టికెట్ కోసం అభ్యర్థులు ఆగమాగం!

టికెట్ కోసం అభ్యర్థులు ఆగమాగం!

కొందరు  ఆ ప్రాంతం కోసం కానీ, అక్కడి ప్రజల కోసం కానీ చేసిన త్యాగం ఏమీ ఉండదు. ఒక్క రోజు కూడా తమ జీవితంలో ఎవరికీ కూడా మేలు చేసింది లేదు. చిన్న,పెద్ద పదవుల్లో ఉండి చేసింది కూడా ఏమీ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే వారి జీవితంలో జనహితంలో బతికిన ఒక్క రోజు కూడా ఉండదు. కానీ ఎన్నికలు దగ్గర పడుతుంటే తామేదో వారు టికెట్ ఆశించే ప్రాంతం లో ఏ ఎండకు ఆ గొడుగు పట్టే   ఓ నలుగురిని వెంటేసుకుని, స్థానికంగా తిరుగుతూ, పరామర్శలు చేస్తూ, పలకరిస్తూ, పత్రికా ప్రకటనలు చేస్తూ, ఎమ్మెల్యే అభ్యర్థుల మాదిరి ఫోజు కొట్టే వారు రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు. బీఆర్ఎస్ లో 80 శాతంకన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యే ల మీద  ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు. పార్టీ కూడా సిట్టింగ్ లలో 50 శాతం మందికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు అనే ప్రచారం ఉంది. సీఎం కేసీఆర్ కు ఎవరి మీద ఏం అభిప్రాయం ఉందో ఎవరికీ తెలియదు. ఉదాహరణ కు మంచిర్యాల ఉంది. ఇక్కడ బీసీలు,అందులో పెరక సామాజిక వర్గం మెజారిటీలో ఉన్నారు. కాని ఇక్కడ ఒకే ఒక్కసారి ఆ సామాజిక వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గం వారు ఎమ్మెల్యే లు గా ఎంపిక అయినా,  దశాబ్దాలుగా వెలమలే ఎమ్మెల్యేలుగా ఎంపిక అవుతున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలోనూ ఈ సామాజిక వర్గం వారికే టిక్కెట్లు ఇస్తూ వస్తున్నారు. బీసీలు ప్రతీ ఎన్నికల ముందు ఐక్యతా రాగం తీస్తారు. చివరికి మైనారిటీస్ కన్నా తక్కువ సంఖ్యలో ఉన్న వెలమలకు సపోర్ట్ చేసేస్తారు. ఈ సారి అన్ని పార్టీల్లోనూ బీసీలు టికెట్ ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా పై మూడు పార్టీల్లో వీరు 18 మంది వరకు ఉంటారు.

కుల, మత సంఘాల హడావుడి

ఇక ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అన్ని కులాల, మతాల సంఘాలు బయలు దేరుతాయి. వారికి సిట్టింగులు, ఆశావహులు మీటింగులు పెట్టి, దావతులు ఇచ్చి, హామీలు ఇస్తారు. తాయిలాలు, తోఫాలు, నగదులు అందచేస్తారు. ఇదంతా దాదాపు రాష్ట్రం అంతా ఉంటుంది. ఇక చెన్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ లాంటి రిజర్వు నియోజక వర్గాల్లో అయితే రాజకీయం ఆసక్తి కరంగా ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీ కే టికెట్స్  పోటీ ఎక్కువ ఉంది. దళితుల్లో ఉప కులాల ఓట్ల లెక్కలు ఎవరికి అనుకూలంగా వారికి అన్నట్లు చెప్పుకోవడం జరుగుతుంది. మాల, మాదిగ, నేతకానిల మధ్యన ఈ పోటీ కనిపిస్తుంది. ఎప్పుడూకూడా ఇటుదిక్కు కనిపించని వారు మేము లోకల్ అంటూ, ఇక్కడే పుట్టాము,పెరిగాము అంటూ నలుగురిని వెంటేసుకుని తిరుగుతూ ఉంటారు. వారి ఎజెండా ఏమిటీ? వారు ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంది.

మంచి ఎమ్మెల్యేలు కావాలి

ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాజస్థాన్ లో ఆలం బాధి, మాజీ సీపీఐ ఎమ్మెల్యే దివంగత రజబలి, గుండ మల్లేష్, దివంగత మాజీ మంత్రి, మాజీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి.జనార్దన్ రెడ్డి లాంటి వారిలో ఉన్న క్వాలిటీస్ చాలా తక్కువ మందిలో ఉంటాయి. అలాంటి వారిని ఇప్పుడు జనం కోరుకుంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో సామాన్యులు ఎవరూ సీఎంను కలిసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే లు ఏదో కొద్ది మందిని తప్ప మెజారిటీలో జనాన్ని కలువరు. ముగ్గురు నలుగురు తప్ప అందరు మంత్రుల పరిస్థితి అంతే! మనుషులు అంటే అసలు విలువే లేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు!ఈ నేపథ్యంలో గతంలో మాదిరి స్పష్టంగా గెలుపుపై చెప్పగలిగే పరిస్థితి లేదు. తప్పకుండా వీళ్ళు గెలుస్తారు అని చెప్పలేము. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడిప్పుడే అనుభవాల నుంచి చాలా గుణపాఠాలను నేర్చుకుంటున్నది కాబట్టి, ఊహలు, సర్వేలకు కాలం చెల్లింది. బహుపరాక్!  

- ఎండి.మునీర్,
సీనియర్ జర్నలిస్ట్