రెచ్చిపోతున్న సైబర్​ నేరగాళ్లు ఆరు గ్యారంటీల పేరుతో వల

రెచ్చిపోతున్న సైబర్​ నేరగాళ్లు ఆరు గ్యారంటీల పేరుతో వల

మహబూబ్​నగర్​/ నిజామాబాద్​, వెలుగు: కొత్తగా ఎలాంటి అవకాశం​ దొరికినా వదలకుండా సామాన్యుల బ్యాంక్​ అకౌంట్లను కొల్లగొట్టే సైబర్​నేరగాళ్లు తాజాగా కాంగ్రెస్​ సర్కారు ప్రవేశపెట్టిన ఆరుగ్యారంటీ స్కీములపై పడ్డారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ‘అభయహస్తం’ పేరుతో ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే.  ఏకంగా కోటీ 25లక్షల అప్లికేషన్లు రావడంతో ఆఫీసర్లు వాటిని ఆన్​లైన్​ చేస్తున్నారు. ఇదే అదనుగా సైబర్​ నేరగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా​కు చెందిన ఓ మహిళకు  ఫోన్​ చేసి, బ్యాంక్​ డిటెయిల్స్​, ఓటీపీ  అడిగి, ఆమె అకౌంట్​లో పైసలు కొట్టేశారు. పలు జిల్లాల్లోనూ సైబర్​ నేరగాళ్ల నుంచి ఇలాంటి  కాల్స్​ వస్తుండడంతో జనం అలర్ట్​గా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

ఆన్​లైన్​ చేస్తున్నామంటూ.. 

సైబర్ ​నేరగాళ్లు పల్లె, పట్టణం అనే తేడాలేకుండా అందరినీ టార్గెట్​ చేస్తున్నారు. బాగా చదువుకున్నవాళ్లను సైతం చాకచక్యంగా బురిడీ కొట్టిస్తున్నారు. ఇందుకోసం సర్కారు ప్రవేశపెట్టిన స్కీములను వాడుకుంటున్నారు. ఇటీవల కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆరు గ్యారంటీ స్కీముల అమలుకు శ్రీకారం చుట్టింది. అభయహస్తం కింద దరఖాస్తులు కోరగా, కోటి 25 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఎక్కువగా మహాలక్ష్మి’, ‘రైతు భరోసా’, ‘చేయూత’ స్కీములకు జనం అర్జీలు పెట్టుకున్నారు.  

ప్రస్తుతం ఈ అప్లికేషన్లను ఎక్కడికక్కడ ఆన్​లైన్​ చేస్తున్నారు. ఈ క్రమంలో సైబర్​ నేరగాళ్లు ఫోన్​ చేసి, తాము డాటా ఎంటర్​ చేస్తున్నామని,  బ్యాంకు డిటెయిల్స్​ అడుగుతున్నారు. అకౌంట్​ నంబర్​ ఎంటర్​ చేశామని, ఓటీపీ వస్తే చెప్పాలంటూ అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి కాల్స్​ వస్తుండడంతో అలర్ట్​గా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్కీముల కోసం ఎవరు ఫోన్​ చేసినా నమ్మవద్దని, అకౌంట్, ఓటీపీ వివరాలు ఎవరికీ చెప్పవద్దని సూచిస్తున్నారు. ఒకవేళ  సైబర్​ నేరగాళ్ల బారిన పడి అకౌంట్​నుంచి డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే నేషనల్​ సైబర్​ క్రైమ్​ రిపోర్టింగ్​ పోర్టల్​ 1930కి డయల్​ చేసి కంప్లయింట్​ ఇవ్వాలని సలహా ఇస్తున్నారు. కంప్లయింట్​ చేసిన వెంటనే ఏ అకౌంట్​ నుంచి అమౌంట్​ డెబిట్​ అవుతుందో ఆ అకౌంట్​ను ఫ్రీజ్​ చేస్తామని చెప్తున్నారు. దీంతో సైబర్​ నేరగాళ్లు ఈ డబ్బును డ్రా చేసుకునే అవకాశం ఉండదని, మోసపోయినవాళ్లకు రీఫండ్​ చేస్తామని పోలీసులు అంటున్నారు. 

పెరుగుతున్న సైబర్​ నేరాలు.. 

నేషనల్​ క్రైం బ్యూరో రికార్డ్స్​ ప్రకారం.. రాష్ట్రంలో 2021లో 10,303 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా, 2022లో 15,297 కేసులు ఫైల్​అయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 17.59 శాతం సైబర్ నేరాలు ఎక్కువగా రిపోర్టయ్యాయని, సైబర్​ నేరగాళ్లు రాష్ట్ర ప్రజల నుంచి రూ.707 కోట్లు కొట్టేశారని డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. సైబర్​ నేరాల్లో హైదరాబాద్​  దేశంలోనే ఫస్ట్​ ప్లేస్​లో ఉండగా, జిల్లాల్లోనూ సైబర్​ క్రైమ్స్​ పెరిగిపోతున్నాయి. ఉదాహరణకు గతేడాది ఖమ్మంలో 219 సైబర్​ క్రైమ్స్​ నమోదుకాగా,  జనం రూ.9 కోట్లు కోల్పోయారు.  పాలమూరు జిల్లాలో 930  అకౌంట్లను సైబర్​ నేరగాళ్లు గుల్ల చేశారు.

నిజామాబాద్​ జిల్లాలో ఓటీపీ అడిగి రూ.10 వేలు కొట్టేసిండ్రు

నిజామాబాద్, వెలుగు: అభయహస్తం స్కీమ్​ కోసం ప్రజాపాలనలో అప్లికేషన్ ​పెట్టిన మహిళకు ఫోన్​ చేసిన సైబర్​ నేరగాళ్లు ఆమె బ్యాంకు అకౌంట్​నుంచి రూ.10 వేలు దోచేశారు. మూడు రోజుల కింద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్​ మండలం బర్ధీపూర్ గ్రామానికి చెందిన తాళ్ల లావణ్య ఈనెల 6న అభయహస్తం పథకాల కోసం దరఖాస్తు చేశారు. మరుసటి రోజు ఓ ఫోన్​కాల్ ​వచ్చింది. అభయహస్తం అప్లికేషన్​లో రెండు రకాల జిరాక్సులు జత చేయలేదని ఫోన్​ చేసిన వ్యక్తి చెప్పాడు. ఆమె ఆలోచిస్తున్నంతలోపే అప్లికేషన్​ను ఆన్​లైన్ ​చేస్తున్నామని, తాము పంపే ఓటీపీ నెంబర్ ​చెబితే చాలన్నాడు. దీంతో లావణ్యకు వచ్చిన ఓటీపీ చెప్పాక ఫోన్​ కట్​ చేశాడు. అరగంట దాటాక ఆమె అకౌంట్​నుంచి రూ.10 వేలు డ్రా అయినట్లు మెసేజ్​రాగా బయటకు వెళ్లిన భర్త డ్రా చేసి ఉంటాడని భావించింది. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తను అడగగా తాను తీయలేదని చెప్పాడు. మరుసటి రోజు ఇద్దరూ కలిసి బ్యాంకుకు వెళ్లి అడిగారు. ఓటీపీ అడిగారంటే అది సైబర్ క్రిమినల్స్ పనే అని తేల్చి చెప్పారు.  

1930కి ఫోన్​ చేయండి..

సైబర్​ నేరగాళ్లు ప్రజలను కన్​ఫ్యూజ్​ చేసి ట్రాప్​ చేస్తుంటారు. ఎలాంటి ఫోన్లు వచ్చినా  ఓటీపీలు, బ్యాంక్​ అకౌంట్​ నంబర్లు, ఏటీఎం కార్డుల నంబర్లు షేర్​ చేయొద్దు. ఒకవేళ డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే1930 టోల్​ఫ్రీ నంబర్​కు కాల్​ చేస్తే ఆ అకౌంట్లను ఫ్రీజ్​చేసే అవకాశం ఉంటుంది.
– మహేశ్​ గౌడ్​, డీఎస్పీ, మహబూబ్​నగర్​