కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్​ కౌన్సిలర్లు

కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్​ కౌన్సిలర్లు

వనపర్తి, వెలుగు: బీఆర్ఎస్​కు చెందిన 8 మంది కౌన్సిలర్లు ఆదివారం బీఆర్ఎస్​కు రాజీనామా చేసి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, నాగర్​కర్నూల్​ ఎంపీ క్యాండిడేట్​ మల్లు రవి ఆధ్వర్వంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్​ పార్టీ మద్దతుదారుడే చైర్మన్​గా ఎన్నిక కానున్నాడు. 25 మంది బీఆర్ఎస్​ కౌన్సిలర్లలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఇద్దరు కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి చైర్మన్, వైస్​ చైర్మన్లతో రాజీనామా చేయించారు.

అయినప్పటికీ అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లలో 8 మంది కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. ఆదివారం చేరిన 8 మందితో పాటు ఇప్పటికే కాంగ్రెస్​ పార్టీలో ఉన్న 10 మంది, ఎమ్మెల్యే ఓటుతో కలిపి 19 మంది అవుతారు. 33 మంది కౌన్సిలర్లు ఉన్న వనపర్తి మున్సిపాలిటీలో  17 మంది మెజారిటీ ఉంటే సరిపోతుంది. కాంగ్రెస్​లో చేరిన వారిలో చైర్మన్​ క్యాండిడేట్​ పుట్టపాకుల మహేశ్, నక్క రాములు, బాషా నాయక్, సత్తమ్మ, చంద్రకళ, పాకనాటి కృష్ణ, భువనేశ్వరి, జంపన్న యాదవ్​  ఉన్నారు. 

భారీ మెజార్టీతో గెలిపించాలి..

నాగర్​కర్నూల్​ ఎంపీగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్​ ఎంపీ క్యాండిడేట్​ మల్లు రవి కోరారు. వనపర్తి నియోజకవర్గంలో భారీ మెజార్టీ అందించాలన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ తనను 25వేల మెజార్టీతో గెలిపించారని, ఎంపీ ఎన్నికల్లో 50 వేల మెజార్టీ అందించాలని పిలుపునిచ్చారు. పట్టణ కాంగ్రెస్​ అధ్యక్షుడు చీర్లచందర్, కౌన్సిలర్లు వెంకటేశ్, నారాయణ, సత్యంసాగర్, జయసుధ, లక్ష్మి, సుమిత్ర, బ్రహ్మంచారి, ఎల్​ సతీశ్​​పాల్గొన్నారు.