బీఆర్ఎస్​ నేతల అత్యుత్సాహం.. మంత్రి వస్తున్నారని ఏకంగా బ్రిడ్జినే మూసేశారు

బీఆర్ఎస్​ నేతల అత్యుత్సాహం..  మంత్రి వస్తున్నారని ఏకంగా బ్రిడ్జినే మూసేశారు

ఓ తెలుగు సినిమాలో  పోలీస్​గెటప్ లో ఉన్న హీరో అల్లరి నరేష్​.. హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి వెళ్తున్నాడని రోడ్డుపై పబ్లిక్​ని ఆపేసి ట్రాఫిక్​జామ్​ చేస్తాడు గుర్తుందా. ప్రజాప్రతినిధుల మెప్పు పొందేందుకు ప్రస్తుతం కొందరు బీఆర్​ఎస్ నేతల చేస్తున్న పనులు సైతం అలాగే ఉన్నాయి. 

మంత్రి వస్తున్నాడని ఏకంగా ఓ చోట బ్రిడ్జినే మూసేయించారు. ఎక్కడో అనుకునేరు.. ఖమ్మంలోనే. అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు, మున్నేరు వరద నుంచి పబ్లిక్ కి శాశ్వత పరిష్కారం కల్పించనున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేసిన అనంతరం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్​కుమార్  ఆగస్టు 7న ​సొంత జిల్లాకు వస్తున్నారు. 

విషయం తెలుసుకున్న జిల్లా బీఆర్​ఎస్​ నాయకులు ఆయనకు స్వాగతం పలికేందుకు బైక్​ ర్యాలీ ఏర్పాటు చేశారు. పబ్లిక్​ని ఇబ్బంది పెట్టకుండా ర్యాలీ తీస్తే ఇష్యూ ఏమీ లేదు.. కానీ మంత్రి వస్తున్నారని ఏకంగా తెలంగాణ ‌, ఆంధ్ర బార్డర్​లోని మున్నేరు బ్రిడ్జిపై రాకపోకలు నిలిపేశారు. 

దానిపై నుంచి వెళ్లే వాహనాలను బైపాస్​రోడ్డు వైపు మళ్లించారు. దీంతో చుట్టూ తిరిగి వెళ్లేందుకు పబ్లిక్​ అవస్థలు పడుతున్నారు. బైపాస్​నుంచి వెళ్లినా భారీగా ట్రాఫిక్ జాం అవుతుండటంతో గంటల తరబడి ట్రాఫిక్లో ఉండాల్సిన దుస్థితి నెలకొన్నట్లు వాపోతున్నారు.  

ఆఫీసులు, వివిధ పనుల మీద వెళ్లేవారిని వెళ్లనివ్వకుండా బ్రిడ్జిని మూసేయడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చేసేదేమీ లేక పలువురు కుటుంబసభ్యులతో మున్నేరు బ్రిడ్జిపై కాలినడకన వెళ్తున్నారు. బీఆర్​ఎస్​ నేతల అత్యుత్సాహాంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.