
అటు పబ్లిక్‌లో, ఇటు పార్టీ క్యాడర్లో తీవ్ర వ్యతిరేకత
మేడ్చల్ జిల్లాలో ఒక్కరు మినహా ఎమ్మెల్యేలందరిపై భూకబ్జా ఆరోపణలు
అన్ని సెగ్మెంట్లలో గ్రూపు తగాదాలు
అభివృద్ధిలో వెనుకంజ, స్కీములు అందకపోవడంపై పబ్లిక్ నారాజ్
బీజేపీ, కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే చాన్స్
హైదరాబాద్/ సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి : గత ఎన్నికల్లో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో అన్ని స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఈసారి అది అంత ఈజీ కాదనే టాక్నడుస్తోంది. సొంతపార్టీలో గ్రూపులు, ఎమ్మెల్యేల మీద అవినీతి, కబ్జా ఆరోపణలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పుంజుకోవడం.. లాంటి అంశాలు రూలింగ్పార్టీ విజయావకాశాల మీద ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డిపై పబ్లిక్‌లోనూ, సొంత పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. సిటింగ్ఎమ్మెల్యేలను కాదని టికెట్దక్కించుకునేందుకు పలుచోట్ల సీనియర్ లీడర్లు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. నియోజకవర్గాల్లో మౌలికవసతులు కల్పించకపోవడం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంచకపోవడం, అర్హులైన వారికి పెన్షన్లు రాకపోవడంతో సిట్టింగ్‌ల మీద స్థానికంగా వ్యతిరేకత ఉంది. స్వయంగా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే అభివృద్ధి కనిపించడం లేదు. జిల్లాలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తప్ప మిగతా ఎమ్మెల్యేలందరి మీద ఆరోపణలున్నాయి. సిటింగ్ఎమ్మెల్యేలు ఏదో ఒక చోట ప్రత్యక్షంగానో, పరోక్షంగానే భూవివాదాల్లో ఇరుక్కున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మల్కాజ్గిరి నుంచి గెలవడంతో ఇక్కడ కాంగ్రెస్ పట్టు నిలుపుకొంటోంది. టీడీపీ ఇక లేదనుకుంటున్న సమయంలో సీనియర్లీడర్ కాసాని జ్ఙానేశ్వర్ ఆ పార్టీ పగ్గాలు చేపట్టడంతో ఆ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్ లో బలమైన నాయకుడు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చేరడంతో బీజేపీ కూడా బలపడింది. దీంతో ఇక్కడ మూడు పార్టీలు నువ్వానేనా అన్నట్టు పోటీపడ్తున్నాయి.
మంత్రికి ఎదురుగాలి
మేడ్చల్ లో బీఆర్ఎస్ కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మంత్రి మల్లారెడ్డిపై ప్రజల్లోనూ, సొంత పార్టీ కార్యకర్తలోనూ తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయనపై భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. భూవివాదాలకు సంబంధించి మంత్రి మీద రెండు కేసులు కూడా నమోదయ్యాయి. నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్న అసంతృప్తి ఉంది. ఫిర్జాది గూడ, ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీ చైర్మన్ లతో కూడా మంత్రి మల్లారెడ్డికి మంచి సంబంధాలు లేవు. జవహర్ నగర్ మేయర్‌పై సొంతపార్టీ వారే అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. మంత్రి జోక్యం చేసుకున్నా వారు వెనక్కి తగ్గలేదు. మేయర్, కార్పొరేటర్ల మధ్య ఆయన సమన్వయం చేయలేకపోయారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కూడా మంత్రికి చాలాకాలంగా విభేదాలు ఉన్నాయి. జిల్లా ఎమ్మెల్యేలు మైనంపల్లి , మాధవరపు కృష్ణారావు, బేతిసుభాష్‌రెడ్డి, వివేకానంద గౌడ్ మంత్రికి వ్యతిరేకంగా భేటీ అయ్యారు. మంత్రి సీనియర్లను పట్టించుకోవడంలేదని తిరుగుబాటు చేశారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి కొంత కాలంగా యాక్టివ్‌గా లేరు. ఈ సారి కాంగ్రెస్ నుంచి హరివర్దన్‌రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
మల్కాజిగిరిలో బీజేపీకి పట్టు
మల్కాజిగిరిలో అధికార పార్టీ బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదుర్కోనుంది. మల్కాజిగిరి సర్కిల్ లో ఆరు డివిజన్లు ఉండగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మూడు డివిజన్లను బీజేపీ గెలుచుకుంది. రేవంత్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గం మీదే ఫోకస్ పెట్టాడు. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉండడం ఆయనకు అనుకూలించవచ్చు. గత ఎన్నికల్లో పొత్తు వల్ల ఇక్కడ కాంగ్రెస్ పోటీలో లేదు. ఈ సీటును టీజేఎస్‌కు కేటాయించగా.. కపిలవాయి దిలీప్‌కుమార్ పోటీ చేశారు. ఈసారి కాంగ్రెస్ నుంచి నందికంటి శ్రీధర్ బరిలో దిగనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు ఈసారి అసెంబ్లీకి తన కుమారున్ని పోటీచేయించి తాను పార్లమెంట్ కు పోటీ చేయాలని భావిస్తున్నారు. కేటీఆర్‌తో ఉన్న సంబంధాల వల్ల ఇద్దరికీ టికెట్లు దక్కవచ్చునని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హన్మంతరావు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ ఆయన దూకుడు స్వభావం కొంతవరకు మైనస్ కానుంది.
కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్లో గ్రూపుల లొల్లి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్గపోరు ఎదుర్కొంటోంది. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. శంబీపూర్ రాజు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని దూకుడుగా వెళ్తున్నారు. నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, పార్టీ సీనియర్లు, ఉద్యమకారులు రాజు వైపే ఉన్నారు. గతంలో టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే వివేకానంద వైపు ఉన్నారు. నియోజకవర్గంలోని వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. కబ్జా ఆరోపణలు, కేసులు ఉన్న వ్యక్తులు ఎమ్మెల్యే వెంట తిరుగుతున్నారు. దీంతో ఎమ్మెల్యేనే భూ కబ్జాలు చేపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో అతిపెద్దదైన ఫాక్స్ సాగర్ చెరువును కాపాడడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా లబ్దిదారులకు ఇవ్వలేదు. ఇవన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంఐఎం వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఆ పార్టీ కుత్బుల్లాపూర్ నుంచి బరిలోకి దిగితే బీఆర్ఎస్కు నష్టం తప్పదు. బీజేపీ నుంచి కూన శ్రీశైలం గౌడ్ పోటీ చేసే అవకాశం ఉంది. గతంలో ఇండిపెండెంట్ గా గెలిచిన శ్రీశైలం కు ఇక్కడ గట్టి పట్టు ఉంది. మరో బలమైన నాయకుడు, టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా బరిలో ఉండనున్నారు. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరం కానుంది.
కూకట్‌పల్లిలో సిట్టింగ్‌కే మళ్లీ చాన్స్?
కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకే మళ్లీ టికెట్వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఆయనకు పార్టీ నుంచి సమస్యలు లేవు. గత ఎన్నికల్లో అన్ని పార్టీల మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని ఇక్కడ నుంచి పోటీ చేశారు. ఈసారి టీడీపీ పోటీలో ఉంటుందా అన్నది ఇంకా క్లారిటీ లేదు. అప్పుడు బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన పన్నాల హరీశ్‌రెడ్డి ప్రస్తుతం బీజేపీ మేడ్చల్ అర్బన్ అధ్యక్షుడుగా ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన మాధవరం కాంతారావు టికెట్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వడ్డేపల్లి నర్సింగరావు కొడుకు రాజేశ్వరరావు కూడా బీజేపీలో చేరారు. వీరిలో ఎవరు అభ్యర్థి అయినా కలిసి పనిచేస్తే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. గొట్టిముక్కల వెంగళరావు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సన్నిహితుడైన సత్యం శ్రీరంగం కాంగ్రెస్ టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉప్పల్ బీఆర్ఎస్కు సొంతపార్టీ నుంచే సవాళ్లు
ఉప్పల్ లో బీఆర్ఎస్ కు ఈసారి కష్టాలు తప్పేలా లేవు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన బేతి సుభాష్‌రెడ్డి నాలుగేళ్లలో నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని ప్రజలు అంటున్నారు. సొంత పార్టీ కార్పొరేటర్లతోనే ఆయనకు మంచి సంబంధాలు లేవు. ఉప్పల్ పరిధిలోని ఆరు డివిజన్లలో రెండు కాంగ్రెస్ , ఒకటి బీజేపీ కైవసం చేసుకున్నాయి. సొంత డివిజన్ హబ్సిగూడలో పోటీ చేసిన ఎమ్మెల్యే భార్య కూడా ఓటమి పాలయ్యారు. సొంత అభ్యర్థులను గెలిపించుకోలేకపోయాడనే వ్యతిరేకత కూడా ఆయనపై ఉంది. జవహర్‌నగర్‌లో భూకబ్జాలకు పాల్పడినట్లు కూడా ఆరోపణలున్నాయి. భూ కబ్జాకు సంబంధించి ఎమ్మెల్యే, అతని కొడుకుపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ సారి ఉప్పల్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. కేటీఆర్ ద్వారా ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బండారు లక్ష్మారెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఆయన హరీశ్‌రావు ద్వారా టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యమ నాయకుడు, గ్రేటర్ డిప్యూటీ మేయర్ భర్త మోతె శోభన్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తూ ప్రచారం మొదలు పెట్టారు. బీజేపీ ఈ స్థానాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎన్వీ ఎస్ఎస్ ప్రభాకర్ బరిలో ఉండనున్నారు. కాంగ్రెస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఆయన బీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది.
2018 ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు
మేడ్చల్
మల్లారెడ్డి(టీఆర్ఎస్) 1,67,087
కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కాంగ్రెస్) 79,334
నక్కా ప్రభాకర్ గౌడ్(బీఎస్పీ) 25,829
పెద్ది మోహన్ రెడ్డి (బీజేపీ) 23,041
మల్కాజిగిరి
మైనంపల్లి హన్మంతరావు (టీఆర్ఎస్) 1,14,149
ఎన్ రామచంద్రారావు (బీజేపీ) 40,451
కపిలవాయి దిలీప్‌కుమార్ (టీజేఎస్) 34,219
కుత్బుల్లాపూర్
కేపీ వివేకానంద (టీఆర్ఎస్) 1,54,500
కూన శ్రీశైలం గౌడ్ (కాంగ్రెస్) 1,13,400
కాసాని వీరేశ్(బీజేపీ) 9,833
కూకట్ పల్లి
మాధవరం కృష్ణారావు (టీఆర్ఎస్) 1,11,612
నందమూరి వెంకట సుహాసిణి (టీడీపీ) 70,563
పన్నాల హరి చంద్రారెడ్డి(బీఎస్పీ) 12,761
మాధవరం కాంతారావు(బీజేపీ) 11,943
ఉప్పల్
భేతి సుభాష్‌రెడ్డి(టీఆర్ఎస్) 1,17,442
తూళ్ల వీరేందర్‌గౌడ్( టీడీపీ) 69,274
ఎన్వీ ఎస్ఎస్ ప్రభాకర్(బీజేపీ) 26,798
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
అనుకూల అంశాలు:
సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఇంటింటా పరిచయాలు ఉండటం
పార్టీలో అంతర్గత విభేదాలు లేకపోవడం
ప్రజలతో మమేకమై అభివృద్ధి పనులు చేయడం
గల్లీల్లో పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉండడం
ప్రతికూల అంశాలు:
27 బీసీ కులాలను ఓసీ జాబితాలో చేర్చడం
దశాబ్దాలుగా పరిష్కారం కాని గుడిసె వాసుల సమస్య
కేపీహెచ్బీ కాలనీ థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ సమస్య తీరకపోవడం
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
అనుకూల అంశాలు:
నియోజకవర్గంలో మౌలిక వసతులకు ప్రాధాన్యం
కార్యకర్తలకు అందుబాటులో ఉండటం
సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం
ప్రతికూల అంశాలు:
ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించకపోవడం
గతంలో నిధులు మంజూరైన వాజ్ పేయి నగర్ రైల్వే గేటు అండర్ పాస్ పెండింగ్ లో ఉండడం
ఇందిరా నెహ్రు నగర్, భగత్‌సింగ్ నగర్ ఇండ్ల పట్టాలు పెండింగులో ఉండడం
ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
అనుకూల అంశాలు:
ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉండడం
హైకమాండ్‌తో మంచి సంబంధాలు ఉండడం
ప్రతికూల అంశాలు:
తన సొంత డివిజన్లో తన భార్యను కూడా గెలిపించుకోలేకపోవడం
జవహర్‌నగర్ లో భూ కబ్జాల ఆరోపణలు, కేసులు
కార్యకర్తలను కలుపుకుని పోడనే ఆరోపణలు
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద
అనుకూల అంశాలు:
మంచినీటి వసతుల మెరుగు, ప్రజలకు అందుబాటులో ఉండడం
బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి కృషి చేయడం
ప్రతికూల అంశాలు:
వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురికావడం
కబ్జాదారులు, కేసులు ఉన్న వ్యక్తులను తన వెంట తిప్పుకోవడం
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెన్షన్లు ఇవ్వకపోవడం
ఫాక్స్ సాగర్ చెరువును కాపాడడంలో విఫలం
మేడ్చల్ ఎమ్మెల్యే సి. మల్లారెడ్డి
అనుకూల అంశాలు:
ప్రజలకు అందుబాటులో ఉండడం
నియోజకవర్గంలో అభివృద్ధికి, మున్సిపాలిటీల్లో పనులకు ప్రాధాన్యత ఇవ్వడం
ప్రతికూల అంశాలు:
సొంత పార్టీ లీడర్లు, క్యాడర్ నుంచి వ్యతిరేకత
భూ కబ్జాల ఆరోపణలు
తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు
విద్యా సంస్థలపై ఐటీ దాడులు