ఎస్పీతో బీఎస్పీ కటీఫ్

ఎస్పీతో బీఎస్పీ కటీఫ్

లోక్ సభ ఎన్నికల్లో మహాకూటమి సాధించిన ఫలితాలపై బీఎస్పీ చీఫ్ మాయావతి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కూటమిలోని ఇతర పార్టీలపై ఆధారపడకుండా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఆమె సూచించారు. సోమవారం ఉత్తరప్రదేశ్​ బీఎస్పీ యూనిట్​తో మాయావతి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆఫీస్​ బేరర్లు, ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు పార్టీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉండాలని సూచించారు. యూపీలో 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ 11 సీట్లలోని ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు తప్పలేదు. బీజేపీ నుంచి 9 మంది, ఎస్పీ, బీఎస్పీ నుంచి చెరొకరు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్​లో తన సంప్రదాయ ఓటు బ్యాంకు కారణంగానే బీఎస్పీ పది సీట్లు గెలుచుకోగలిగిందని, ఎస్పీ ఓట్లు బీఎస్పీ అభ్యర్థులకు ట్రాన్స్​ ఫర్ కాలేదని మాయావతి చెప్పారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో కూటమి దారుణంగా ఓడిపోయిందని, బీఎస్పీని సంస్థాగతంగానే బలోపేతం చేయాలని, ఓట్ల కోసం ఇతర పార్టీలపై ఆధారపడొద్దని సూచించారు.