బుల్లెట్ బండి రూ.18 వేలే.!

బుల్లెట్ బండి రూ.18 వేలే.!

బుల్లెట్ బండిని చాలామంది స్టేటస్ సింబల్ గా భావిస్తుంటరు. ఇప్పుడే కాదు.. ఎన్నో ఏండ్ల సంది బుల్లెట్ బండికి ఉన్న క్రేజే వేరు. టెక్నాలజీ మారి రాయల్ ఎన్ ఫీల్డ్ లో కొత్త రకాల బండ్లు వచ్చినప్పటికీ.. ఆనాటి బుల్లెట్ 350 సీసీ బైక్ కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడీ బండి రూ.2.20 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి అందుబాటులో ఉంది. మరి అదేంటి? రూ.18 వేలే అన్నరు కదా అంటరా? ఒకప్పుడు దీని ధర అంతుండే. 1986 జనవరి 23న ఒకాయన రూ.18,700కే బుల్లెట్ బండి కొన్నడు.

ఆ బిల్లు కాపీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జార్ఖండ్ బొకారో సిటీలోని సందీప్ ఆటో కంపెనీ పేరు మీదున్న ఆ బిల్లు కాపీని.. ఓ వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. దీనికి 53 వేల లైక్స్ వచ్చాయి. చాలామంది తమ పాత బుల్లెట్ బైకును గుర్తు చేసుకుంటూ కామెంట్లు పెట్టారు. ‘‘నా దగ్గర 1984 ఫిబ్రవరి మోడల్ బండి ఇంకా ఉంది. అప్పట్లో రూ.16,100కే కొన్నాను” అని ఒకాయన పేర్కొన్నారు. 1980లో బాంబేలో రూ.10,500కే బుల్లెట్ బండి కొన్నామని మరొకాయన చెప్పారు.