కాక పుట్టిస్తున్న ఇల్లందు మున్సిపల్​ రాజకీయం

కాక పుట్టిస్తున్న ఇల్లందు మున్సిపల్​ రాజకీయం
  •     ఎమ్మెల్యే హరిప్రియ వెంట అసమ్మతి కౌన్సిలర్లు
  •     ఎమ్మెల్సీ తాతా మధుపై ఫైర్, ఫోకస్​ పెట్టని ముఖ్య నేతలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాసంపై బీఆర్ఎస్​ అసమ్మతి కౌన్సిలర్లు హైకోర్టులో రిట్​ పిటిషన్​ దాఖలు చేయడం పార్టీలో కాక పుట్టిస్తోంది. అవిశ్వాసం విషయంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే బానోత్​ హరిప్రియ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్, బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఈ వ్యవహారాన్ని పట్టించుకోవం లేదనే విమర్శలున్నాయి. ఇల్లందు మున్సిపల్  చైర్మన్​ డి వెంకటేశ్వరరావుపై అవిశ్వాసం పెట్టిన కౌన్సిలర్లు 10 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు తీరుపై వారు ఫైర్​ అవుతున్నారు. వర్గపోరుకు ఎమ్మెల్సీ తీరే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవిశ్వాసం తీర్మానం కాపీని కలెక్టర్​ అనుదీప్​కు ఇచ్చేందుకు వెళ్లగా, ఆయన తీసుకోకపోవడంతో ఇన్​వార్డులో ఇచ్చి వెళ్లారు. కలెక్టర్​ తీరుపై కౌన్సిలర్లు సీఎస్​కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. ఇదిలాఉంటే అజ్ఞాతంలో ఉన్న కౌన్సిలర్లు కేసీఆర్​ బర్త్​డేను జరుపుకున్నారు.

ఎమ్మెల్యీ తీరుపై ఫైర్..

ఇల్లందు మున్సిపాలిటీ బీఆర్ఎస్​ కౌన్సిలర్ల మధ్య విభేదాలు హైకమాండ్​కు తలనొప్పిగా మారాయి. ఎమ్మెల్యే బానోత్​ హరిప్రియతో ఉన్న పలువురు కౌన్సిలర్లు మున్సిపల్​ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అసమ్మతి కౌన్సిలర్లకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి వర్గం తెరవెనుక మద్దతు ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను బీఆర్ఎస్​కు19 మంది కౌన్సిలర్లున్నారు. అసమ్మతి కౌన్సిలర్లకు చెక్​ పెట్టేలా చైర్మన్​ వర్గం పావులు కదుపుతోంది. ఇందులోభాగంగానే తీర్మానంపై సంతకం చేసేందుకు రూ.10 లక్షలు ఆఫర్​ చేశారని ఇద్దరు కౌన్సిలర్లు పోలీసులకు, కలెక్టరేట్​ ఇన్​వార్డులో కంప్లైంట్​ ఇచ్చారు. ఇక చైర్మన్​ డీవీ వర్గం తమ కౌన్సిలర్లను ప్రలోభ పెట్టకుండా క్యాంప్​ రాజకీయాలకు తెరలేపారు. 12 రోజులుగా అసమ్మతి కౌన్సిలర్లు అజ్ఞాతంలోనే ఉన్నారు. చైర్మన్​ రాజీనామా చేస్తేనే తాము అజ్ఞాతం నుంచి వస్తామని వీడియో పంపించారు. మరోవైపు ఎమ్మెల్సీ తాతా మధుకు ఇల్లందులో ఏం పని అంటూ వారు ప్రశ్నించారు. ఆయన కారణంగానే గ్రూపులు, వర్గాలు ఏర్పడ్డాయని ఆరోపించారు. ఇదే క్రమంలో తాము ఎమ్మెల్యే హరిప్రియ వెంటే ఉన్నామని పేర్కొనడంతో బీఆర్ఎస్​లో వర్గ పోరు  బయటపడింది. ఈ విషయంపై పార్టీ హైకమాండ్​ సీరియస్​ కావడంతో అసమ్మతి కౌన్సిలర్లు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డితో జత కట్టారు. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​తో పాటు ఎమ్మెల్యే హరిప్రియ, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్​ ఏంచేయాలనే యోచనలో ఉన్నట్లు బీఆర్​ఎస్​ నేతలు పేర్కొంటున్నారు.