బడ్జెట్2020: లక్ష ఊర్లకు ఇంటర్నెట్​

బడ్జెట్2020: లక్ష ఊర్లకు ఇంటర్నెట్​

   భారత్​నెట్​కు రూ.6 వేల కోట్లు కేటాయించిన సర్కార్

    క్వాంటమ్​ కంప్యూటింగ్​కు రూ.8 వేల కోట్లు

    దేశంలోనే ఫోన్లు, ఎలక్ట్రానిక్స్​ తయారు చేసేలా కొత్త విధానం

ఊళ్లలో ఇంటర్నెట్​ (బ్రాడ్​బ్యాండ్​) సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భారత్​నెట్​ మిషన్​ను ప్రారంభించింది. అందులో భాగంగా ఈ ఒక్క ఏడాదిలో లక్ష ఊళ్లకు ఇంటర్నెట్​ కనెక్టివిటీని అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్​ చెప్పారు. అందుకు రూ.6 వేల కోట్లు బడ్జెట్​లో కేటాయించారు. ‘‘పంచాయతీల్లోని అంగన్​వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ స్కూళ్లు, రేషన్​ షాపులు, పోస్ట్​ ఆఫీసులు, పోలీస్​స్టేషన్లలో డిజిటల్​ కనెక్టివిటీని పెంచడమే మా లక్ష్యం. భారత్​నెట్​ ద్వారా చేపట్టే ద ఫైబర్​ టు ద హోమ్​ (ఎఫ్​టీటీహెచ్​) కార్యక్రమం ద్వారా ఈ ఒక్క ఏడాదిలోనే లక్ష గ్రామ పంచాయతీలకు కనెక్టివిటీ ఇస్తాం’’ అని నిర్మలా సీతారామన్​ చెప్పారు. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​, ఇంటర్నెట్​ ఆఫ్​ థింగ్స్​, త్రీడీ ప్రింటింగ్​, డ్రోన్స్​, డేటా స్టోరేజీ, క్వాంటమ్​ కంప్యూటింగ్​ వంటి అధునాతన టెక్నాలజీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరగరాస్తున్నాయన్నారు. నగదు బదిలీ వంటి పథకాలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా టెక్నాలజీని వాడుకుంటోందని చెప్పారు. డేటా సెంటర్​ పార్కులను ప్రైవేటు వాళ్లు ఏర్పాటు చేసేలా త్వరలో కొత్త విధానాలను తీసుకొస్తామన్నారు.

క్వాంటమ్​ కంప్యూటింగ్​కు ఫ్యూచర్​

కంప్యూటింగ్​, కమ్యూనికేషన్స్​, సైబర్​ సెక్యూరిటీ వంటి వాటిలో క్వాంటమ్​ కంప్యూటింగ్​ కొత్త దారులు తెరుస్తోందని, మున్ముందు మరిన్ని కొత్త అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున క్వాంటమ్​ కంప్యూటింగ్​కు మరింత డిమాండ్​ పెరిగే అవకాశం ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ అన్నారు. అందులో భాగంగా క్వాంటమ్​ కంప్యూటింగ్​ కోసం వచ్చే ఐదేళ్ల కాలానికి రూ.8 వేల కోట్ల క్యాపిటల్​ ఔట్​లేని ఆమె బడ్జెట్​లో ప్రకటించారు. నేషనల్​ మిషన్​ ఆన్​ క్వాంటమ్​ టెక్నాలజీస్​ అండ్​ అప్లికేషన్స్​ కింద ఈ బడ్జెట్​ను కేటాయించారు. ‘‘మనం క్వాంటమ్​ కంప్యూటర్​ను తయారు చేయగలిగితే, ప్రపంచంలో దానిని సాధించిన మూడో దేశంగా మనం చరిత్ర సృష్టిస్తాం’’ అని నిర్మల చెప్పారు.

సైన్స్​కు అంతంతే

సైన్స్​ అండ్​ టెక్నాలజీకి ఈ సారి బడ్జెట్​ కేటాయింపుల్లో పెంపు నామమాత్రంగానే ఉన్నాయి. సైంటిఫిక్​ అండ్​ ఇండస్ట్రియల్​ రీసెర్చ్​కు గత ఏడాది రూ.4,895 కోట్లు కేటాయించిన సర్కారు, ఈసారి రూ.5,385 కోట్లు ప్రతిపాదించింది. అందులోనూ కౌన్సిల్​ ఆఫ్​ సైంటిఫిక్​ అండ్​ ఇండస్ట్రియల్​ రీసెర్చ్​ (సీఎస్​ఐఆర్​)కే రూ.5,312 కోట్లు ఇచ్చింది. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీకి రూ.6,301.53 కోట్లు ప్రతిపాదించింది. బయోటెక్నాలజీకి రూ.2,786.76 కోట్లు, ఎర్త్​సైన్సెస్​ డిపార్ట్​మెంట్​కు రూ.2,070 కోట్లు,  భారత వాతావరణ సంస్థకు రూ.443 కోట్లు కేటాయించింది. ఎర్త్​సైన్సెస్​కు ఈసారి రూ.170 కోట్లు పెంచింది.

దేశీ ఫోన్లు

ఫోన్లు, ఎలక్ట్రానిక్స్​ను దేశంలోనే తయారు చేసేలా కంపెనీలను ప్రోత్సహిస్తామని నిర్మల సీతారామన్​ చెప్పారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కొన్ని మార్పులను చేసి వైద్య పరికరాలను ఇక్కడే తయారు చేసేలా విధానాలు రూపొందిస్తామన్నారు. ‘‘దేశంలో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. గ్లోబల్​ వాల్యూ చెయిన్​లో మనం భాగం కావాలి. దాని వల్ల దేశంలోని యువతకు ఉపాధి దొరుకుతుంది. ఎలక్ట్రానిక్స్​ మాన్యుఫ్యాక్చరింగ్​ ఇండస్ట్రీ చాలా కాంపిటీటివ్​గా ఉంది. అయితే, ఉత్పత్తి ఖర్చు విషయంలో ఇండియాకు చాలా అడ్వాంటేజ్​ ఉంది’’ అని చెప్పారు. కాబట్టి ఎలక్ట్రానిక్స్​ను ఇండియాలోనే తయారు చేసేలా భారీగా పెట్టుబడులను తీసుకురావాల్సిన​అవసరం ఉందన్నారు.

మరిన్ని వెలుగు వార్తలకోసం క్లిక్ చేయండి