
- ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు కేసీఆర్ సూచన
- గెలిచిన, ఓడిన నేతలతో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో భేటీ
హైదరాబాద్, వెలుగు : కొత్త సర్కారుకు సహకరిద్దామని బీఆర్ఎస్ చీఫ్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలతో పాటు ఓడిన పలువురు నేతలు, మాజీ మంత్రులు సోమవారం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. గెలిచిన ఎమ్మెల్యేలను అభినందించిన కేసీఆర్.. ఓడిపోయిన వారిని ఓదార్చారు. ఓటమితో కుంగిపోవద్దని.. రాజకీయంగా భవిష్యత్ ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిద్దామని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధంగా జనవరి16వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉన్నా ప్రజల తీర్పును గౌరవించి హుందాగా తప్పుకున్నామని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని, రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దామన్నారు.
త్వరలోనే తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని వెల్లడించారు. ఎన్నికల్లో ఓటమికి దారి తీసిన పరిస్థితులు, ఇతర అంశాలపై మాట్లాడుకుందామని అన్నారు. త్వరలోనే బీఆర్ఎస్శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ఎల్పీ నేతను ఎన్నుకుందామని చెప్పారు. ముఖ్య నాయకుల నుంచి కార్యకర్తల వరకు ఏ ఒక్కరూ ఓటమికి నిరాశ చెందవద్దన్నారు.
ఇంత పని చేసి ఓడిపోవడం బాధ కలిగిస్తుందని, దాన్ని అధిగమించి ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలన్నారు. ఈ సమావేశంలో సీనియర్నేతలుపోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు, కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీతా లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్తదితరులు పాల్గొన్నారు.