- బీఆర్ఎస్పోరాటంతోనే రూ.60 వేల కోట్ల భూమికి రక్షణ: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: మియాపూర్‌లోని 550 ఎకరాల ప్రభుత్వ భూములను ఎనిమిదేండ్ల న్యాయపోరాటంతో కాపాడింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ సర్కారు కాపాడిన భూములను అమ్ముతామని సీఎం రేవంత్ ప్రకటించడం సిగ్గుచేటని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పుపై సీఎం చెప్తున్నవన్నీ అబద్ధాలని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ భూ వివాదం 2003లోనే సుప్రీంకోర్టుకు చేరిందని, 2013లో సివిల్ అప్పీల్‌గా మారిందని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, 2015లో సీనియర్ న్యాయవాది సీ.ఎస్. వైద్యనాథన్‌ను నియమించిందన్నారు. ఆయన అదే ఏడాది ఏప్రిల్ 7 నుంచి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారని, 2023 వరకు అఫిడవిట్లు, ఆధారాలతో న్యాయపోరాటం కొనసాగించారని తెలిపారు.
మియాపూర్‌లోని 550 ఎకరాల భూముల విలువ రూ.60 వేల కోట్లకు పైగా ఉంటుందని సీఎం చెప్పారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఘనతను రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు.
