రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా దాడులు

రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా దాడులు
  • సంజయ్ యాత్రపై దాడితో మొదలైన ఆగడాలు  
  • జితేందర్ రెడ్డి, అర్వింద్, అరుణ ఇండ్లపై అటాక్ 
  • తాజాగా వైఎస్సార్ టీపీ, కాంగ్రెస్ యాత్రలపై దాడి   
  • అనుచరులను రెచ్చగొడుతున్న ఎమ్మెల్యేలు 
  • బాధితులపైనే కేసులు పెడ్తున్న పోలీసులు


వెలుగు, నెట్​వర్క్: రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా బీఆర్ఎస్ లీడర్లు దాడులకు తెగబడ్తున్నారు. నియోజకవర్గాల్లో అపోజిషన్​లీడర్ల పర్యటనలు, పాదయాత్రలను అడ్డుకుంటూ అల్లర్లు సృష్టిస్తున్నారు. ఫ్లెక్సీలు తగలబెడుతూ, వాహనాలపై రాళ్లు విసురుతూ, కర్రలు, కత్తులతో దాడులు చేస్తున్నారు. ఈ దాడుల వెనుక అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారని, వాళ్లే తమ అనుచరులను రెచ్చగొడ్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా 2021 నవంబర్ లో సూర్యాపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యంగా బీఆర్ఎస్ లీడర్లు చేసిన దాడులతో ఈ తరహా కల్చర్​ మొదలైంది. చివ్వెంల, ఆత్మకూర్(ఎస్) ఐకేపీ సెంటర్ లో వడ్ల కొనుగోళ్లను పరిశీలించేందుకు వచ్చిన సంజయ్​ను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నాయకులపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో దాడి చేసిన బీఆర్ఎస్​ లీడర్లను వదిలి సంజయ్​తోపాటు బీజేపీ నాయకులపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలా పోలీసుల నుంచి వస్తున్న సహకారంతో రూలింగ్​పార్టీ లీడర్లు మరింతగా రెచ్చిపోతున్నారు. గతంలో బీజేపీ నేతల ఇండ్లపై, ఇటీవల వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల కాన్వాయ్​పై, తాజాగా రేవంత్ యాత్రపై దాడి చేశారు.

హైదరాబాద్​లోని ఎంపీ అర్వింద్​ఇంటిపై బీఆర్ఎస్​ కార్యకర్తలు పోయినేడాది నవంబర్​18న దాడి చేశారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను రహస్యంగా కలిశారని అర్వింద్ చేసిన కామెంట్లపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించిన వెంటనే.. బంజారాహిల్స్​లోని అర్వింద్​ఇంటిపై బీఆర్ఎస్ ​నేతలు దాడి చేసి అద్దాలు, ఫర్నిచర్​ ధ్వంసం చేశారు. అదే ఏడాది మార్చి 3న రాత్రి 11 గంటలకు మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్​రెడ్డి ఇండ్లపై బీఆర్ఎస్ లీడర్లు దాడులు చేశారు. ‘‘మంత్రి హత్యకు కుట్ర’’ జరిగిందని పోలీసులు ప్రకటన చేయడంతో బీఆర్ఎస్​కు చెందిన  పది మంది యువకులు ముందుగా జితేందర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి రాళ్లతో దాడి చేసి, కారు అద్దాలను ధ్వంసం చేశారు. సమీపంలోనే ఉన్న డీకే అరుణ ఇంటి వద్దకు వెళ్లి రాళ్లు విసిరారు. మరుసటి రోజు ఉదయం మరో 20 మంది యువకులు జితేందర్​రెడ్డి, డీకే అరుణ ఇండ్లపై మరోసారి దాడి చేశారు. ఇక అదే ఏడాది జనవరి 25న నిజామాబాద్​జిల్లా ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి వద్ద ఎంపీ అర్వింద్ కాన్వాయ్ పై ఎమ్మెల్యే జీవన్​రెడ్డి అనుచరులు కత్తులు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ లీడర్లకు గాయాలు కాగా, ఎంపీ కాన్వాయ్​లోని నాలుగు కార్లు దెబ్బతిన్నాయి. 

షర్మిల యాత్రపై రెండుసార్లు అటాక్.. 

ప్రజాప్రస్థానంలో భాగంగా పోయినేడాది నవంబర్ 28న నర్సంపేట మండలం చెన్నారావుపేటలో షర్మిల పర్యటించారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై విమర్శలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ లీడర్లు ఆమె కాన్వాయ్ పై దాడి చేశారు. షర్మిల బస్సుకు నిప్పు పెట్టి, ఫ్లెక్సీలను తగులబెట్టారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వైఎస్ విగ్రహానికి నిప్పు పెట్టారు. షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి, హైదరాబాద్ కు తరలించారు. హైకోర్టు అనుమతితో 2న నుంచి షర్మిల పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే శంకర్ నాయక్​పై  విమర్శలు చేశారని ఆరోపిస్తూ ఈ నెల 20న శంకర్ నాయక్ భార్య, దాదాపు 500 మంది బీఆర్ఎస్ నాయకులతో 
నైట్ హాల్ట్ వద్దకు చేరుకొని ఫ్లెక్సీలను దహనం చేసి,  దాడి చేశారు. 


రేవంత్ యాత్రపై దాడి

ఈ నెల 19న షర్మిల యాత్రను టార్గెట్‍ చేసిన బీఆర్‍ఎస్‍ లీడర్లు.. 20న వరంగల్‍ సిటీలో జరుగుతున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్‍ సే హాత్‍ జోడో యాత్రను టార్గెట్‍ చేశారు. యూత్‍ కాంగ్రెస్‍ నేత తోట పవన్‍ కుమార్‍పై లోకల్ ఎమ్మెల్యే అనుచరులు కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన పవన్‍ను సోమవారం హనుమకొండలోని ఏకశిల హస్పిటల్‍ కు తరలించగా, మెరుగైన ట్రీట్ మెంట్ కోసం మంగళవారం హైదరాబాద్‍ కు తరలించారు. ఈ ఘటనపై వరంగల్ సీపీకి రేవంత్ ఫిర్యాదు చేశారు. 

ఇంకా ఎన్నో ఘటనలు..

  • ఈ నెల 15, 16 తేదీల్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం దుర్కి, బీర్కూర్ మండలం కిష్టాపూర్​లో బీజేపీ స్ట్రీట్ కార్నర్​ మీటింగ్​లు జరగ్గా.. బీఆర్ఎస్​లీడర్లు అడ్డుకున్నారు. ఇది పోచారం అడ్డా అని, ఇక్కడ బీజేపీకి స్థానం లేదంటూ స్టేజీ పైకి వెళ్లి గొడవకు దిగారు.  
  • జనవరి 31న కరీంనగర్​ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి  కేటీఆర్ రాగా ఏబీవీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. వారిపై పోలీసులు లాఠీచార్జీ చేస్తుండగానే అక్కడే ఉన్న సిరిసిల్ల జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నాయకులు ఏబీవీపీ నాయకులపై దాడి చేశారు. సిద్ధం వేణు కాళ్లతో తన్నిన దృశ్యాలు బయటకొచ్చాయి. 
  • జనవరి 7న మార్కండేయ లిఫ్ట్ పనులను పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులపై నాగర్​కర్నూల్​జిల్లా బిజినేపల్లి మండలంలో బీఆర్ఎస్ లీడర్లు దాడి చేశారు. వీరిలో ఒకరు గిరిజనుడు, మరొకరు దళిత నేత కాగా.. వాళ్లను కాళ్లతో తొక్కడం వివాదాస్పదమైంది.  
  • గతేడాది మే 22న కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్​జిల్లా తిమ్మాపూర్​మండలం మొగిలిపాలెం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం చేపట్టగా, బీఆర్ఎస్​ లీడర్లు అడ్డుకున్నారు. కాంగ్రెస్​జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు పలువురిపై దాడి చేశారు. 
  •  మంచిర్యాల జిల్లా చెన్నూర్​లో నిరుడు ఏప్రిల్ 30న ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, నగునూరి వెంకటేశ్వర్లుగౌడ్, సుద్దపల్లి సుశీల్​కుమార్​తదితరులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఇన్నోవా కారును ధ్వంసం చేశారు. లీడర్ల ఫోన్లు గుంజుకొని పగులగొట్టారు. 
  • గతేడాది ఏప్రిల్ లో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టాడని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో బీజేపీ కార్యకర్త రామచంద్రారెడ్డి పై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తన అనుచరులతో కలిసి దాడి చేశారు. దాడిలో రామచంద్రారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని బీజేపీ నాయకులు పరామర్శించడానికి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య గొడవ జరిగింది. కానీ పోలీసులు బీజేపీకి చెందిన 22 మందిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.