
- వరద బాధితుల గోసను రాస్తే బీఆర్ఎస్ మీడియా అక్కసు
- కాలకూట విషం చిమ్ముతున్నారంటూ టీ న్యూస్‌లో పెడబొబ్బలు
- ‘ప్రభుత్వ కష్టం గురించి చెప్తలేరు’ అంటూ శోకాలు
- ఆదుకోవాల్సిన నాయకులను తట్టిలేపితే బురద రాజకీయాలా?
- 41 మంది వరదల్లో చనిపోయింది కట్టు కథలా?
- మరి, హైకోర్టుకు ఆఫీసర్లు చెప్పిన లెక్కల్లో ఏమున్నది?
- వరద వచ్చినప్పుడు మల్లన్నసాగర్‌లోకి ఎత్తిపోస్తమన్నది నిజం కాదా?
- జనాన్ని గాలికి వదిలి మహారాష్ట్ర పాలిటిక్స్‌ను ముందటేసుకున్నదెవరు?
హైదరాబాద్, వెలుగు: ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లుగా.. వీ6 –-వెలుగు మీడియాపై బీఆర్ఎస్ సొంత మీడియా మరోసారి విషం కక్కింది. తెలంగాణ ప్రజల కష్టాలను, వారి గోసను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నందుకు ఉడికిపోయింది. వారం పదిరోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా జనం జోరువాన, వరదతో తిప్పలు పడుతుంటే, ఆ తిప్పలను ఫీల్డ్ లెవల్లో ఉండి ప్రపంచానికి ‘వీ6– వెలుగు’ చూపిస్తే.. కాలకూట విషం చిమ్ముతున్నారంటూ అధికార పార్టీ మీడియా ‘టీ న్యూస్’ పెడబొబ్బలు పెట్టింది. పైగా, ‘‘ప్రభుత్వ కష్టాన్ని గుర్తించే వార్తలే లేవు”అంటూ శోకాలు పెట్టింది. అసలు వరద కష్టాల్లో ఉన్నది ప్రజలా? ప్రభుత్వమా? మరి ఎవరి కష్టం గురించి రాయాలి?! పట్టింపులేని లీడర్లకు వరద బాధితుల దు:ఖాన్ని కండ్లకు కట్టినట్లు చూపిస్తే కలం పోట్లు పొడిచినట్లా? సహాయ చర్యలు అందక వేలాది మంది విలవిలలాడుతుంటే.. వారి గాథను తెలియజెప్పడం బురద రాజకీయాలు చేసినట్లా? ప్రకృతి పగబట్టినప్పుడు ఆదుకోవాల్సింది ప్రభుత్వం కాదా? దీన్ని ప్రశ్నిస్తే కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లా?!
ప్రకృతి విలయం సంభవించినప్పుడు ప్రభుత్వం చేష్టలుడిగి వ్యవహరిస్తే.. కోలుకోలేని నష్టం జరుగుతుంది. ఏమీ పట్టన్నట్లుగా కండ్లప్పగించి చూస్తే భారీగా ప్రాణనష్టం సంభవిస్తుంది. ‘ఇదే అచ్ఛమైన పరిపాలన..’ అంటూ ప్రభుత్వాన్ని ఎత్తుకున్న టీ న్యూస్... వరద బాధితుల పక్షాన నిలబడ్డ ‘వెలుగు’పై చీకటి వార్తలు అంటూ అక్కసు వెళ్లగక్కింది. వరద సహాయ చర్యలను ప్రభుత్వం అద్భుతంగా చేసిందని రాయాలి కదా.. అంటూ తుంగ బుర్రలా కొత్త నీతులు వల్లించింది. వరద మృతుల సంఖ్యను కూడా దాచిపెట్టడం నిఖార్సైన జర్నలిజమా..? అసలు నిజాలు రాయటం జర్నలిజమా..? గురివింద గింజలా.. ఎవరి తప్పులు.. ఎవరు దాచుకుంటున్నరు..?!
జనం బాధలో ఉంటే.. పాలిటిక్స్ చేసిందెవరు?
రాష్ట్రంలో వచ్చిన వరదల్లో 41 మంది ప్రాణాలు కొట్టుకుపోతే, కుప్పకూలిపోతే.. మహారాష్ట్ర పాలిటిక్స్ చేసిందెవరు?! వరద వచ్చినప్పుడు మల్లన్నసాగర్‌ను నింపుతామన్నది ఎవరు?! దాని గురించి రాస్తే అవాస్తవాలైతయా? వాస్తవాలను వెలుగులోకి తెస్తే చీకటి రాజకీయాలైతయా?! వీ6, వెలుగుపై రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ కక్ష గట్టడం, ఇట్ల విషం కక్కడం ఇదే మొదటిది కాదు.. ఇదే చివరిదీ కాకపోవచ్చు. జనం సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను చెప్తున్నందుకు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌లకు రాకుండా ఆ మధ్య పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హుకుం జారీ చేశారు. పైగా, ఎమ్మెల్సీ కవిత.. ‘వీ6, వెలుగుకు ఎందుకు యాడ్స్ ఇస్తున్నరు’ అంటూ పార్టీ నేతలను హెచ్చరించారు. సెక్రటేరియెట్ ఓపెనింగ్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా రాకుండా వీ6, వెలుగుపై ఆంక్షల కత్తులు దూశారు. తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచినందుకు నాడు సమైక్య రాష్ట్రంలో కూడా అప్పటి పాలకులు ‘వీ6’పై ఇట్లనే కక్షగట్టారు. కానీ, తెలంగాణ ప్రజల నుంచి మాత్రం విడదీయలేకపోయారు. కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలోనూ పాలకులు కక్ష గట్టినా.. ‘వీ6 వెలుగు’ జనం తరఫున కొట్లాడుతూనే ఉంటుంది. వాళ్ల గొంతుకై ప్రశ్నిస్తూనే ఉంటుంది.
ఏది వాస్తవం..?
ఒకే రోజు భారీ కుంభవృష్టి కురియటంతో.. వాగులు, వంకలు తెగి వరదల్లో 30 మందికిపైగా చనిపోయారు. అదే విషయాన్ని ‘వెలుగు’ రిపోర్ట్ చేసింది. రాత్రికి రాత్రి ఊర్లకు ఊర్లు కొట్టుకుపోతుంటే.. సర్కారువారి సొంత పార్టీ మీడియాకు ఇది అబద్ధంగా కనిపించిందా..? వరదల్లో 41 మంది చనిపోయారని ప్రభుత్వమే హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. మరి, ఎవరిది చీకటి రాత..?!
ఎస్సారెస్పీ, మిడ్ మానేరు నుంచి వృథాగా కిందికి వదిలేస్తున్న నీళ్లను మల్లన్నసాగర్‌కు తక్కువ కరెంట్బిల్లుతో ఎందుకు ఎత్తిపోయట్లేదని ‘వెలుగు’ ప్రశ్నించింది. మల్లన్నసాగర్‌లోని నిర్మాణ లోపాలే ఇందుకు కారణం అనే చర్చ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే సాగుతున్నది. మల్లన్నసాగర్ నిర్మాణ ప్రాంతంలోని భూగర్భంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద లీనమెంట్ ఉన్నదని, అక్కడ ఎక్కువ నీటిని నిల్వ చేస్తే ఆ ఒత్తిడితో భూకంపాలు సంభవించవచ్చని ఎన్జీఆర్ఐ హెచ్చరించింది. మల్లన్నసాగర్ కట్టతో పాటు దాని కింద భూగర్భంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన పరికరాల్లో 80 శాతం పనిచేయడం లేదు.. వాటి రిపోర్టులు కంట్రోల్ రూమ్‌కు అందడం లేదు.. ఈ సాంకేతిక తప్పిదాలను కప్పి పుచ్చడానికి తప్పుడు వాదనతో అధికార పార్టీ మీడియా అబద్ధాల ఎటాక్ మొదలుపెట్టింది.
ఇప్పుడంటే వర్షాలు పడుతున్నాయి.. సాగునీటి అవసరం ఉండకపోవచ్చు. మరి పంట చేతికొచ్చే దశలో వానలు పడకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి? అప్పుడు కాళేశ్వరం కాల్వలు, ఆ కాల్వల ద్వారా నింపిన చెరువులు రైతులను ఆదుకోవా?’’ అంటూ టీ న్యూస్ ఇంకో అబద్ధాన్ని అందంగా చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు వర్షాలు పడితే మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌లోకి సహజ ప్రవాహాలు వచ్చాయా.. మల్లన్నసాగర్లో ఈ ఏడాది 10 టీఎంసీలు నింపాలని నిర్ణయించింది నిజం కాదా? కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాంసాగర్ కు ఐదు టీఎంసీలు తరలించాలని కేసీఆర్ ఇరిగేషన్ అధికారులకు ఆదేశించింది వాస్తవం కాదా.. అలాంటప్పుడు మిడ్ మానేరుకు వచ్చే వరదను, ఎస్సారెస్పీకి వచ్చే వరదను కాల్వ ద్వారా మిడ్ మానేరుకు తరలించి తక్కువ ఖర్చుతో మల్లన్నసాగర్‌కు ఎందుకు ఎత్తిపోయడం లేదు అనే ప్రశ్నకు సమాధానమేది? మల్లన్నసాగర్ నిర్మాణ లోపాలను అడ్డంగా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వమే.. ఆ లోపాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడమే తెలంగాణ మీడియాగా వీ6, వెలుగు బాధ్యత.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునరుజ్జీవం కల్పించిందే కాళేశ్వరం అనే కట్టుకథను గులాబీ మీడియా ప్రచారం చేస్తున్నది. 18 లక్షల ఎకరాలు పారుతున్నదంటూ అబద్ధాలు వల్లె వేసింది. కాళేశ్వరం నుంచి వరద కాల్వ ద్వారా చెరువులు నింపినట్లు అబద్ధాలు ప్రచారం చేసింది. నిజానికి కాళేశ్వరం మొదలు పెట్టిన కాన్నుంచి మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిందే 163 టీఎంసీలు.. అందులో 60 టీఎంసీలు ఎల్లంపల్లికి వరద రావటంతో గేట్లు ఎత్తితే సముద్రం పాలయ్యాయి. ఈ ఏడాది 9 టీఎంసీలు లిఫ్ట్ చేస్తే అందులోంచి కేవలం రెండు టీఎంసీలు ఎస్సారెస్పీ పునరుజ్జీవం ద్వారా శ్రీరాంసాగర్‌లోకి ఎత్తిపోశారు. అవి కూడా ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో వృథా అయ్యాయి. రూ. వంద కోట్లకు పైగా కరెంట్ బిల్లు భారం ప్రజలపై పడింది.
‘కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిన మాట వాస్తవం కాదా?’ అనే ఇంకో అబద్ధాన్ని బీఆర్ఎస్ మీడియా ప్రజలపైకి వదిలింది. కాళేశ్వరం లిఫ్ట్ లతో ఎత్తిపోసిన నీళ్లన్నీ గోదావరి పాలైంది వాస్తవం కాదా..? ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగేండ్లలో 20 టీఎంసీలకు మించి నీళ్లు ఆయకట్టుకు ఇవ్వలేదు. ఈ మాత్రం నీళ్లతోనే తెలంగాణలో పుట్లకొద్దీ వడ్లు పండుతున్నాయనేది ఎట్లా నిజమవుతుంది?! 2019 – 20లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 159 టీఎంసీలు, 2020 – 21లో 366 టీఎంసీలు, 2021 – 22లో 678 టీఎంసీలు, 2022 – 23 వాటర్ ఇయర్ లో 460 టీఎంసీల వరద వచ్చింది. ఈ ప్రాజెక్టు నుంచి వచ్చిన నీళ్లను కూడా కాళేశ్వరం నుంచి ప్రభుత్వమే ఎత్తిపోసినట్లు బీఆర్ఎస్ మీడియా చెప్పుకుంటున్న గొప్పల్లో నిజంలేదని ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు.