ‘‘పార్టీ అధికారంలోకి రాలేదని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.. మళ్లీ.. అది ఆర్నెల్లా.. సంవత్సరమా.. రెండు సంవత్సరాలా.. అనేది చెప్పను కానీ మళ్లీ ప్రభుత్వం మనదే.. మన ముఖ్యమంత్రి కేసీఆరే.. కాంగ్రెస్​పార్టీకి బొటాబొటి మెజార్టీ వచ్చింది.. దాన్ని కాపాడుకుంటరో లేదో మనం చూడాలి..! మనకు వచ్చిన సీట్లు చిన్న నెంబర్లు కాదు.. బీఆర్ఎస్ కు 39 సీట్లొచ్చినయి, మన మిత్రపక్షంగా ఏడుగురు (ఎంఐఎం సభ్యులు) ఉన్నరు. దాదాపు 46 మంది మన సంఖ్య. 8 మంది బీజేపీ వాళ్లు.. కాంగ్రెస్​కు వ్యతిరేకంగా ఉన్నరు. 46 మంది, 8 మంది.. 54 మంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నరు.. మన సర్కార్ రావడం పెద్ద ఇబ్బందేం కాదు.. కేసీఆర్ సింహం.. సింహం రెండడుగులు వెనక్కి వేసిందంటే పొజీషన్​ తీసుకొని జంప్​ చేయడానికే.. దటీజ్​ కేసీఆర్​” అని అన్నారు.