- పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని ముట్టడించిన బీఆర్‌ఎస్ లీడర్లు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు : పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు బుధవారం ఎంపీ గొడం నగేశ్ ఇంటి ముట్టడికి యత్నించారు. మాజీమంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆధ్వర్యంలో నాయకులు పట్టణంలోని ఎంపీ ఇంటి వద్దకు చేరుకొని అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ఏడు క్వింటాళ్ల నిబంధన ఎత్తి వేయాలని, తేమతో సంబంధం లేకుండా ప్రతి రైతు నుంచి పత్తిని కొనాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన మాట్లాడాల్సిన ఎంపీ, ఎమ్మెల్యేలు కార్పొరేట్లకు మద్దతు పలకడం సరికాదన్నారు.
విషయం తెలుసుకున్న డీఎస్పీ జీవన్‌రెడ్డి ఎంపీ ఇంటికి చేరుకొని బీఆర్‌ఎస్ లీడర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు జోగు రామన్నను అరెస్ట్ చేసి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆగ్రహానికి గురైన నాయకులు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్, నాయకులు విజ్జగిరి నారాయణ, అలాల్ అజయ్, గండ్రత్ రమేశ్, పవన్ నాయక్, బట్టు సతీశ్, ధమ్మపాల్, ప్రకాశ్, సెవ్వ జగదీశ్ పాల్గొన్నారు.
