సొంత ఎమ్మెల్యేలకు  బీఆర్ఎస్ పొగ..సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు

సొంత ఎమ్మెల్యేలకు  బీఆర్ఎస్ పొగ..సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు
  • అసమ్మతి నేతలకు హైకమాండ్ సపోర్ట్
  • సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు
  • పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో పరేషాన్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యేలు

వెలుగు, నెట్‌‌‌‌‌‌‌‌వర్క్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్తున్న టైమ్​లో కొందరు ఎమ్మెల్యేలకు బీఆర్​ఎస్​ పార్టీ పొమ్మనలేక పొగపెడుతున్నది. పలు సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టుల్లో వారి గ్రాఫ్ పడిపోయిందంటూ వదిలించుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయాచోట్ల సొంత ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పెద్దలు ప్రచారం చేయిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. ఇందుకు తగ్గట్లే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు పోటీగా పలువురు లీడర్లు రంగంలోకి దిగారు. తమకు కేసీఆర్, కేటీఆర్ మద్దతు ఉందని, తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటూ అసమ్మతి రాజేస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేలపై ఉన్న పాత కేసులను ఇప్పుడు ప్రచారంలోకి తెచ్చి రచ్చ చేయడం, సిట్టింగులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా ప్రజల్లో పలుచన చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు బాగా లేకనే టికెట్ ఇవ్వడం లేదనే సంకేతాలను ప్రజల్లోకి చేరేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సొంత పార్టీ నేతలే తమ పరువును బజారున పెడ్తుండడంతో సదరు ఎమ్మెల్యేలు హైకమాండ్‌‌కు ఫిర్యాదు చేస్తున్నా అటు నుంచి కనీస స్పందన లేక పరేషాన్ అవుతున్నారు.

జిల్లాల్లో ఇదీ పరిస్థితి

  • ఆదిలాబాద్ జిల్లాలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్లే ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో దళితబంధు, డబుల్ బెడ్రూం స్కీమ్‌‌లలో భారీ అవినీతి జరిగిందని, ఇందుకు ఎమ్మెల్యేనే కారణమని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ మద్దతుతో మాజీ ఎంపీ గొడం నగేశ్,  నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్, ఆయన అనుచరులే ఈ పని చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
  • మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మెడకు ఆరిజన్ డెయిరీ వివాదం చుట్టుకున్నది. ఈ క్రమంలో చిన్నయ్య వీడియోలు, ఫొటోలను బీఆర్ఎస్ నేతలే పనిగట్టుకొని షేర్​చేశారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఈ ఇష్యూను చల్లారకుండా చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ టికెట్​ఆశిస్తున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగాలేదు. ఇక్కడ ఫిల్మ్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూస్కురు రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ టికెట్ వేటలో ఉన్నారు. దివాకర్​రావుకు వ్యతిరేకంగా పార్టీలోనే నెగటివ్​ ప్రచారం జరుగుతున్నది. 
  • కరీంనగర్ జిల్లాలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌‌కు వ్యతిరేకంగా ప్రముఖ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ గళం విప్పుతున్నారు. రసమయికి వ్యతిరేకంగా వారానికో వీడియో రిలీజ్ చేస్తానని ఇటీవల ప్రకటించారు. బీఆర్ఎస్ అగ్ర నాయకులతో సన్నిహితంగా ఉండే మిట్టపల్లి.. కళాకారుడైన రసమయికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టడం చర్చనీయాంశం గా మారింది. మానకొండూరు ఎమ్మెల్యే టికెట్ పై కన్నేసిన మిట్టపల్లి.. ఆ టికెట్ ను దక్కించుకునేందుకే రసమయిని బద్నాం చేస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే జిల్లాలోని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్‌‌‌‌కు, బీఆర్ఎస్​కు చెందిన వెలమ లీడర్లకు మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తున్నది. దీంతో ఈసారి ఆయనకు టికెట్ దక్కకుండా నేతలు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎస్సీ నేత, కరీంనగర్ 3వ డివిజన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ నియోజకవర్గంపై కన్నేసి, వాల్ రైటింగ్ చేయిస్తున్నాడు.
  • పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ఇసుక, మట్టి అక్రమ దందాలో పాత్ర ఉందని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ భాను ప్రసాదరావుకు సన్నిహితుడైన పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్. రాజయ్య ప్రెస్‌‌మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యే అవినీతిపై ధ్వజమెత్తుతున్నారు. మళ్లీ ఆయనకు టికెట్ ఇస్తే ప్రగతిభవన్ ముందు  దీక్ష చేస్తానని ఇటీవల హెచ్చరించారు. మంథని నియోజకవర్గ ఇన్ చార్జి పుట్ట మధుపై అసంతృప్తితో ఉన్న హైకమాండ్ కాటారం పీఏసీఎస్ చైర్మన్ చల్లా నారాయణరెడ్డిని ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్​కు చెందిన పలువురు యూత్ లీడర్లు సోషల్ మీడియాలో పరోక్షంగా పుట్టమధుపై విమర్శలు చేస్తున్నారు.
  • జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు ఇటీవల ఆయనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌‌లో ఫోర్జరీ కేసు పెట్టింది. ఈ ఫిర్యాదు వెనుక ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రమేయం ఉందని ముత్తిరెడ్డి అనుచరులు అనుమానిస్తున్నారు. కేటీఆర్ నుంచి టికెట్ హామీ ఉన్నందునే శ్రీనివాస్​రెడ్డి రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు. 
  • స్టేషన్ ఘన్‌‌పూర్‌‌‌‌లో ఎమ్మెల్యే రాజయ్య మీద పూటకో ఆరోపణ బయటకు రావడం వెనుక కడియం వర్గం హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య తనను ఎమ్మెల్యే  రాజయ్య లైంగికంగా వేధించారని ఆరోపించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఎప్పుడో జరిగిన ఈ విషయాన్ని కావాలనే మళ్లీ తెరపైకి తెచ్చారని రాజయ్య వర్గీయులు చెప్తున్నారు. 
  • భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ మధుసూదనచారి వర్గీయులు, మధుసూదనచారికి వ్యతిరేకంగా గండ్ర మనుషులు వ్యతిరేక ప్రచారం చేసుకుంటున్నారు. మధుసూదనచారికి హైకమాండ్ సపోర్ట్ ఉన్నందునే గండ్ర వ్యతిరేక ప్రచారం సాగుతున్నదనే అనుమానాలున్నాయి.
  • మెదక్‌‌లో ఈసారి హ్యాట్రిక్ కొట్టాలనే ఆశతో ఉన్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఇంటిపోరు తీవ్రమైంది. కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొడుకు రోహిత్ ఈ సెగ్మెంట్​పై ఫోకస్ పెట్టారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్సీ ఫండ్స్ రిలీజ్ చేస్తుంటే రోహిత్ సేవా కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. రోహిత్ సేవా కార్యక్రమాల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఆయన అనుచరులు, పద్మాదేవేందర్​రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెడ్తుండడం హాట్​టాపిక్​గా మారింది.
  • తుంగతుర్తిలో ఎమ్మార్పీఎస్‌‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల సంచలనం అయ్యాయి. దళితబంధులో ఆయన పెద్దమొత్తంలో కమీషన్లు తీసుకున్నాడని ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ లీడర్ల పాత్ర ఉందనే అనుమానాలున్నాయి. తన టికెట్ కు కేటీఆర్​హామీ ఇచ్చారంటూ సూర్యాపేట జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారిగా పనిచేస్తున్న జ్యోతిపద్మ ఏకంగా క్యాంప్ ఆఫీస్ తెరిచారు.
  • కొత్తగూడెం నియోజకవర్గంపై కన్నేసిన స్టేట్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు రావు.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై విమర్శలు చేస్తున్నారు. వనామా ఇక రెస్ట్ తీసుకుంటే మంచిదని ఇటీవల కామెంట్ చేశారు.

టార్గెట్ చేశారని  ఎమ్మెల్యేల ఆవేదన

నిన్న మొన్నటి దాకా సిట్టింగులకే సీట్లు అని చెప్తూ వచ్చిన సీఎం కేసీఆర్ ఇటీవల మాట మారుస్తున్నారు. దళితబంధులో కొందరు ఎమ్మెల్యేలు రూ.3 లక్షల దాకా లంచం తీసుకున్నారన్న ఆయన, పనితీరు మార్చుకోని ఎమ్మెల్యేల తోకలు కత్తిరిస్తానని హెచ్చరించారు. తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలతో మే 17న తెలంగాణ భవన్​లో నిర్వహించిన సమావేశంలో.. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు ఆగస్టు దాకా గడువు ఇస్తున్నానని, కొత్తవాళ్లకు చాన్స్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. కానీ ఈ లోపే నియోజకవర్గాల్లో తమను టార్గెట్ చేశారని కొందరు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ‘‘ఎమ్మెల్యేలు అన్నాక ఏదో ఒక ఆరోపణ ఉండనే ఉంటది. దళితబంధుకు కమీషన్లు తీసుకున్నారని కొందరిపై, డబుల్ బెడ్రూం ఇండ్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఇంకొందరిపై ఆరోపణలు వచ్చాయి.. మరికొందరిపై భూకబ్జాలు, బినామీ కాంట్రాక్టులు, ఇసుక, మట్టి దందాల ఆరోపణలున్నాయి.. కానీ ఇలా కొద్దిమందినే టార్గెట్ చేయడం బాగాలేదు’’ అని ఓ ఎమ్మెల్యే ఇటీవల తన అనుచరుల దగ్గర వాపోయారు. ‘‘నియోజకవర్గంలో ఇన్నేళ్లుగా పార్టీని కష్టపడి నిర్మించుకున్నం. సార్​సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో రెండు వారాలుగా ఎండలను సైతం లెక్క చేయకుండా జనాల్లో తిరుగుతున్నం. కానీ ఇప్పుడు వచ్చిన కొందరు పారాచ్యూట్​నేతలు కేసీఆర్, కేటీఆర్ పేరు చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉన్న పార్టీలో చిచ్చుపెడ్తురు. తమకే టికెట్​అంటూ మమ్మల్ని బద్నాం చేస్తున్నరు. హైకమాండ్‌‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలేదు’’ అని మరో ప్రజాప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌‌‌‌లో ఎమ్మెల్యే రేఖానాయక్‌‌కు బీఆర్ఎస్ హైకమాండ్ పొగపెడుతున్నదనే ప్రచారం జరుగుతున్నది. కేటీఆర్‌‌‌‌కు సన్నిహితుడైన జాన్సన్ నాయక్ కొంతకాలంగా ఈసారి టికెట్ తనకే అంటూ ఊరూరా తిరుగుతున్నాడు. వాడవాడలా ఫ్లెక్సీలు,  వాల్​పోస్టర్లు వేయిస్తూ హల్​చల్​చేస్తున్నాడు. రేఖానాయక్ పనితీరు బాగాలేదంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారిలా..