సెస్ చైర్మన్​ రేసులో చిక్కాల రామారావు ?

సెస్ చైర్మన్​ రేసులో చిక్కాల రామారావు ?

రాజన్న సిరిసిల్ల, వెలుగు:  సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేయడంతో చైర్మన్​గా చిక్కాల రామారావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సెస్ పరిధిలో ఉన్న 15 డైరెక్టర్ స్థానాలను బీఆర్​ఎస్​ ​మద్దతుదారులు గెలుచుకున్నారు. నేడు చైర్మన్ ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో సెస్ చైర్మన్ గా పని చేసిన చిక్కాల రామారావుకే మళ్లీ సెస్ చైర్మన్ పదవి లభించనుందని సమాచారం. తంగళ్లపల్లి సెస్ డైరెక్టర్ గా భారీ మెజార్టీతో గెలిచిన చిక్కాల..  తాను గెలిస్తే చైర్మన్ అవుతానని ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నారు. అనుకున్నట్టే మంత్రి కేటీఆర్ ఆయనకే చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు ఛాన్స్​ ఉన్నట్లు తెలుస్తోంది.

గెలిచిన అభ్యర్థులు హైదరాబాద్ కు పయనం..


సెస్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు సోమవారం హైదరాబాద్ కు పయనమయ్యారు. వారంతా మంత్రి కేటీఆర్ ను కలిసి రాత్రి అక్కడే బస చేసి నేరుగా చైర్మన్ ఎన్నిక  సమయానికి సెస్ కార్యాలయానికి వస్తారని తెలిసింది.  

పద్మశాలీలకు అవకాశం కల్పించాలి..

సిరిసిల్లలో అత్యధిక జనాభా ఉన్న పద్మశాలీలకే చైర్మన్ పదవి ఇవ్వాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని టౌన్ 1, టౌన్ 2 స్థానాలలో ఇద్దరు పద్మశాలీలు గెలుపొందారు. టౌన్ 1 నుంచి గెలిచిన దిడ్డి మాధవి, టౌన్ 2 నుంచి గెలిచిన దార్నం లక్ష్మీనారాయణ ఇద్దరిలో ఒక్కరికి వైస్ చైర్మన్ పదవి ఇస్తారని భావిస్తున్నారు.  

బీజేపీ నాయకుల అక్రమ అరెస్ట్

కోనరావుపేట : సెస్​ ఎన్నికల కౌంటింగ్ లో వేములవాడ రూరల్ బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కౌంటింగ్ హాల్ వద్ద గందరగోళం చోటుచేసుకోవడంతో పొలీసులు బీజేపీ నాయకులను  కోనరావుపేట స్టేషన్ కు తరలించారు.  అనంతరం బీఆర్ఎస్​ నేతలు పట్టుబట్టడంతో  అధికారులు రీకౌంటింగ్​ చేసి 3 ఓట్ల మెజారిటీతో బీఆర్​ఎస్ అభ్యర్థి ఆకుల దేవరాజం విజయం సాధించినట్లు తెలిపారు. బీజేపీ స్టేట్ లీడర్ ఎర్రం మహేశ్ మాట్లాడుతూ  బీఆర్ఎస్ నేతలు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసుల కండువాలు లేకుండా బీఆర్ఎస్ కు పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను ఇంకెన్ని రోజులు అణచివేస్తారన్నారు. అరెస్టయిన వారిలో వేములవాడ ఎంపీపీ బండ మల్లేశం, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నంద్యాడపు వెంకటేశ్ నాయకులు తదితరులు ఉన్నారు.


గెలుపొందిన అభ్యర్థులు వీరే..

1. తంగళ్లపల్లి సెస్ డైరెక్టర్ చిక్కాల రామారావు, 2. బోయినిపల్లి నుంచి కొత్తపల్లి సుధాకర్, 3. రుద్రంగి నుంచి ఆకుల గంగారాం, 4. గంభీరావుపేట నుంచి గౌరీనేని నారాయణ రావు, 5. కోనరావుపేట నుంచి దేవరకొండ తిరుపతి, 6. సిరిసిల్ల టౌన్ 2 నుంచి దార్నా లక్ష్మీనారాయణ, 7. ముస్తాబాద్ నుంచి సందుపట్ల అంజిరెడ్డి, 8.ఎల్లారెడ్డిపేట నుంచి కృష్ణహరి, 9. సిరిసిల్ల సెస్ టౌన్ 1 నుంచి దిద్ది రమాదేవి, 10. వీర్నపల్లి నుంచి మాడుగుల మల్లేశం, 11.చందుర్తి నుంచి పొన్నాల శ్రీనివాసరావు, 12.వేములవాడ -అర్బన్​ నుంచి రేగులపాటి హరిచరణ్ రావు,13. వేములవాడ నుంచి నామాల ఉమ, 14. ఇల్లంతకుంట నుంచి మల్లుగారి రవీందర్ రెడ్డి, 15. వేములవాడ రూరల్ సెస్​ డైరెక్టర్ గా ఆకుల దేవరాజం ఎన్నికయ్యారు.