బీఆర్​ఎస్​కు గుప్త విరాళాలు రూ. 153 కోట్లు

బీఆర్​ఎస్​కు గుప్త విరాళాలు రూ. 153 కోట్లు
  • మొత్తం విరాళాల్లో గుర్తుతెలియని 
  • వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చినవే 70%
  • అధిక గుప్త విరాళాలు అందుకున్న పార్టీల్లో  బీఆర్​ఎస్​కు మూడో ప్లేస్​
  • మొదటి స్థానంలో డీఎంకే, రెండో స్థానంలో బీజేడీ, నాల్గో స్థానంలో వైఎస్సార్​సీపీ
  • 2021–22 ఏడాదికి సంబంధించి 27 రీజినల్ ​పార్టీల విరాళాల లిస్టును వెల్లడించిన ఏడీఆర్​
  • అన్ని డొనేషన్ల వివరాలు ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని సిఫార్సు

హైదరాబాద్, వెలుగు: గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి రాజకీయ పార్టీలకు భారీగా విరాళాలు వస్తున్నాయి. రాష్ట్రంలోని అధికార పార్టీ బీఆర్​ఎస్​కు 2021–22 ఆర్థిక సంవత్సరంలో గుప్త విరాళాలు రూ. 153 కోట్లు వచ్చినట్లు అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రీఫార్మ్స్​ (ఏడీఆర్)  రిపోర్టులో తేలింది. 27 రీజనల్​ పార్టీల ‘ఇన్​కమ్​ ఫ్రమ్​ అన్​నోన్​ సోర్సెస్​(గుప్త విరాళాలు)’ మీద రూపొందించిన ఈ నివేదిక తాజాగా రిలీజ్​ అయింది. జాబితా ప్రకారం.. అన్​ నోన్​ సోర్సెస్​ నుంచి అధిక విరాళాలు వచ్చిన పార్టీగా  బీఆర్​ఎస్​ మూడో స్థానంలో నిలిచింది. 2021–22లో ఆ పార్టీకి రూ.218 కోట్ల విరాళాలు రాగా.. అందులో రూ.153 కోట్లు గుప్త విరాళాలేనని ఏడీఆర్​ వెల్లడించింది. అంటే.. పార్టీకి వచ్చిన మొత్తం విరాళాల్లో గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చినవే 70 శాతం. కాగా, అన్​నోన్​ సోర్సెస్​ నుంచి అధిక ఆదాయం వచ్చిన పార్టీల జాబితాలో తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే మొదటి స్థానంలో ఉంది. ఆ పార్టీకి రూ. 306 కోట్లు గుప్త విరాళాల రూపంలోనే వచ్చాయి. ఆ తర్వాత రూ. 291 కోట్ల గుప్త విరాళాలతో ఒడిశాలోని అధికార పార్టీ బీజేడీ రెండో స్థానంలో నిలిచింది. రూ. 60 కోట్ల అన్​నోన్​ సోర్సెస్​ విరాళాలతో ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్​సీపీ నాలుగో స్థానంలో ఉంది.

2021–22కు సంబంధించి 27 రీజనల్​ పార్టీలకు మొత్తంగా రూ.1,165.576 కోట్ల విరాళాలు వస్తే.. అందులో రూ.887.55 కోట్లు అన్​నోన్ సోర్సెస్​ ద్వారానే వచ్చినట్లు ఏడీఆర్​ రిపోర్టు స్పష్టం చేసింది. మొత్తం విరాళాల్లో గుప్త విరాళాల వాటానే 76.15 శాతం. నోన్​ సోర్సెస్​ ద్వారా వచ్చిన ఆదాయం రూ. 278 కోట్లు. డీఎంకే పార్టీకి వచ్చిన మొత్తంలో గుప్త విరాళాల వాటానే 96.01 శాతం. బీజేడీకి వచ్చిన గుప్త విరాళాల వాటా 94.73 శాతం. వాస్తవానికి అంతకుముందు ఏడాది 2020–21లో కేవలం 49.73 శాతంగా ఉన్న రీజనల్​ పార్టీల గుప్త విరాళాలు.. ఇప్పుడు 76 శాతానికి చేరాయి. ఆ ఏడాదికి రీజనల్​ పార్టీల మొత్తం విరాళాలు రూ.530.703 కోట్లయితే.. గుప్త దానాల కింద వచ్చింది రూ.263.928 కోట్లు. గుప్త విరాళాల జాబితాలో ఎలక్టోరల్​ బాండ్లు, కూపన్లు, వాలంటరీ కంట్రిబ్యూషన్లు ఉంటున్నాయి. ఎన్నికల కమిషన్​ రూల్స్​ ప్రకారం రూ. 20 వేల పైన డొనేషన్లకు కచ్చితంగా దాతల పేర్లను వెల్లడించాల్సి ఉంటుంది. రూ.20 వేలలోపు వాటికి పేర్లను చెప్పాల్సిన పనిలేదు. ఇది పార్టీలకు కలిసి వస్తున్నది. 

ఏడీఆర్​ చేసిన సూచనలివీ..

  •  రూ.20 వేల లోపు విరాళాల వివరాలను ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలి. ఆర్టీఐ రిపోర్ట్​ ద్వారానైనా ఆ వ్యక్తులు, సంస్థల పేర్లను వెల్లడించే అవకాశం కల్పించాలి.
  • ప్రస్తుతం భూటాన్​, నేపాల్​, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బ్రెజిల్, బల్గేరియా, అమెరికా, జపాన్​ వంటి దేశాల్లో అన్​నోన్ సోర్సెస్ వివరాలను వెల్లడిస్తున్నరు.
  • విదేశీ సంస్థలు విరాళాలిస్తే.. ఆ పార్టీకి లేదా అభ్యర్థికి ప్రచారం చేయకుండా కట్టడి చేయాలి. 
  •  పార్టీలన్నీ తమకు వచ్చిన డొనేషన్ల వివరాలన్నింటినీ ఏటా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించే ఆడిట్​ రిపోర్ట్​ షెడ్యూల్స్​లో వెల్లడించేలా చర్యలు తీసుకోవాలి. రాజకీయ పార్టీలు సమర్పించిన వార్షిక ఆడిట్ రిపోర్టులపై కాగ్​, ఈసీ సమక్షంలో స్ర్కుటినీ చేయాలి.
  • సమాచార హక్కు చట్టం ప్రకారం అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు సమాచారమంతా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.