జీవో 59.. అప్లికేషన్లలో 40 శాతం అధికార పార్టీ నేతలవే

జీవో 59.. అప్లికేషన్లలో 40 శాతం అధికార పార్టీ నేతలవే
  •  ఇప్పటికే వచ్చిన అప్లికేషన్లలో 40 శాతం పార్టీ నేతలవే

జీవో 59 కింద భూములు రెగ్యులరైజేషన్ ప్రక్రియ అధికార పార్టీ లీడర్లకే మేలు చేకూర్చనుంది. 2020 జూర్ 2 దాకా కబ్జాలో ఉన్న వాటిని కూడా రెగ్యులరైజ్ చేసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ లీడర్లు ఖుషీ అవుతున్నారు. కొందరైతే ఏకంగా పాత డేట్లతో డాక్యుమెంట్లు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాట్లు తెలిసింది.  అప్పట్లో 2014 జూన్ 2 వరకు ఉన్న కబ్జాలకే అప్లికేషన్లు కోరగా.. ఆతర్వాత జరిగిన ప్రభుత్వ భూముల కబ్జాలకు కూడా అప్లై చేసుకున్నారు. దీంతో వేల సంఖ్యల్లో అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉండటం వల్లే  సర్కార్  తేదీని పెంచినట్లు విమర్శలు వస్తున్నాయి. జీవో 58,59 కింద, 3.96 లక్షల అప్లికేషన్లు ఇప్పటికే రెండుసార్లు తీసుకోగా దీంతో అప్పట్లో 40 అప్లికేషన్లు అధికార పార్టీ లీడర్లవే ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

కొత్త అప్లికేషన్లలోనూ ఎక్కువ శాతం బీఆర్ఎస్ లీడర్లవే వస్తాయని అంటున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్​ బడా లీడర్లు ప్రభుత్వ భూములు కబ్జా చేసి కాలేజీలు, హాస్పిటల్స్, ఇతర వాణిజ్య సముదాయాలు నిర్మించారు. ఓపెన్ మార్కెట్ లో కోట్లు విలువ చేసే ఆ భూములను రెగ్యులరైజేషన్ ​కింద తక్కువ ధరకే కొట్టేసేలా పావులు కదుపుతున్నారు.

9 జిల్లాల్లోనే ఎక్కువ

ప్రభుత్వ భూములు కబ్జాకు గురై.. బీఆర్ఎస్ లీడర్లు రెగ్యులరైజేషన్​ కోసం ఎక్కువ అప్లికేషన్లు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి,  సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట,  వరంగల్, హనుమకొండ జిల్లాల నుంచే ఉన్నట్లు తెలిసింది. వచ్చే నెల నుంచి తీసుకోనున్న అప్లికేషన్లు కూడా ఈ జిల్లాల నుంచే ఎక్కువగా వస్తాయని భావిస్తున్నారు. సీఎంకు దగ్గరగా ఉండే ఇద్దరు బీఆర్ఎస్​ లీడర్లు ప్రభుత్వ భూములు కబ్జా చేసి కొత్తగా యూనివర్సిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ ఇద్దరు లీడర్లకు చెందినవి.. వాళ్ల బంధువులకు సంబంధించి కబ్జా పెట్టిన ప్రభుత్వ భూములు వందల ఎకరాల్లో ఉన్నాయి. వాటికి బహిరంగ మార్కెట్​లో కోట్ల ధర పలుకుతోంది. ఇప్పుడు కబ్జా పేరుతో ప్రభుత్వ కార్డ్​ వాల్యూ ప్రకారం తక్కువకే  వాటిని రెగ్యులరైజ్​ చేసుకునే అవకాశం దక్కింది. 

ఎక్కడికక్కడ కబ్జాలు, ఆక్రమణలు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో బీఆర్ఎస్​ లీడర్లు ఆక్రమించిన ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. నగర శివారులో ఒక లీడర్ ​ప్రభుత్వ భూమిలోనే రిసార్ట్​ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఒక మంత్రికి చెందిన ప్రధాన అనుచరుడు ఎకరా ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్​ హాస్పిటల్​రన్​ చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి చెందిన అగ్రోస్, టీఎస్ఐఐసీ, ఇతర కార్పొరేషన్లకు చెందిన అనేక భూములు జిల్లాల్లో అధికార పార్టీ నేతల కబ్జాలకు గురయ్యాయని ఆయా డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లు చెప్తున్నారు. మొదటి దఫా ప్రభుత్వం నాటికి అంటే 2018 వరకు ఉన్న కబ్జాలే రెగ్యులరైజ్​ చేయాలని ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల కేబినెట్​ భేటీలో తేదీ పెంచేలా ఒత్తిడి రావడంతో ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

మహిళల పేరు మీదే డీడ్స్

125 గజాల్లోపు స్థలాలను ఆక్రమించి నిర్మించుకున్న ఇండ్లను ఉచితంగా రెగ్యులరైజ్​ చేస్తారు. 250 గజాల్లోపు ఆక్రమణలకు ప్రభుత్వ కనీస ధరలో 50%.. 250 నుంచి 500 గజాల స్థలాలకు కనీస ధరలో 75% సొమ్మును ఫీజుగా కట్టాలి. 500 నుంచి 1000 గజాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకున్నవారు ప్రభుత్వ కనీస ధరను పూర్తిగా చెల్లించాలి. నివాసేతర వినియోగ భూములకు విస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రభుత్వ కనీస ధరను పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులరైజేషన్​పై ఆర్డీవో చైర్మన్‌గా, సంబంధిత తహసీల్దార్‌ సభ్యులుగా ఉండే కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. తహసీల్దార్లు సదరు దరఖాస్తుదారుల కుటుంబాల్లోని మహిళల పేరు మీదే కన్వేయన్స్‌ డీడ్‌ను చేసి ఇవ్వాల్సి ఉంటుంది.

రూ.3 వేల కోట్ల ఆమ్దానీ

కబ్జాలకు గురైన ప్రభుత్వ స్థలాల రెగ్యులరైజేషన్​ ద్వారా రూ.3 వేల కోట్లు రాబట్టుకోవాలని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొత్తగా తీసుకునే అప్లికేషన్లకు ప్రస్తుత  ప్రభుత్వ వాల్యూ ప్రకారమే ఫీజు వసూలు చేయనున్నారు. గతంలో తీసుకున్న అప్లికేషన్లకు ఏ రోజైతే అప్లై చేసుకున్నారో.. ఆ తేదీ నాడు ఉన్న కార్డు వాల్యూ ప్రకారం ఫీజు తీసుకోనున్నట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. గతంలో జీవో 59 కింద తీసుకున్న 17 వేల అప్లికేషన్లకు సర్కారు ఆమోదముద్ర వేసింది. దీంతో రూ.400 కోట్లు ప్రభుత్వానికి చేరింది. జీవో 58, కొత్త అప్లికేషన్లతో ఇంకో రూ.2,600 కోట్లు వస్తుందని అంచనా వేస్తోంది.