ఎవరొస్తారో..!ప్రత్యర్థులపై బీఆర్ఎస్​ సిట్టింగ్​ల నజర్​

ఎవరొస్తారో..!ప్రత్యర్థులపై బీఆర్ఎస్​ సిట్టింగ్​ల నజర్​
  •     పార్టీ నేతలు, కార్యకర్తలను ఆరా తీస్తున్న  క్యాండిడేట్లు 
  •     బలహీనులు వస్తేనే గెలుపు ఈజీ అవుతుందనే అంచనా
  •     వచ్చే వారిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనా వ్యూహాలు
  •     గ్రేటర్ సిటీలోని గులాబీ సిట్టింగ్​లకు పట్టుకున్న టెన్షన్

హైదరాబాద్, వెలుగు : వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ సిటీలో ప్రత్యర్థి పార్టీల నుంచి పోటీ చేసేది ఎవరనే ఆసక్తి బీఆర్ఎస్ సిట్టింగ్​ల్లో  నెలకొంది. అన్ని స్థానాల్లో బరిలోకి దిగే ప్రత్యర్థులపై గులాబీ క్యాండి
డేట్లు  ఇప్పటినుంచే నజర్ పెట్టారు. మరోసారి గెలవాలంటే కాంగ్రెస్, బీజేపీ నుంచి బలహీన అభ్యర్థులు రావాలని కోరుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు పార్టీ కిందిస్థాయి నేతలు, కార్యకర్తల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. ఇందుకు ప్లాన్ రెడీ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సొంత పార్టీలోని అసమ్మతులు, వర్గపోరును పార్టీ అధిష్టానం చూసుకుంటుందనే ధీమాతో ఉండగా.. పలువురు బీఆర్ఎస్​సిట్టింగ్​లు ఇప్పటికే ప్రచారంపై ఫోకస్ పెట్టారు. గత ఎన్నికలతో పోల్చితే.. ఈసారి బీఆర్ఎస్ సిట్టింగ్ లకు కాంగ్రెస్, బీజేపీ బలమైన పోటీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. 

బలమైన అభ్యర్థులు వస్తే..

తమ నియోజకవర్గాల నుంచి మరోసారి గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్​ సిట్టింగ్​లు తీవ్ర కసరత్తు చేస్తుకుంటున్నారు. ఉదాహరణకు సికింద్రాబాద్​ నుంచి డిప్యూటీ స్పీకర్​పద్మారావు  ప్రాతినిథ్యం వహిస్తుండగా.. ఇక్కడి నుంచి కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరు పోటీలో ఉంటారనేది ఆరా తీస్తుండగా.. ఆసక్తి నెలకొంది. కొద్దిరోజుల కిందట బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ పోటీ చేస్తారని ప్రచారంలో ఉండగా.. ఆమె వస్తే పద్మారావుకు బలమైన పోటీదారు అవుతుందని భావిస్తున్నారు. కాంగ్రెస్​ నుంచి ఎవరనేది తెలియడం లేదు. సనత్​నగర్ ​నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ ​యాదవ్​ సైతం తనకు పోటీగా ప్రత్యర్థులు  ఎవరు వస్తారనే దానిపై దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో  కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి మర్రి శశిధర్​రెడ్డి పోటీ చేశారు.

ఇప్పుడాయన బీజేపీలో ఉండగా.. ఆ పార్టీ నుంచే పోటీ చేయొచ్చని తెలుస్తుంది. అలాగే..కాంగ్రెస్​ నుంచి శశిధర్ రెడ్డి కొడుకు ఆదిత్యారెడ్డి పోటీలో ఉండొచ్చనేది సమాచారం. తండ్రీ కొడుకులు నిలబడితే మంత్రి తలసానికి తీవ్ర పోటీ ఉంటుంది. ముషీరాబాద్ ​నుంచి ముఠా గోపాల్​ ఎమ్మెల్యేగా ఉండగా.. గత ఎన్నికల్లో కాంగ్రెస్​నుంచి ఎం.అనిల్​కుమార్​ యాదవ్​ పోటీ చేశారు. ఈసారి ఆయన తండ్రి, మాజీ ఎంపీ అంజన్ ​కుమార్ ​యాదవ్​ పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తున్నది. బీజేపీ నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​ పోటీ చేయగా.. ఈసారి రాకపోవచ్చని తెలుస్తోంది. హిమాచల్​ప్రదేశ్​గవర్నర్​బండారు దత్తాత్రేయ కూతురు పోటీ చేస్తారనేది టాక్.

 ఖైరతాబాద్​నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్​ మరోసారి గెలుపుకోసం ముమ్మరంగా ప్రయతిస్తుండగా.. కాంగ్రెస్​ అభ్యర్థి డాక్టర్​రోహిన్​​రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పోటీలో ఉంటారని ప్రచారంలో ఉంది. దీంతో ఇక్కడ ఆసక్తి నెలకొంది. తమకు పోటీ ఇచ్చే వారిపైనే గెలుపు ఆధారపడి ఉంటుందనే టెన్షన్ పట్టుకుంది. 

 ఆ రెండు పార్టీల కసరత్తు

ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ కూడా క్యాండిడేట్ల ఎంపికపై కసరత్తు చేపట్టాయి. ఆయా పార్టీలకు చెందిన పలువురు ఆశావహులు దరఖాస్తులు చేసుకోగా.. అధిష్టానాలు కూడా అభ్యర్థుల వడపోతపై దృష్టిపెట్టాయి. మరోవైపు తమకే టికెట్​వస్తుందనే ధీమాలో ఆయా పార్టీల నేతలు ఉన్నారు. దీంతో ప్రతిరోజూ గాంధీభవన్, బీజేపీ స్టేట్ఆ ఫీసుకు పార్టీ పెద్ద నేతలను కలిసేందుకు వెళ్తుండగా సందడిగా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు అభ్యర్థుల గెలుపు అంశాలనే దృష్టిలో పెట్టుకుని ఈసారి టికెట్లు ఖరారయ్యే చాన్స్ ఉందని కాంగ్రెస్​కు చెందిన ఓ సీనియర్ ​నేత అభిప్రాయపడ్డారు.

ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే..

 గ్రేటర్​పరిధిలోని24  స్థానాల్లో  ప్రస్తుతం సికింద్రాబాద్, సనత్​నగర్​, కుత్బుల్లాపూర్, కూకట్​పల్లి, శేరిలింగంపల్లి, ఎల్ బీనగర్, రాజేంద్రనగర్, ముషీరాబాద్, ఉప్పల్, అంబర్​పేట, పటాన్​చెరు, కంటోన్మెంట్(ఎమ్మెల్యే సాయన్న మృతి), జూబ్లీహిల్స్, ఖైరతాబాద్​స్థాన్లాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. రోజురోజుకూ మారే రాజకీయ పరిణామాల కారణంగా బీఆర్ఎస్  సిట్టింగ్​లు తమ స్థానాలు తిరిగి పదిలం చేసుకునేందుకు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపైనే దృష్టిపెట్టారు.