తప్పుచేసిన అధికారులను వదలిపెట్టం : బుర్రి శ్రీనివాస్ రెడ్డి

తప్పుచేసిన అధికారులను  వదలిపెట్టం : బుర్రి శ్రీనివాస్ రెడ్డి
  • విచారణ జరిపి చర్యలు తీసుకుంటం
  • అభివృద్ధి పేరుతో మున్సిపాలిటీ నిధులు దుర్వినియోగం
  • అర్బన్ పార్క్‌, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ నిర్మాణంలో అక్రమాలు

నల్గొండ అర్బన్, వెలుగు: గత ప్రభుత్వంలో తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టేది లేదని నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం నల్గొండ మున్సిపాలిటీలో ఆయన అధ్యక్షతన సాధారణసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో రెండేళ్లుగా జరిగిన అభివృద్ధి పనుల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు.  సుందరీకరణ పనులు, హరితహారం, కౌన్సిల్ అనుమతి లేకుండా చేపట్టిన అభివృద్ధి పనులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 

అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. గత పాలకులు ఇష్టారాజ్యంగా నిధులు కేటాయించి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.  చర్లపల్లి అర్బన్ పార్క్‌, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాలకు కౌన్సిల్ అనుమతి కంటే అదనంగా రెండు రెట్లు నిధులు ఖర్చు చేశారని మండిపడ్డారు.  వాటిని కౌన్సిల్ అనుమతి తీసుకోవాల్సి ఉన్నా.. పట్టించుకోలేదన్నారు.  హరితహారంలో అవినీతి చోటు చేసుకుందని, అత్యవసర పనుల పేరుతో కొటేషన్లు వేసి ఖజానాను కొల్లగొట్టారని ఆరోపించారు.   కలెక్టర్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తప్పు చేసిన వారిపై విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు.
 
బొమ్మల పేరుతో సిరిసిల్ల, సిద్దిపేట కాంట్రాక్టర్ల దోపిడీ

కౌన్సిలర్ ఖయ్యూం బేగ్ మాట్లాడుతూ.. దేశ సంపదను ఈస్టిండియా కంపెనీ దోచుకుపోయినట్లు, సిరిసిల్ల, సిద్దిపేట కాంట్రాక్టర్లు గోడలకు బొమ్మలు వేసి నిధులు దోచుకున్నారని ఆరోపించారు. గత నాలుగేళ్లలో నల్గొండ మున్సిపాలిటీలో రూ.1350 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో  కేవలం రూ. 200 కోట్ల పనులు మాత్రమే జరిగాయన్నారు. గ్రీన్ బడ్జెట్​లో  అవినీతి జరిగిందని, హైదరాబాద్ రోడ్డులో చెట్లకు రింగులు పెట్టినందుకు  రూ.25 లక్షలు ఖర్చు చేశారని ఆరోపించారు.  కొన్ని పనులకు క్యూసీలు లేకుండా, ఫ్రీ అడిట్​లేకుండా బిల్లులు చెల్లించారని, ఆ తర్వాతనే ఆడిట్​చేయించారని మండిపడ్డారు. 

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోండి

బీజేపీ మున్సిపల్  ఫ్లోర్​ లీడర్ బండారు ప్రసాద్ మాట్లాడుతూ.. గత పాలనలో జరిగిన అవినీతిపై కౌన్సిల్‌ కు సంబంధం లేకుండా విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అండర్ గ్రౌండ్‌ డ్రైనేజీ  నీళ్ల బాటిళ్లు, చెత్తాచెదారాలతో నిండిపోయిందని..  కాంట్రాక్టర్ శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, శ్మశాన  వాటికల్లో  నీటి సౌకర్యం కల్పించాలని కోరారు.  అనంతరం చైర్మన్ మాట్లాడుతూ..  ఏ వార్డులో తాగునీటి సమస్య రానివ్వొద్దని, వెంటనే ముందస్తు ఏర్పాట్లు చేయాలని  అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ రమేశ్ గౌడ్  కమిషనర్ సయ్యద్ ముసాబ్​ అహ్మాద్​, ఈఈ రాములు, ఏసీపీ నాగిరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.