కామ్రేడ్లకు కేసీఆర్‌‌‌‌ రెడ్ సిగ్నల్.. సీపీఐ, సీపీఎంతో పొత్తుకు ససేమిరా

కామ్రేడ్లకు కేసీఆర్‌‌‌‌ రెడ్ సిగ్నల్.. సీపీఐ, సీపీఎంతో పొత్తుకు ససేమిరా

కామ్రేడ్లకు కేసీఆర్‌‌‌‌ రెడ్ సిగ్నల్
సీపీఐ, సీపీఎంతో పొత్తుకు ససేమిరా
అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు కమ్యూనిస్టుల ప్రయత్నాలు
కనీసం అపాయింట్‌‌మెంట్ ఇవ్వని కేసీఆర్

హైదరాబాద్, వెలుగు : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న కామ్రేడ్లకు బీఆర్ఎస్‌‌ చీఫ్‌‌, సీఎం కేసీఆర్ ​రెడ్ ​సిగ్నల్​ఇస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టులతో దోస్తీ కట్టిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి నడిచేందుకు వెనుకాడుతున్నారు. పొత్తులపై చర్చించేందుకు సీపీఐ, సీపీఎంల స్టేట్​సెక్రటరీలకు కనీసం అపాయింట్‌‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు, అనుసరించాల్సిన వ్యూహాలపై రెండు కమ్యూనిస్టు పార్టీల నేతలు శుక్రవారం హైదరాబాద్‌‌లో సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌‌లోనూ కేసీఆర్​ తీరుపై రెండు పార్టీల నేతలు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. 

పొత్తులపై ప్రగతి భవన్​నుంచి ఎలాంటి సంకేతాలు రాకున్నా కామ్రేడ్లు మాత్రం తాము కారు పార్టీతోనే కలిసి సాగుతామని చెప్తున్నారు. అసెంబ్లీలో ఈ రెండు పార్టీలకు కనీసం ప్రాతినిధ్యం లేకపోవడం, ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగిపోవడంతో కమ్యూనిస్టులు అధికార పార్టీతో కలిసి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. అయితే ఆ పార్టీలు అడుగుతున్న స్థానాలు ఇవ్వడం వీలుకాకనే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు కేసీఆర్​మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఈక్రమంలోనే కమ్యూనిస్టులకు ముఖం చాటేస్తున్నారని గులాబీ ముఖ్య నేతలు చెప్తున్నారు.

అప్పట్లో ప్రగతి భవన్‌‌‌‌‌‌ నుంచే లీకులు

మునుగోడు బైపోల్ తర్వాత రెండు కమ్యూనిస్టు పార్టీలకు రెండేసి ఎమ్మెల్సీ సీట్లతో పాటు ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని ప్రగతి భవన్​నుంచి లీకులు ఇచ్చారు. రెండు పార్టీలు తమ బలానికి తగ్గట్టుగా సీట్లివ్వాలని డిమాండ్​చేస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో మూడే జనరల్​సీట్లు ఉండగా అందులో రెండు స్థానాలు కావాలని రెండు పార్టీలు పట్టుబట్టాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్​జిల్లాల్లో కలిపి రెండు పార్టీలు కనీసం ఎనిమిది నుంచి పది సీట్ల వరకు అడిగాయి. కామ్రేడ్లు కోరుతున్న అనేక స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండటం, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కేసీఆర్​ఆలోచనలో మార్పు వచ్చినట్టుగా తెలుస్తున్నది.

కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం కన్నా సొంతంగానే పోటీ చేయడమే మంచిదనే భావనలో ఆయన ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈక్రమంలోనే కమ్యూనిస్టులు పొత్తుకు సిద్ధంగా ఉన్నా కేసీఆర్​మాత్రం ఓకే చెప్పడం లేదు. సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకుంటే ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పార్టీకి ప్లస్ అవుతుందని ఒకరిద్దరు గులాబీ నేతలు ప్రస్తావించినా కేసీఆర్ స్పందించలేదని తెలుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండబోవని, ఒంటరిగానే పోటీ చేద్దామని సదరు నేతల వద్ద గులాబీ బాస్​తేల్చిచెప్పినట్టుగా సమాచారం.

దూరం పెడుతూ వచ్చిన కేసీఆర్

2014 ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం నుంచి చెరో ఎమ్మెల్యే గెలిచారు. సీపీఐ ఎమ్మెల్యే కొన్ని రోజులకే టీఆర్ఎస్‌‌‌‌లో చేరగా.. సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాత్రం సొంత పార్టీలోనే కొనసాగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు కమ్యూనిస్టు పార్టీల నుంచి ఒక్కరు కూడా గెలువలేదు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్​తో సీపీఐ జట్టుకట్టి మహాకూటమిగా పోటీ చేసింది. సీపీఎం, ఎంసీపీఐ, ఎంబీటీ సహా అనేక పార్టీలు బీఎల్ఎఫ్​గా కూటమి కట్టి పోటీకి దిగాయి. అయినా లెఫ్ట్​ పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ బలం క్రమేణా పెరిగింది. దుబ్బాక, హుజూరాబాద్​ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కమలం పార్టీ సత్తా చాటింది.

ఈక్రమంలోనే వచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని నిలువరించడానికి కామ్రేడ్లతో కేసీఆర్ దోస్తీ కట్టారు. మునుగోడు ఉప ఎన్నిక టైంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఎప్పుడంటే అప్పుడు ప్రగతి భవన్​గేట్లు తెరుచుకునేవి. ఉప ఎన్నికలో గట్టెక్కిన తర్వాత క్రమేణా కమ్యూనిస్టు పార్టీలను కేసీఆర్​దూరం పెడుతూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఐదు నెలలే టైమ్‌‌‌‌ ఉండటంతో పొత్తులపై చర్చించేందుకు కొన్ని రోజుల కిందట సీపీఐ, సీపీఎం సెక్రటరీలు కేసీఆర్​అపాయింట్​మెంట్​కోరారు. కానీ అటువైపు నుంచి స్పందన రాలేదు.