ఎమ్మెల్యే గాంధీ ప్రధాన అనుచరుడు అరెస్ట్

ఎమ్మెల్యే గాంధీ ప్రధాన అనుచరుడు అరెస్ట్

మాదాపూర్, వెలుగు: వెయ్యి గజాల స్థలాన్ని ఆక్రమించి, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే స్థలం ఓనర్​ను చంపేస్తానంటూ బెదిరిస్తున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రధాన అనుచరుడు, మాదాపూర్​డివిజన్​బీఆర్ఎస్​అధ్యక్షుడు ఎర్రగుండ్ల శ్రీనివాస్​యాదవ్ ను పోలీసులు అరెస్ట్​ చేశారు. సైబరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట గ్రామంలోని సర్వే నంబర్ 4పి,5పి, 6పిలలో 500 గజాలు చొప్పున రెండు ప్లాట్లు కొనింది. తర్వాత ఆమె అమెరికా వెళ్లగా, ఆ ప్లాట్లపై బీఆర్ఎస్​నేత ఎర్రగుండ్ల శ్రీనివాస్​యాదవ్​కన్నేశాడు. మొత్తం వెయ్యి గజాల స్థలాన్ని ఆక్రమించాడు.

 రాజు క్రికెట్ అకాడమీ పేరుతో చుట్టూ ఫెన్సింగ్​ఏర్పాటు చేశాడు. తర్వాత ప్లాట్లలో గుడిసెలు వేయించాడు. అమెరికా నుంచి తిరిగొచ్చిన మహిళ తన ప్లాట్లు ఆక్రమణకు గురయ్యాయని తెలుసుకుంది. వెంటనే ఖాళీ చేయాలని శ్రీనివాస్​యాదవ్​ను అడగగా బెదిరించాడు. ఖాళీ చేయాలంటే తనకు రూ.5కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తానని బ్లాక్​మెయిల్​చేశాడు. దీంతో బాధితురాలు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించింది. సైబరాబాద్​ సీపీ అవినాష్​ మహంతి ఆదేశాలతో బుధవారం శ్రీనివాస్​యాదవ్​ను మాదాపూర్​ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

శ్రీనివాస్​ యాదవ్​పై అనేక ఆరోపణలు

మాదాపూర్​లో నివాసం ఉండే ఎర్రగుండ్ల శ్రీనివాస్​యాదవ్​శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీకి ప్రధాన అనుచరుడు. నిత్యం ఎమ్మెల్యే వెంటే ఉంటాడు. ప్రస్తుతం మాదాపూర్ ​డివిజన్ బీఆర్ఎస్​అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. శ్రీనివాస్​యాదవ్​పై గతంలో అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే అనుచరుడు కావడం, బీఆర్ఎస్​అధికారంలో ఉండడంతో పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు.