భూకబ్జా కేసులో బీఆర్ఎస్ లీడర్ అరెస్ట్

భూకబ్జా కేసులో బీఆర్ఎస్ లీడర్ అరెస్ట్

 కరీంనగర్ క్రైం, వెలుగు: భూకబ్జాకు పాల్పడిన కేసులో కరీంనగర్​ జిల్లా తీగలగుట్టపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యుడు కొమ్ము భూమయ్యను పోలీసులు అరెస్టు చేశారు. చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన దీటీ మధు.. 2013లో ఆరెపల్లి శివారులోని సర్వే నంబర్ 311లో 91 గజాల ఇంటి స్థలాన్ని కరీంనగర్​కు చెందిన నల్లవెల్లి రాజు వద్ద కొన్నాడు. తర్వాత అధికారుల అనుమతితో కట్టుకున్నాడు. అయితే గుంజ లక్ష్మణ్ అనే వ్యక్తి ఆ ఇంటిని కాజేయాలని గేటుపై ఉన్న ఇంటి నంబర్ ప్లేట్ ని తొలగించి, మరొక  నంబర్ ప్లేటును తగిలించాడు‌.

సదరు స్థలం తనదని, తాను మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్య దగ్గర కొన్నానని గొడవకు దిగాడు. ఇల్లు వదిలి వెళ్లాలని, లేదంటే చంపుతామని బెదిరించాడు. దీంతో బాధితుడు మధు జనవరి 31న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్య, గుంజ లక్ష్మణ్ కలిసి సర్పంచ్, పంచాయతీ సెక్రటరీల సంతకాలను ఫోర్జరీ చేసి మధు ఇంటిపై ఫేక్ ​డాక్యుమెంట్లు సృష్టించారని తేలింది. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.