ఎమ్మెల్యేల సొంత సర్వే .. ఇల్లిల్లూ తిరుగుతున్న బీఆర్ఎస్​ క్యాడర్​

ఎమ్మెల్యేల సొంత సర్వే .. ఇల్లిల్లూ తిరుగుతున్న బీఆర్ఎస్​ క్యాడర్​
  • ప్రభుత్వ పథకాలపై ఆరా ఓటర్ల వివరాలతో పాటు ఫోన్​  నంబర్లు కుడా సేకరణ 
  • ఫోన్ నంబర్లు తీసుకోవడంపై అనుమానాలు

జయశంకర్​ భూపాలపల్లి/ సిద్దిపేట, వెలుగు: బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సొంత సర్వేలు చేయిస్తున్నారు. తమ అనుచరులు, పార్టీ క్యాడర్​ను గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ తిప్పుతూ ఓటర్ల నుంచి పలు వివరాలు, ఫోన్​ నంబర్లు సేకరిస్తున్నారు. ఆయా కుటుంబాల్లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? వాళ్లు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు? ఎంత మందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి? వంటి వివరాలు సేకరించి దగ్గర పెట్టుకుంటున్నారు. అయితే, వివరాల సేకరణ వరకు బాగానే ఉన్నా ఓటర్ల ఫోన్​ నంబర్లు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత సర్వేలు చేయించడంలో సిద్దిపేట జిల్లా ప్రజాప్రతినిధులు ముందు వరుసలో ఉన్నారు. 

ఇప్పటికే సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు, గజ్వేల్​లో సీఎం కేసీఆర్  సొంత సర్వేలు చేయిస్తుండగా, తాజాగా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ ​కుమార్ సర్వే ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్​జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ఇప్పటికే ఒక దఫా సర్వే చేయించారు. గ్రామ స్థాయి లీడర్ల చేతికి ఓటర్  లిస్టులు ఇచ్చి ప్రతి వంద మందికి ఓ ఇన్​చార్జిని నియమించి ఈ సర్వే చేయించారు. తాజాగా భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తన క్యాడర్​తో సర్వే చేయిస్తున్నారు. ఈ సర్వేను ఎమ్మెల్యే భార్య, వరంగల్​జడ్పీ చైర్ పర్సన్​ గండ్ర జ్యోతి పర్యవేక్షిస్తున్నారు. 

ఓటర్ల వివరాలు, వారు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు? వాళ్ల ఇంట్లో ఎవరెవరికి ఏయే స్కీములు అందుతున్నాయి? సిట్టింగ్  ఎమ్మెల్యేపై వాళ్ల అభిప్రాయం ఏమిటి? వ్యతిరేకత ఉంటే ఎందుకు?  ఆయా గ్రామాలు, పట్టణాల్లో పెండింగ్​ సమస్యలు ఏమి ఉన్నాయి? వంటి వివరాలు తెలుసుకుంటున్నారు. దీంతో పాటు ఫోన్​ నంబర్లు కూడా సేకరిస్తున్నారు. మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్​ కౌన్సిలర్లు, టౌన్​ అధ్యక్షుల ఆధ్వర్యంలో, గ్రామాల్లో సర్పంచ్​లు, ఉప సర్పంచ్​లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షుల సేవలను వాడుకుంటున్నారు. వారంతా రోజుకు వంద ఇండ్ల చొప్పున సర్వే చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో 50 శాతానికి పైగా సర్వే పూర్తయిందని బీఆర్ఎస్​వర్గాలు చెప్తున్నాయి.  

ఫోన్​ నంబర్లు ఎందుకో?

సర్వేలో భాగంగా ఓటర్లు, స్కీములు వంటి వివరాలు సేకరించడం వరకు బాగానే ఉన్నా ఓటర్ల ఫోన్​ నంబర్లు తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు ఫోన్లు చేసి, ఓటు అడిగేందుకు, వాట్సాప్​ గ్రూపుల్లో మెసేజ్​ల ద్వారా ప్రచారానికి  వాడుకుంటామని బీఆర్ఎస్​ క్యాడర్​ చెప్తున్నప్పటికీ ఈ ఫోన్​ నంబర్ల సేకరణ వెనుక భారీ వ్యూహం దాగి ఉందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. ఎన్నికల ముందు ఫోన్​పే, గూగుల్​ పే లాంటి యాప్​ల ద్వారా ఓటర్లకు ఆన్​లైన్​లో డబ్బులు పంపి, ఓట్లు కొనేందుకే అధికార పార్టీ నేతలు ఓటర్ల ఫోన్​ నంబర్లు తీసుకుంటున్నారని ప్రతిపక్ష లీడర్లు ఆరోపిస్తున్నారు. గతంలో హుజూరాబాద్​, మునుగోడు ఉప ఎన్నికల టైంలో ఎలక్షన్​ కమిషన్​కు దొరక్కుండా రూలింగ్​ పార్టీ ఇదే ఎత్తుగడ వేసిందని వారు తెలిపారు. మొత్తం మీద మరో వారం, పది రోజుల్లో ఇలాంటి సర్వేలు రాష్ట్రమంతా ఊపందుకునే అవకాశముంది.