హత్యా రాజకీయాలు మంచివి కావు : కేటీఆర్

హత్యా రాజకీయాలు మంచివి కావు : కేటీఆర్
  • మల్లేశ్​ కుటుంబానికి అండగా ఉంటాం: కేటీఆర్

హైదరాబాద్/ కొల్లాపూర్, వెలుగు: హత్యా రాజకీయాలు మంచివి కావని బీఆర్ఎ స్  వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్  అన్నారు. నాగర్​కర్నూల్​ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావ్ పల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన మల్లేశ్​ కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఈ రక మైన సంస్కృతి మంచిది కాదని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించి, ఈ కేసులో నిజానిజాలు బయటకుతీయాలని డీజీపీ, ఎస్పీలను ఆయన కోరారు. కాంగ్రెస్  ప్రభుత్వం, మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవ తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. కాల్  డేటాను బయట 
పెట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

హత్యకు గురైన మల్లేశ్​ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. మల్లేశ్​ భార్య నిర్మలకు ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందించారు.

ఎంపీ ఎలక్షన్​లో కాంగ్రెస్, బీజేపీ కలిసే పని చేస్తయ్

రాబోయే ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తాయని బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్​(ట్విట్టర్) లో ఓ పోస్ట్​పెట్టారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​మీడియాతో మాట్లాడిన క్లిప్​ను ఆ పోస్ట్​కు జత చేశారు. 2019 లోక్​సభ ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్​లో బీజేపీ ఎంపీల గెలుపు కోసం కాంగ్రెస్​ పార్టీ టూల్​గా పని చేసిందని అన్నారు.