రామగుండంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల తిరుగుబాటు

రామగుండంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల తిరుగుబాటు
  • పాలకవర్గంపై ధిక్కార స్వరం వినిపించేందుకు ప్రత్యేక ఫోరమ్‌‌ 
  • డివిజన్లలో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వకపోవడంపై ఆగ్రహం 
  • అధికార పార్టీ కార్పొరేటర్ల డివిజన్లపైనా వివక్ష చూపడంపై అలక
  • ప్రత్యక్ష పోరాటం చేసేందుకు రెడీ అవుతున్న కార్పొరేటర్లు

గోదావరిఖని, వెలుగు :  రామగుండం కార్పొరేషన్‌‌లో అధికార బీఆర్‌‌ఎస్‌‌  కార్పొరేటర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తమ డివిజన్లలో అభివృద్ధి పనులు చేయడంలో మేయర్‌‌తో పాటు కమిషనర్‌‌ వివక్ష చూపుతున్నారని, ఇకమీదట తామంతా సమష్టిగా ఉండి ఆయా డివిజన్లలో అభివృద్ధి పనుల కోసం ప్రత్యక్ష పోరాటం చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి ‘రామగుండం కార్పొరేటర్ల ఫోరమ్‌‌’ను ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం 11మంది బీఆర్‌‌ఎస్‌‌ కార్పొరేటర్లు ఒక కమిటీని ప్రకటించుకున్నారు. బుధవారం మేడారం సమ్మక్క‒సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం భవిష్యత్‌‌ కార్యాచరణను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. 

అభివృద్ధి పనులపై వివక్ష చూపుతున్నారని....

కార్పొరేషన్‌లో అధికార పార్టీ కార్పొరేటర్లుగా ఉన్నప్పటికీ తమ డివిజన్లలో వివక్ష చూపుతున్నారని ఇటీవల పలువురు కార్పొరేటర్లు ప్రత్యక్షంగా ఆందోళనకు దిగారు. 32వ డివిజన్‌‌లో సీసీ రోడ్డు నిర్మాణం విషయంలో పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ కార్పొరేటర్‌‌ ఐత శివ బల్దియా ఆఫీస్​ఎదుట ఎండలో కూర్చుని నిరసన తెలిపారు. 42వ, 50వ డివిజన్‌‌కు మధ్యలో ఉన్న కల్యాణ్‌నగర్​ రోడ్డులో అండర్‌‌ గ్రౌండ్‌‌ డ్రైనేజీ పొంగిపొర్లుతూ ఇటు వ్యాపారులకు, అటు కొనుగోలుదారులకు ఇబ్బందిగా మారింది. ఆ రోడ్డుపై నడవాలంటే ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోందని డ్రైనేజీ పొంగిపొర్లే చోట కార్పొరేటర్లు బాల రాజ్​కుమార్, జి.మహాలక్ష్మి నిరసన తెలిపారు. 8వ డివిజన్‌‌లో రోడ్డు నిర్మాణం కోసం కార్పొరేటర్‌‌ దాతు శ్రీనివాస్‌‌ స్థానికులతో కలిసి రాస్తారోకో చేశారు. ఇలా చాలా డివిజన్లలో సమస్యలు పేరుకుపోయినప్పటికీ పాలకవర్గంలో చలనం లేకపోవడంతో అనివార్యంగా కార్పొరేటర్లు ఒంటరిగానైనా పోరాటం చేసి డిమాండ్లు సాధించుకోవాలని నిర్ణయించుకున్నారు.

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షమే

రామగుండం కార్పొరేషన్‌‌కు జరిగిన ఎన్నికల్లో 50 డివిజన్లకు బీఆర్‌‌ఎస్‌ 18 మంది స్థానాలే గెలిచింది. ఈ సంఖ్య అధికారంలోకి రావడానికి సరిపోదని గ్రహించిన పార్టీ పెద్దలు సింహం గుర్తుపై గెలిచిన తొమ్మిది మందిని, ఏడుగురు ఇండిపెండెంట్లను తమ పార్టీలో కలుపుకున్నది. ఆ తర్వాత కాంగ్రెస్‌‌ నుంచి ఒకరిని, బీజేపీ నుంచి ఇద్దరిని తమవైపునకు తిప్పుకొని ప్రస్తుతం 37 మందితో పాలకవర్గం ఏర్పాటైంది. అయితే పేరుకు బీఆర్‌‌ఎస్‌‌ కార్పొరేటర్లుగా ఉన్నా తమ డివిజన్లలో సమస్యలు పరిష్కారం కావడం లేదన్న అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కార్పొరేటర్‌‌గా ఒంటరిగా వెళ్లి మేయర్‌‌ను, కమిషనర్‌‌ను, డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫీసర్లను కలిసి వినతిపత్రాలు ఇచ్చినా పెద్దగా స్పందన రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చాలాసార్లు మేయర్‌‌ చాంబర్‌‌లో జరిగిన మీటింగ్‌‌లలో కూడా తమ గళాన్ని వినిపించినా పట్టించుకునేవారే లేరని కార్పొరేటర్లు చెబుతున్నారు. డివిజన్లలో  సమస్యలపై ఒంటరిగా కంటే అందరూ కలిసికట్టుగా పోరాడితేనే ఫలితం ఉంటుందని కార్పొరేటర్లు నిర్ణయించుకున్నారు. అధికార పార్టీ కార్పొరేటర్లు 11 మంది కలిసి ఫోరమ్‌‌ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి 20వ డివిజన్‌‌ నుంచి బీఆర్‌‌ఎస్‌‌ నుంచి గెలిచిన కన్నూరి సతీశ్‌‌ కుమార్‌‌ అధ్యక్షుడిగా, 17వ డివిజన్‌‌ నుంచి బీఆర్‌‌ఎస్‌‌ టిక్కెట్‌‌పై గెలిచిన సాగంటి శంకర్‌‌ సలహాదారుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.  

ప్రత్యక్ష పోరాటానికైనా సిద్ధం...

రామగుండం కార్పొరేషన్‌‌లో ఆయా డివిజన్లలో పెండింగ్‌‌లో ఉన్న పనులను సత్వరమే మొదలుపెట్టాలి. మిగిలిన ఏడాదిన్నర కాలంలో ప్రజలకిచ్చిన హామీలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకునేలా ఐక్యంగా ముందుకు సాగుతాం. ఆఫీసర్లను, కాంట్రాక్టర్లను సమన్వయపరుస్తాం. అవసరమైతే ప్రత్యక్ష పోరాటాలకు కూడా సిద్ధమవుతాం. అన్ని డివిజన్లు అభివృద్ధి చెందేలా చూడడం ఫోరమ్‌‌ ప్రధాన ఉద్దేశం. - కన్నూరి సతీశ్‌‌ కుమార్‌‌, ఫోరం ప్రెసిడెంట్‌‌