- రూ.25వేల కోట్లతో అయ్యేదానికి లక్షన్నర కోట్లు అవసరమా?: కేటీఆర్
ఎల్బీనగర్, వెలుగు: డబ్బులు దోచుకునేందుకే కాంగ్రెస్ సర్కారు మూసీ పనులు చేపడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మూసీ బ్యూటిఫికేషన్‌కు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని, లూటిఫికేషన్ కు మాత్రమే తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. హైదరాబాద్ నాగోల్‌లోని ఎస్టీపీ (సీవరేజ్ ట్రీట్‌మెంట్‌ప్లాంట్)ని శనివారం స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రులు, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణకు రూ.25వేల కోట్లు చాలని, కానీ కాంగ్రెస్ పార్టీ రూ.1.50 లక్షల కోట్లు కేటాయిస్తున్నదని అన్నారు. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా మూసీ సుందరీకరణకు తమ ప్రభుత్వ హయాంలోనే అంతా సిద్ధం చేశామని చెప్పారు. 57 కిలోమీటర్ల మూసీ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని, ఎల్బీనగర్ ఎమ్మెల్యేను చైర్మన్‌గా నియమించి, పనులు ప్రారంభించామని చెప్పారు. హైదరాబాద్, నల్గొండ జిల్లా ప్రజలకు మూసీ మురుగు నుంచి విముక్తి కల్పించడానికి నిధులు కేటాయించామని అన్నారు.
4 దశల్లో మూసీ సుందరీకరణకు అంతా సిద్ధం చేశామని చెప్పారు. మొదటగా మూసీ తీరం వెంట ఉన్న వారసత్వ సంపదను కాపాడుతూనే కొత్తగా సుందరీకరణ పనులు చేయాలని నిర్ణయించామని తెలిపారు. 57 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మూసీపై రూ.545 కోట్లతో 15 బ్రిడ్జిలు నిర్మించిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందన్నారు. రూ.3,866 కోట్ల వ్యయంతో 31 ఎన్టీపీల నిర్మాణం చేపట్టామని తెలిపారు.
ఇందులో భాగంగా నాగోల్‌లో అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మూసీ పనులను తమ ప్రభుత్వం ప్రారంభిస్తే.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తానే చేశానని ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. మూసీ నిర్వాసితులకు ఇస్తున్న ఇండ్లు కూడా కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూంలేనని తెలిపారు. ఇటీవల తనను మూసీ పక్కన 3 నెలలు ఉండాలని రేవంత్ సవాల్ చేశారని, అక్కడ 3 నెలలు కాదు.. మూడేండ్లైనా ఉంటానని కేటీఆర్ అన్నారు.
నేడు రైతు భరోసాపై నిరసనలు
కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే రైతు భరోసా ఇస్తామంటూ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన ప్రకటనపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రకటనతో వర్షాకాలం సీజన్ రైతు భరోసా ఎగ్గొట్టినట్లే అని చెప్పారన్నారు. ఇది కచ్చితంగా రైతులను మోసం చేయటమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యకు నిరసనగా ఆదివారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లా లని సూచించారు. కేబినెట్ సబ్ కమిటీ, కొత్త గైడ్ లైన్స్ అంటూ డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు చేస్తున్న అన్యాయాన్ని బీఆర్ఎస్ సహించదన్నారు. రేవంత్ కుట్రల గురించి రైతులకు తెలిసేలా చేయాలని పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.