కొడంగల్-నారాయణపేట స్కీంపై చిగురిస్తున్న ఆశలు

కొడంగల్-నారాయణపేట స్కీంపై చిగురిస్తున్న ఆశలు
  •     రానున్న బడ్జెట్​లో ఫండ్స్​ కేటాయించే చాన్స్​
  •     రూ.300 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం
  •     పదేండ్ల పాటు నిర్లక్ష్యం చేసిన గత బీఆర్ఎస్​ సర్కార్ 

మహబూబ్​నగర్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన కొడంగల్–​-నారాయణపేట స్కీంకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. త్వరలో జరిగే రాష్ట్ర బడ్జెట్​ సమావేశాల్లో ఈ స్కీమ్​కు ఫండ్స్​ రిలీజ్​ చేసి ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. స్కీమ్​ను అందుబాటులోకి తీసుకురావడం వల్ల దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు, 5.50 లక్షల జనాభాకు తాగునీరు అందనుంది.

గవర్నమెంట్​ మారాక కదలిక..

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొడంగల్, నారాయణపేట, మక్తల్​ నియోజకవర్గాలకు సాగు, తాగునీటిని అందించేందుకు జీవో 69 ద్వారా ‘కొడంగల్–​-నారాయణపేట’ స్కీమ్​ను చేపట్టడానికి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటి కొడంగల్​ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్​రెడ్డి ఈ స్కీమ్​ను సాధించడంలో కీ రోల్​ పోషించారు.

పట్టుబట్టి సర్వే పనులు కూడా పూర్తి చేయించారు. అదే సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, బీఆర్ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనుమతులున్నా ఈ స్కీమ్​ పనులను ప్రారంభించలేదు. స్కీం చేపడితే రేవంత్​రెడ్డి, అప్పటి ప్రభుత్వానికి పేరు వస్తుందనే అక్కసుతో పదేండ్లుగా స్కీమ్​ను పక్కకు పెట్టేశారనే విమర్శలున్నాయి.

అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ స్కీమ్​పై ఆశలు చిగురిస్తున్నాయి. సీఎం సొంత ఇలాఖా కావడంతో లిఫ్ట్​ను చేపట్టేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​రెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్​ రెడ్డి ఇరిగేషన్​ మినిష్టర్​ ఉత్తమ్​ కుమార్  రెడ్డితో భేటీ అయ్యారు. లిఫ్ట్​ ఏర్పాటు చేయడం వల్ల కలిగే లాభాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యేలు ఇరిగేషన్​ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. తాజా సమాచారం ప్రకారం మొదటి విడతగా ఈ స్కీం కోసం రూ.300 కోట్లతో ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. త్వరలో పెట్టే బడ్జెట్​లో ఈ నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

సాగునీరు లేక కొనసాగుతున్న వలసలు..

నారాయణపేట, కొడంగల్​ నియోజకవర్గాల్లో వలసలు అధికంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో సాగునీటి సౌకర్యం లేక పంటలు పండడం లేదు. దీంతో వ్యవసాయంపై ఆధారపడిన రైతులు కుటుంబాలను పోషించుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో ముంబై, పూణె, భీమండి, కర్నాటక ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు.

ఈ రెండు నియోజకవర్గాలతో పాటు మక్తల్​ నియోజకవర్గంతో కలుపుకొని 3.70 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా, ఇందులో ప్రతి వానాకాలం సీజన్​లో 3 లక్షల ఎకరాల్లో వర్షాధారంగా రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. యాసంగి వచ్చే సరికి సాగుకు దూరం అవుతున్నారు. కేవలం లక్ష ఎకరాల్లోపే పంటలు సాగువుతున్నాయి. మిగిలిన రెండు లక్షల ఎకరాల్లో భూములు పడావు పడుతున్నాయి. కేవలం బోర్లు ఉన్న రైతులే పంటలు వేసుకుంటున్నారు.

లక్ష ఎకరాలకు సాగునీరు..

జీవో 69ని అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ మే 23, 2014న జారీ చేశారు. ఈ జీవో ద్వారా ‘కొడంగల్–​-నారాయణపేట’ లిఫ్ట్​ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. నారాయణపేట, కొడంగల్, మక్తల్​ నియోజకవర్గాల్లోని 1.05 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.50 లక్షల జనాభాకు తాగునీటిని అందించాలని నిర్ణయించారు. భీమా-1 కింద ఉన్న త్పూర్​ రిజర్వాయర్​ నుంచి ఊట్కూరు, జాజాపూర్, జయమ్మ చెరువు, కానుకుర్తి ఎత్తిపోతల పథకాలు చేపట్టి, గ్రావిటీ ద్వారా నీటిని ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకుగాను దాదాపు రూ.1,450 కోట్లతో అంచనాలు రూపొందించారు. కాని గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పదేండ్లుగా ఈ స్కీం పట్టాలెక్కలేదు.

సాగునీరు లేకనే వలస పోతున్రు..

మా దగ్గర బంగారం లాంటి పంటలు పండే భూములున్నా, సాగు చేసుకోనీకి నీళ్లు లేవు. గత ప్రభుత్వం కొడంగల్​ ప్రాంతానికి సాగునీటిని తీసుకొస్తామని హామీ ఇచ్చింది. పదేండ్లు అధికారంలో ఉన్నా మా భూములకు చుక్క నీరు రాలేదు. కాంగ్రెస్​ ప్రభుత్వం స్పందించి మా భూములను కృష్ణా జలాలతో తడపాలని వేడుకుంటున్నాం.
– మొల్ల శంషోద్దీన్​, రైతు, తొగాపూర్

సీఎంపైనే ఆశలు..

గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొడంగల్ ప్రాంతానికి సాగునీరు రాలేదు. నారాయణపేట–-కొడంగల్​ స్కీమ్​ను పదేండ్లు పక్కన పెట్టారు. సాగునీరు లేక మా భూములు బీళ్లుగా మారాయి. చాలా మంది రైతులు ఉపాధి లేక ముంబై, హైదరాబాద్​ వలస పోయిన్రు. సీఎం రేవంత్​ రెడ్డిపైనే ఆశలు పెట్టుకున్నాం. ఆయన సొంత జిల్లా కావడంతో మాకు సాగునీరు అందిస్తారని ఆశిస్తున్నాం.
– అవుటి మల్లేశం, రైతు, ముక్తిపాడు