- ఇంట గెలుద్దాం..!
- అటకెక్కిన జాతీయ రాజకీయాలు
- తెలంగాణ ఎన్నికలపైనే బీఆర్ఎస్ శ్రద్ధ
- కేసీఆరే హ్యాట్రిక్ సీఎం అంటున్న కేటీఆర్
- మళ్లీ సెంటిమెంట్ రాజేస్తున్న హరీశ్, కేటీఆర్
- బీఆర్ఎస్ గా మారినా జాతీయస్థాయిలో నో యాక్టివిటీస్
- కేవలం మహారాష్ట్రలో మాత్రమే మీటింగ్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అధికార పార్టీని ఇజ్జత్ కా సవాల్ గా తీసుకుంటోంది. నాలుగు నెలల్లో జరబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంపైనే ప్రధానంగా దృష్టి సారించింది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన కేసీఆర్ కేవలం తెలంగాణ దాటి మహారాష్ట్రలో మాత్రమే యాక్టివిటీస్ చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ లో చేరిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
తన కుమారుడు శిశిర్ తో కలిసి కాంగ్రెస్ చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ శాఖను ఏర్పాటు చేసి తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిగా నియమించినప్పటికీ ఆ రాష్ట్రంలోకి ఇంత వరకు కేసీఆర్ ఎంట్రీ ఇవ్వలేదు. అక్కడ పార్టీ కార్యకలాపాలు కూడా ప్రారంభం కాలేదు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ సీఎం కుమారస్వామితో అంటకాగిన కేసీఆర్.. అక్కడ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. అలా అని కుమారస్వామికి మద్దతుగా ప్రచారం కూడా చేయలేదు. అయితే తెలంగాణ లేదంటే మహారాష్ట్ర అన్నట్టుంగా సాగుతున్నాయి గులాబీ పార్టీ పాలిటిక్స్.
భావి ప్రధాని ఎవరు..?
భావి ప్రధాని కేసీఆర్.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్.. తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది.. వంటి నినాదాలతో పార్టీని దేశవ్యాప్తం చేయాలని భావించిన కేసీఆర్ తెలంగాణ, మహారాష్ట్రకే ఎందుకు పరిమితమయ్యారన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా రూపాంతంరం చెందిన తర్వాత కోట్లాది రూపాయలు ప్రజాధనంతో నేషనల్ మీడియాలో, హిందీ, ఇంగ్లీషు, ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పత్రికల్లో తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై ప్రకటనలు ఇచ్చారు. రైతు చట్టాలపై జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన పొరుగు రాష్ట్రాల వారికీ తెలంగాణ సర్కారు తరఫున ఆర్థికసాయం కూడా అందించారు.
ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలో భాగమేనంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. వీటిని గులాబీ టీం పెద్దగా పట్టించుకోలేదు. గత కొన్ని రోజులుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు మీటింగ్స్ లో పాల్గొంటూ.. తెలంగాణలో మళ్లీ ఏర్పడబోయేది బీఆర్ఎస్ సర్కారేనని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని చెబుతున్నారు. అప్పట్లో దేశ ప్రధానిగా కేసీఆర్ కు అర్హత, అవకాశం ఉన్నాయని చెప్పిన కేటీఆర్.. ఇప్పుడు కేసీఆర్ ను రాష్ట్రానికే ఎందుకు పరిమితం చేస్తున్నారు..? కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాల్లోకి వెళ్లరా..? ఇక్కడే ఉంటారా..? అనే విశ్లేషణ మరో వైపు సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ లకు తామే ప్రత్యామ్నాయమని చెప్పిన కేసీఆర్.. మిగతా రాష్ట్రాలపై ఎందుకు దృష్టి సారించడం లేదు..? అన్నది చర్చనీయాంశమైమంది.
తెరపైకి సెంటిమెంట్
2018 ఎన్నికల్లో మాదిరిగా సెంటిమెంట్ రాజేసి ఈ సారి కూడా అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ గా రూపాంతంరం చెందిన కొత్తలో నాయకులు జై తెలంగాణ స్థానంలో జై భారత్ అనే కొత్తరాగాన్ని అందుకున్నారు. వినటానికి కొంత ఇబ్బందికరంగా అనిపించినా.. అనటానికి వాళ్లు ఇబ్బంది పడలేదు. ఇటీవల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్న మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు మళ్లీ జై తెలంగాణ నినాదాన్ని తెరమీదకు తెచ్చారు.
రాష్ట్రం ఏర్పడి దాదాపు పదేండ్లు పూర్తవుతున్నా పాత పల్లవే అందుకుంటున్నారు. సమైక్యపాలనలో తెలంగాణ సర్వనాశనం అయ్యిందని పాత ముచ్చట్లనే వేదికలపై మాట్లాడుతున్నారు. ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ ను తెరమీదకు తీసుకొస్తున్నారు. నీళ్ల అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆంధ్రలో అభివృద్ధి జరగలేదని, తామే ఎంతో చేశామనీ పోల్చుతున్నారు. మంత్రి హరీశ్ రావు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణకు బద్ధ వ్యతిరేకి చంద్రబాబు శిష్యుడనే ప్రచారాన్ని ప్రారంభించారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వం.. అని అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీపైనా విమర్శలు చేస్తున్నారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తిరిగి వాళ్లకే అప్పగిద్దామా..? అంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. దేశం ఆచరించే పథకాలను రూపొందించిన సర్కారు ఎన్నికలనే సరికి సెంటిమెంట్ రాగం అందుకోవడం ఏంటి..? రాష్ట్రంలో కారు పరిస్థితి బాగాలేదా..? గండం గట్టేక్కేందుకు ఈ ట్రిక్స్ ప్లే చేస్తోందా..? అనేది హాట్ టాపిక్ గా మారింది.