గువ్వల, ఇతర నేతల పోటాపోటీ మీటింగ్‌‌లు

గువ్వల, ఇతర నేతల పోటాపోటీ మీటింగ్‌‌లు
  •  బీఆర్‌‌ఎస్‌‌ను వీడొద్దన్న అనుచరులు
  •  తాము ఎవరి వెంట వెళ్లబోమని స్పష్టం చేసిన ఇతర లీడర్లు

 

నాగర్‌‌కర్నూల్‌‌, వెలుగు : బీఆర్‌‌ఎస్‌‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఓ వైపు, బీఆర్‌‌ఎస్‌‌ నియోజకవర్గ నాయకులు మరో వైపు బుధవారం అచ్చంపేటలో పోటాపోటీ మీటింగ్‌‌లు నిర్వహించారు. గువ్వల బాలరాజు తన మద్దతుదారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలియడంతో అలర్ట్‌‌ అయిన పార్టీ నేతలు నియోజకవర్గ కీలక నాయకులకు ఫోన్‌‌ చేసి అర్జంట్‌‌గా మీటింగ్‌‌ పెట్టి బాలరాజు వైపు ఎవరూ వెళ్లకుండా చూడాలని చెప్పినట్లు సమాచారం. దీంతో రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు పోకల మనోహర్‌‌ నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుంచి మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌‌ మాజీ చైర్మన్లు, మార్కెట్‌‌ కమిటీ మాజీ చైర్మన్లు, మాజీ సర్పంచ్‌‌లు, ఎంపీటీసీలు మండల పార్టీ బాధ్యులు, సింగిల్‌‌ విండో చైర్మన్లు హాజరయ్యారు. తాము బీఆర్‌‌ఎస్‌‌ విడిచి ఎవరి వెంట వెళ్లే పరిస్థితే లేదని మీటింగ్‌‌లో తేల్చిచెప్పారు. నియోజకవర్గ ఇన్‌‌చార్జి బాధ్యతలు ఎవరికి అప్పగించినా కలిసికట్టుగా పనిచేస్తామని ప్రకటించారు. మరో వైపు గువ్వల ఇంటి వద్ద నిర్వహించిన మీటింగ్‌‌లో బాలరాజుతో పాటు ఆయన భార్య అమల పాల్గొన్నారు.

తాను పార్టీ వీడటానికి దారి తీసిన పరిస్థితులను గువ్వల వివరించారు. ఈ సందర్భంగా ఆయన మద్దతుదారులు మాట్లాడుతూ..  బీఆర్‌‌ఎస్‌‌ను వీడొద్దని, అవసరమైతే అంతా కలిసి కేసీఆర్‌‌తో మాట్లాడుతామని చెప్పారు. గువ్వల భార్య అమల మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ అగ్ర నాయకులు తనను సంప్రదించారన్న గువ్వల.. రెండు రోజుల్లో వారితో సమావేశమై ఆ తర్వాత ఏ పార్టీలో చేరాలన్న విషయంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.