ఖజానాలో పైసల్లేవ్.. దళిత బంధు ఎట్ల?.

ఖజానాలో పైసల్లేవ్.. దళిత బంధు ఎట్ల?.
  • ఊగిసలాడుతున్న రాష్ట్ర సర్కార్​
  • జులైలో మొదలుపెడ్తామని చెప్పినా ఇంతవరకు స్టార్ట్​ చేయలే
  • సెగ్మెంట్​కు ఎంతమందికి, ఎంతెంత ఇద్దామనే దానిపై లెక్కలు
  • అర్హుల సంఖ్యను తగ్గించే ఆలోచన.. ఎలక్షన్​ టైమ్​ కావడంతో టెన్షన్
  • ఒకేసారి రూ.10 లక్షలు కాకుండా విడతలవారీగా ఇవ్వాలని ప్లాన్​

హైదరాబాద్, వెలుగు:  దళిత బంధు స్కీమ్​పై రాష్ట్ర సర్కార్​ ఊగిసలాడుతున్నది. ఏడాదిన్నరగా ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ వస్తున్న ప్రభుత్వం.. రెండో దశ దళిత బంధును ఇప్పటికీ పట్టాలు ఎక్కించలేదు. జులై నుంచి అమలు చేస్తామని  సీఎం కేసీఆర్​ ప్రకటించినా ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఖజానా నుంచి నిధులు సర్దుబాటు కాకపోవడంతో అడుగు ముందుకు పడటం లేదు. ఎంతమందికి ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది?  నియోజకవర్గానికి వంద మందికా ? రెండు వందల మందికా? మూడు వందల మందికా?.. అనే దానిపై  అధికారులు లెక్కలు కడుతున్నారు.ఒక్కరికి ఒకేసారి రూ.10 లక్షలు కాకుండా.. అదీ కూడా విడతలవారీగా జమ చేస్తే ఎంతమందికి.. ఎంత అవుతుందనేదీ రిపోర్ట్​ తయారు చేస్తున్నారు. 

విడతల వారీగా..!

హుజూరాబాద్​ బై ఎలక్షన్​ టైమ్(2021)​లో ఆ నియోజకవర్గం మొత్తానికి పైలెట్​ ప్రాజెక్ట్​గా దళిత బంధు స్కీంను అమలు చేశారు. అనంతరం పైలెట్​ ప్రాజెక్టు కిందనే మిగతా సెగ్మెంట్లలో ఒక్కో చోట వంద మందికి, మరో నాలుగు మండలాల్లో  పూర్తిస్థాయిలో అమలు చేశారు. అనంతరం ఏటా  1.77 లక్షల మందికి స్కీమ్​ అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ క్రమంలో 2022–23 బడ్జెట్​లో నిధులు కేటాయించినప్పటికీ.. ఆ ఆర్థిక సంవత్సరంలో ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పథకాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు గత నెల 24న అర్హుల ఎంపిక ప్రక్రియపై ఉత్తర్వులు ఇచ్చింది. నియోజకవర్గానికి 1,100 దళిత కుటుంబాలకు స్కీమ్​ను అమలు చేస్తామని, జిల్లాల కలెక్టర్లు నియోజకవర్గాల్లో సంబంధిత ఎమ్మెల్యే, అధికారులతో కలిసి అర్హులను ఎంపిక చేస్తారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే.. రాష్ట్ర ఖజానాను నిధుల కొరత వెంటాడుతున్నది. దీంతో ఎన్నికల వేళ  స్కీములు అమలు చేయకపోతే అసలుకే ఎసరు వస్తుందన్న భావనలో ప్రభుత్వం ఉంది. దీని నుంచి గట్టెక్కేందుకు ఒకేసారి రూ. 10 లక్షలు కాకుండా విడతల వారీగా దళిత బంధు సాయం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. 

లెక్కల మీద లెక్కలేస్తున్నరు 

దళితబంధు సాయం కింద ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుకు  రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉన్నది. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోవడంతో అంత మొత్తం ఒకేసారి ఇస్తే తక్కువ మందికే అందుతుంది. రూ. 10 లక్షలు కాకుండా.. ఒక్కొక్క లబ్ధిదారుకు రూ. 3 లక్షలు లేదా రూ. 5 లక్షల చొప్పున విడతల వారీగా ఇస్తే ఎంత ఖర్చవుతుందని అధికారులు లెక్కగడుతున్నారు. దీని ప్రకారం.. ఒక్కో సెగ్మెంట్​లో 100 మందికి ఒకేసారి రూ.10 లక్షలు ఇస్తే  అన్ని నియోజకవర్గాల్లో కలిపి (హుజూరాబాద్​ తప్ప) 11 వేల 800 మందికి రూ. 1,180 కోట్లు అవసరం అవుతాయి. అదే ఒక్కో సెగ్మెంట్​లో 200 మందికి రూ. 5 లక్షలు జమ చేస్తే కూడా అంతే మొత్తం అవుతుంది. ఇక రూ. 3 లక్షల చొప్పున ఇస్తే నియోజకవర్గానికి 333 మందికి ఇవ్వొచ్చని అధికారులు లెక్కలు వేస్తున్నారు. 


  ఒకవేళ ప్రభుత్వం రూ. 3,540 కోట్లు ఇస్తే.. ఒక్కో సెగ్మెంట్​లో 300 చొప్పున 35 వేల 400మందికి ఒకేసారి రూ.10 లక్షలు జమ చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు. కానీ, దీని వల్ల తక్కువ మందికే లబ్ధిచేకూరినట్లవుతుందని అంచనా వేస్తున్నారు. అలా కాకుండా రూ.5 లక్షల చొప్పున ఇస్తే నియోజకవర్గానికి 600 మందికి ఇవ్వొచ్చని, రాష్ట్రవ్యాప్తంగా 70 వేల 800 మందికి ఇచ్చినట్లవుతుందని లెక్కగడ్తున్నారు. అదే ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు ఇస్తే.. సెగ్మెంట్​కు వెయ్యిమందికి ఇచ్చినట్లవుతుందని, దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా 1.18 లక్షల మందికి దళితబంధు అందించినట్లు అవుతుందని భావిస్తున్నారు. 

ఆగని దరఖాస్తులు

ఒకవైపు దళితబంధు కోసం ఇప్పటికే ఎమ్మెల్యేలు లిస్ట్​ రెడీ చేసి కలెక్టర్లకు పంపారు. అయితే ఈ విషయం తెలియని చాలామంది అర్హులు  మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు పెద్ద ఎత్తున అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. తమకు దళితబంధు ఇప్పించాలంటూ వేడుకుంటున్నారు. కాదంటే ఓట్లకు ఇబ్బందవుతుందని భావిస్తున్న ఎమ్మెల్యేలు తమను కలిసిన వారందరికీ స్కీమ్​ అందుతుందని లిస్టులో పేరు పెడుతామని ఎలక్షన్లు అయ్యే వరకు తమతో తిరగాలని చెప్పి పంపిస్తున్నారు. అదే కలెక్టర్ల దగ్గరికి అర్హులు వెళ్తే.. ‘‘అప్లికేషన్​ తీసుకుంటాం.. కానీ మా చేతిలో ఏమీ లేదు.  మంత్రి లేదా ఎమ్మెల్యేను కలవండి” అని సూచిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 2021లోనే పైలెట్​ ప్రాజెక్ట్​ కింద నియోజకవర్గానికి వంద మంది చొప్పున దళితబంధును అమలు చేసింది. 
ఆ సమయంలో కొందరు ఎమ్మెల్యేలు లబ్ధిదారుల నుంచి కమీషన్లు తీసుకున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. సీఎం కేసీఆర్​ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. బీఆర్​ఎస్​ ఇంటర్నల్​ మీటింగుల్లో వార్నింగ్​ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో అర్హుల ఎంపిక ప్రక్రియను ఎమ్మెల్యేలకు కాకుండా కలెక్టర్లకు అప్పగించాలనే డిమాండ్​ పెరిగింది. అయితే ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా మంత్రులు, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి, వారు ఇచ్చిన లిస్టును పరిగణనలోకి తీసుకొని  ఫైనల్​ చేయాలని కలెక్టర్లకు చెప్పింది. దీంతో కలెక్టర్లు ఏమీ చేయలేకపోతున్నారు. ఎమ్మెల్యే 
చెప్పినోళ్ల పేర్లే లిస్టులో ఉంటున్నాయి.

రూ. 13 వేల కోట్లు కావాలె

వాస్తవానికి ఏటా 1.77 లక్షల మందికి దళిత బంధు (రూ.10 లక్షల చొప్పున) అందిస్తామని బడ్జెట్​లో ప్రభుత్వం పేర్కొంది. పోయిన ఆర్థిక సంవత్సరం ఒక్కరికి కూడా ఇవ్వకుండానే వదిలేసింది. ఈసారి నియోజకవర్గానికి 1,500 మందికి ఇస్తామని బడ్జెట్​లో చెప్పినప్పటికీ.. ఆ సంఖ్యను అధికారికంగానే 1,100కు తగ్గించింది. ఈ లెక్కన దాదాపు 1.30 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ. 13 వేల కోట్లు అవసరం. అయితే ప్రభుత్వం దగ్గర ఫండ్స్​ లేవు. ఎలాగో  ఎన్నికల వరకు స్కీమును లాగాలని, తర్వాత ఏం చేసినా ఎఫెక్ట్​ ఉండదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.

కమీషన్ల కోసం ఎమ్మెల్యేల ఒత్తిడి

దళిత బంధు కోసం ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఒక్కో నియోజకవర్గానికి 1,100 మంది పేర్లతో లిస్ట్​ తయారు చేసి కలెక్టర్లకు పంపారు. కొందరు ఎమ్మెల్యేలు రూ. లక్ష నుంచి 2 లక్షల దాకా కమీషన్​ మాట్లాడుకుని పేర్లను సిఫార్సు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఒక్కో సెగ్మెంట్​లో కనీసం 500 మందికి దళితబంధు సాయం అందిస్తే కమీషన్​ మాట్లాడుకున్న ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 5 కోట్ల నుంచి 10 కోట్ల దాకా అందుతుంది. లబ్ధిదారుల సంఖ్య పెరిగితే వాళ్ల కమీషన్​ కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యేలు..తాము పంపిన లిస్టులను తొందరగా ప్రకటించాలని కలెక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తాము మాట్లాడుకున్న కమీషన్​లో సగమైనా వారి నుంచి తీసుకోవచ్చని, ఖాతాల్లో  స్కీమ్​ డబ్బులు పడ్డ తర్వాత మిగతా కమీషన్​ తీసుకోవచ్చని భావిస్తున్నారు.