కేసీఆర్ గప్‌‌చుప్.. లోక్​సభ ఎన్నికల ఫలితాల తర్వాత నోరువిప్పని బీఆర్ఎస్​ చీఫ్​

కేసీఆర్ గప్‌‌చుప్.. లోక్​సభ ఎన్నికల ఫలితాల  తర్వాత నోరువిప్పని బీఆర్ఎస్​ చీఫ్​
  • పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను కాపాడుకోవడంపై అంతర్మథనం
  • ప్రతిపక్ష హోదానైనా నిలుపుకొనేందుకు యత్నం

హైదరాబాద్, వెలుగు:  లోక్‌‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఆర్‌‌‌‌ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్‌‌‌‌ సైలెంట్ అయ్యారు. రిజల్ట్స్​ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఆయన ఇంటి నుంచి బయటకు రాలేదు. ఎన్నికల ఫలితాలపై కనీసం ఓ ప్రకటన కూడా విడుదల చేయలేదు. పార్టీ నాయకులు, ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతో సమావేశం కూడా నిర్వహించలేదు. రామోజీరావుకు నివాళులు అర్పించడానికి కూడా కేసీఆర్ వెళ్లలేదు. మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం వచ్చినా, అటెండ్ కాలేదు. లోక్‌‌సభ ఎన్నికల్లో అవమానకర ఓటమిని ఆయన ఊహించలేకపోయారని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని  ఎదుర్కోలేదని కేసీఆర్ సన్నిహితులు చెప్తున్నారు. ఆయన మౌనానికి ఇదే కారణమై ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగావడం లేదని, ప్రజలంతా తమ వైపు చూస్తున్నారని లోక్‌‌సభ ఎన్నికలకు ముందు కేసీఆర్ చెప్పుకొచ్చారు. 

‘కాంగ్రెస్ వల్లే కరువు వచ్చింది.. కాంగ్రెస్​ వచ్చినంక కరెంట్ ఉంటలేదు..  మళ్లీ మోటర్లు కాలుతన్నయ్​..  కాళేశ్వరం నీళ్లను కావాలనే ఎత్తిపోస్తలేరు.. నీళ్లున్నా  పంటలను ఎండవెడ్తన్రు..’ అంటూ ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌కు ఓటు వేసినందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని, ఇప్పుడు తమను కోరుకుంటున్నారని బస్సు యాత్ర ఆసాంతం కేసీఆర్ ఇదే చెబుతూ వచ్చారు.  ‘సారే కావాలంటున్నరు, సారే రావాలంటున్నరు’ అంటూ పాటలు రాయించుకున్నారు. అదంతా బీఆర్‌‌‌‌ఎస్ ప్రచారమే తప్ప, అందులో ఏమాత్రం నిజం లేదని తమ ఓటు పోటుతో ప్రజలు తేల్చేశారు. కాంగ్రెస్‌‌పై వ్యతిరేకత మాట పక్కనబెడితే, అసలు సార్ కావాలని ఒక్క నియోజకవర్గం కూడా కోరుకోలేదన్నది తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓట్లు వస్తే, లోక్‌‌సభ ఎన్నికల నాటికి అది 16 శాతానికి పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లలో లీడ్ వస్తే, లోక్‌‌సభ  ఎన్నికల నాటికి ఈ సంఖ్య మూడుకు పడిపోయింది. సున్నా సీట్లు వచ్చాయి.  దీంతో ప్రజలు బీఆర్‌‌‌‌ఎస్‌‌ను తిరిగి కోరుకోకపోగా, మరింత తిరస్కరించారన్నది స్పష్టమైంది. ఈ పరిస్థితి కేసీఆర్‌‌‌‌కు మింగుడుపడడం లేదని, అందుకే ఆయన మౌనం వహిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రతిపక్ష హోదా కాపాడుకునేందుకు యత్నం

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్, కేటీఆర్​లో మార్పు వస్తుందని అందరూ ఆశించారు. కానీ, ఆ ఓటమిపై ఆత్మ విమర్శ చేసుకోకపోగా, ప్రజలే తప్పు చేశారన్నట్టుగా ఇరువురు నేతలు మాట్లాడుతూ వచ్చారు. ఏడాది తిరగకుండానే అధికారంలోకి వస్తామని కామెంట్లు చేశారు. దీంతో సారు (కేసీఆర్​) మారలేదని ఆ పార్టీ నేతలే కామెంట్​ చేశారు. కేసీఆర్​ తీరుపై కొంత మందైతే పార్టీ మీటింగ్స్​లో బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. కొంత మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు తమ దారి తాము చూసుకున్నారు. బీజేపీలోకి, కాంగ్రెస్‌‌లోకి వెళ్లిపోయారు. కొంత మంది పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకుందామని వేచి చూశారు. 

అసెంబ్లీ కంటే ఘోర ఓటమి ఎదురవడంతో, ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని, కేడర్‌‌‌‌ను కాపాడుకోవడం ఎలా అన్నది కేసీఆర్ సహా బీఆర్‌‌‌‌ఎస్ అధిష్టానాన్ని కలిచివేస్తోంది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌‌పై పోరాటాలు చేసే పరిస్థితి లేదని, అనవసరమైన విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి ఉండదని తేలిపోయింది. దీంతో నాయకుల్ని కాపాడుకోవడం ఎలా? అని కేసీఆర్ మదనపడుతున్నట్టు తెలంగాణ భవన్‌‌లో చర్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొంత మంది కాంగ్రెస్‌‌, మరికొంత మంది బీజేపీ వైపు చూస్తున్నట్టుగా ఇప్పటికే ప్రచారం నడుస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యేలు జారిపోతే.. ప్రస్తుతం ఉన్న ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా పోయే ప్రమాదం ఉన్నదని, దాన్ని కాపాడుకోవాలని కేసీఆర్​ ప్రయత్నాలు చేస్తున్నారు. 

బీఆర్ఎస్​ను భయపెడుతున్న బీజేపీ

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే బీఆర్‌‌‌‌ఎస్‌‌ను బీజేపీనే ఎక్కువగా భయపెడుతోంది. లోక్‌‌సభ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌ఎస్ జీరోకు పడిపోతే, బీజేపీ 4 నుంచి 8 సీట్లకు ఎదిగింది. కాషాయ పార్టీకి ఓటు షేర్ 14 నుంచి 35 శాతానికి పెరిగింది. సౌత్ ఇండియాలో కర్నాటక తర్వాత తెలంగాణపైనే బీజేపీకి కొంత హోప్స్ ఉండగా, ఇప్పుడది మరింత బలపడింది. రాష్ట్రంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌ పని ఖతం అయిందని, కాంగ్రెస్‌‌కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ నాయకులు ప్రచారం కూడా ప్రారంభించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కిషన్‌‌రెడ్డితో పాటు బండి సంజయ్‌‌కి కూడా మంత్రి పదవిని ఇవ్వడం భవిష్యత్తు వ్యూహంలో భాగమేనని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. 

ఇప్పటికే లిక్కర్ కేసులో కవిత జైల్లో ఉంది. ఆమెను జైల్లో పెట్టడం వల్లే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్‌‌ పెరిగిందని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవినీతి వ్యవహారాలకు పాల్పడిన నాయకులు, అక్రమ ఆస్తులు కూడబెట్టిన నాయకులు జంకుతున్నారు. ఐటీ, ఈడీ దాడులు జరగడానికి ముందే, బీజేపీలోకి వెళ్లడం బెటర్​ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుల బెడద పార్టీ ముఖ్య నాయకులకు కూడా తప్పదంటున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ పరివారాన్ని బెంబేలెత్తిస్తోంది. గొర్రెల స్కామ్ వంటివి మాజీ మంత్రులను కూడా వణికిస్తున్నాయి.