ఇంజినీరింగ్ ఫీజుల భారం రూ.100 కోట్లపైనే!

ఇంజినీరింగ్ ఫీజుల భారం రూ.100 కోట్లపైనే!
  • ఇంజినీరింగ్ ఫీజుల భారం రూ.100 కోట్లపైనే!
  • పేద, మధ్యతరగతి స్టూడెంట్లపై తీవ్ర ప్రభావం
  • బీటెక్ ఫీజులు పెంచిన సర్కార్
  • 61 వేల మందిలో 21 వేల మందికే ఉచిత సీట్లు
  • కనీస ఫీజు రూ.45 వేలకు పెంపు.. సర్కారిచ్చేది 35 వేలే


హైదరాబాద్, వెలుగు:  ఇంజినీరింగ్ కోర్సుల్లో సర్కారు ఫీజులు పెంచడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.వంద కోట్లకు పైనే ఈ భారం పడుతున్నది. బీటెక్ మినిమమ్ ఫీజును రూ.45 వేలకు పెంచిన సర్కార్.. ఫీజు రీయింబర్స్​మెంట్‌‌ను మాత్రం అట్లనే ఉంచింది. కన్వీనర్‌‌‌‌తోపాటు మేనేజ్‌‌మెంట్ కోటాలోనూ భారీగా పెంచడంతో విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 161 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో లక్ష సీట్లున్నాయి. వీటిలో 70% సీట్లు కన్వీనర్ కోటా.. 30% సీట్లు మేనేజ్‌‌మెంట్ కోటా ద్వారా భర్తీ చేసుకునే అవకాశాన్ని సర్కారు ఇచ్చింది. ఈ కాలేజీలకు 2022–25 బ్లాక్ పీరియడ్‌‌కు సంబంధించి ఇటీవల ఫీజులను ఖరారు చేసింది. మినిమమ్ ఫీజు రూ.45 వేలు ఉండగా, గరిష్ట ఫీజు రూ.1.60 లక్షలుగా ఉంది. 40 కాలేజీల్లో రూ.లక్ష, ఆపైన ఫీజు ఉంది. పేరెంట్స్ ఇన్​కమ్ రూ.2 లక్షల లోపు ఉంటే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్​మెంట్ ఇస్తుంది. ప్రైవేటు కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్లందరినీ  మొత్తం ఫీజును సర్కారు చెల్లిస్తున్నది. బీసీలు, ఓసీల విషయంలో మాత్రం.. ఎంసెట్‌‌లో 10వేల ర్యాంకు లోపు ఉంటేనే పూర్తి ఫీజును చెల్లిస్తున్నది. ఆపై ర్యాంకు స్టూడెంట్లకు మినిమమ్ ఫీజు రూ.35 వేలు మాత్రమే ఇస్తున్నది. 

మిగిలిన ఫీజు స్టూటెంట్లు కట్టాల్సిందే. 

ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 75 వేల దాకా సీట్లుండగా, 60 వేలకు పైగా స్టూడెంట్లకు సీట్లు అలాటయ్యాయి. వీరిలో 21 వేల మంది మాత్రమే ఉచిత కేటగిరీలో సీట్లు పొందినట్టు అధికారులు చెప్తున్నారు. ఎంసెట్‌‌లో పది వేల ర్యాంకు దాటిన వారు మరో 31 వేల మంది ఉన్నట్టు పేర్కొంటున్నారు. దీంతో ఆ కాలేజీలో ఎంత ఫీజున్నా వారికి ప్రభుత్వం రూ.35 వేలు మాత్రమే అందించనున్నది. మిగిలిన మొత్తం స్టూడెంట్లు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలా స్టూడెంట్లపై రూ.64 కోట్ల భారం పడుతున్నది. మేనేజ్‌‌మెంట్ కోటాలో సీట్లు పొందిన వారితో పాటు రూ.2 లక్షల కంటే ఎక్కువ ఇన్​కమ్ ఉన్న వారిపై మరో రూ.35 కోట్ల నుంచి 40 కోట్ల భారం పడుతున్నది. ఇదంతా డొనేషన్లు కాకుండానే కేవలం ఫీజుల భారం మాత్రమే.

కాలేజీలకు కట్టాల్సింది పెంచి.. సర్కారు ఇయ్యాల్సింది పెంచలే


ఇంజినీరింగ్ కాలేజీల్లో గత బ్లాక్ పీరియడ్ దాకా మినిమమ్  ఫీజు రూ.35 వేలు ఉండేది. పది వేల ర్యాంకు దాటిన స్టూడెంట్లకు ఈ ఫీజును ప్రభుత్వం చెల్లించేది. 2022–25 బ్లాక్ పీరియడ్‌‌కు మినిమమ్ ఫీజు రూ.45 వేలకు పెంచింది. కానీ ప్రభుత్వం ఇచ్చే మినిమమ్ ఫీజు మొత్తాన్ని మాత్రం పెంచలేదు. దీంతో స్టూడెంట్లకు రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్​మెంట్‌‌గా అందనుంది. కాలేజీల్లో భారీగా ఫీజులు పెరగడంతో పాటు అదనంగా మరో రూ.10 వేల భారం కూడా పడనుండటంపై స్టూడెంట్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


పాత ఫీజులే కొనసాగించాలె


రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజులు పెంచడం సరికాదు. పాత ఫీజులనే కొనసాగించాలి. ఫీజుల పెంపుతో పేద విద్యార్థులకు చదువు భారంగా మారింది. ఫీజు రీయింబర్స్​మెంట్ అరకొరగా ఇస్తూ, లక్షల్లో ఫీజులు పెంచారు. పెంచిన ఫీజులను తగ్గించే దాకా ఆందోళనలు చేస్తాం.

ప్రవీణ్ రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి

సర్కారే చెల్లించాలి

ఇంజినీరింగ్ కాలేజీల్లో పెంచిన ఫీజులు పేద స్టూడెంట్లకు భారంగా మారాయి. ర్యాంకులతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు ప్రభుత్వమే ఫీజులను చెల్లించాలి. పెంచిన ఫీజులను తగ్గించాలి. మేనేజ్‌‌మెంట్ కోటా పేరుతో ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి. 

- నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి