వాగు మధ్యలో బస్సు.. అందులో 30 మంది

వాగు మధ్యలో బస్సు.. అందులో 30 మంది
  • వరదల్లో చిక్కి.. అతి కష్టమ్మీద బయటపడ్డరు
  • కామారెడ్డి జిల్లాలో వాగు మధ్యలో బస్సు.. అందులో 30 మంది
  • కుమరం భీం జిల్లాలో రెండు వాగుల మధ్య 37 మంది.. కాపాడిన పోలీసులు, స్థానికులు

నెట్ వర్క్, వెలుగు: భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లడంతో వరదల్లో చిక్కుకున్న పలువురిని స్థానికులు, పోలీసులు కాపాడారు. గురువారం రాత్రి మెదక్ ​నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రాజంపేట మండలం కొండాపూర్ దగ్గర సంగమేశ్వర వాగు వరదలో చిక్కుకుపోయింది. బస్సులో ఉన్న 30 మందిని స్థానికులు, పోలీసులు తాడు సాయంతో ఒడ్డుకు చేర్చారు. కుమ్రం భీమ్ జిల్లా దహెగాం మండలం లగ్గాం పెద్దవాగులో 9 మంది కూలీలు రాత్రంతా చిక్కుకున్నారు. తెల్లవారుజామున పోలీసులు, అధికారులు స్పాట్​కు చేరుకొని కూలీలను రక్షించారు. వాంకిడి మండలం దుబ్బగూడ  వాగులో చిక్కుకున్న స్టూడెంట్లు, గ్రామస్తులను పోలీసులు కాపాడారు. కనార్ గాం, భీంపూర్ గ్రామాలకు చెందిన స్టూడెంట్లు ఆటోలో వెళ్తూ.. దుబ్బగూడ దగ్గర  రెండు వాగుల మధ్యలో చిక్కుకున్నారు. పోలీసులు 2 గంటల పాటు శ్రమించి 20 మంది స్టూడెంట్లు, 17 మంది గ్రామస్తులను కాపాడారు. చర్లలోని సి కత్తిగూడెంకు చెందిన నలుగురు పనుల మీద గోదావరి పరివాహకమైన లంక గ్రామంలోకి వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు. రెండుగంటలు శ్రమించి నాటు పడవల ద్వారా యువకులను ఒడ్డుకు చేర్చారు.

హోంగార్డ్, పశువుల కాపరి​ మృతి
కాగజ్ నగర్​ మండలం మెట్ పల్లి గ్రామానికి చెందిన హోంగార్డు కోరెంగ భీంరావు(48) గురువారం ఇంటికి వెళ్తూ అంకుసాపూర్​దగ్గర వాగులో కొట్టుకుపోయి చనిపోయాడు. కాసిపేట మండలంలోని సండ్రల్​పాడ్​కు చెందిన కాల్వ లచ్చన్న(58) వాగు దాటుతూ కొట్టుకుపోయి మృతి చెందాడు.