టూల్స్ అండ్ గాడ్జెట్స్

టూల్స్ అండ్ గాడ్జెట్స్

బుల్లి టీవి

వేలెడంత ఉండే కెమెరాని ఎప్పుడైనా వాడారా? వేలి కంటే చిన్నగా ఉండే టాయ్ సోలార్​​ కారుని చూశారా? అవును మినియేచర్​ వస్తువులే కాదు.. గాడ్జెట్స్​ కూడా మార్కెట్​లో దొరుకుతున్నాయి. ఇలాంటి గాడ్జెట్స్​కి మార్కెట్​లో​ మస్తు క్రేజ్​ ఉంది. కొందరు కంఫర్ట్​ కోసం కొంటే.. మరికొందరు సరదా కోసం కొంటుంటారు. అలాంటి గాడ్జెట్స్​లో కొన్ని ఇవి...

ఆరెంజ్ కెమెరా​ 

చాలా చిన్న కెమెరా ఇది. అయితేనేం దీంతో.. వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫొటోలు తీసుకోవచ్చు.  ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ. చూడ్డానికి చాలా అందంగా కీ చైన్​లా కనిపిస్తుంది. ఆరెంజ్​ కంపెనీ దీన్ని తెచ్చింది. ఇది సెక్యూరిటీ కెమెరాగా, టూర్లకు వెళ్లినప్పుడు ఫొటోలు తీసుకోవడానికి బాగా పనికొస్తుంది. పవర్​ ఆఫ్​లో ఉన్నప్పుడు కూడా కంప్యూటర్​కు కనెక్ట్​ చేసుకోవచ్చు. తక్కువ వెలుతురు ఉన్నా హై డెఫినిషన్​లో ఫొటోలు తీయగలదు. 32 జీబీ మెమరీ కార్డ్​ వేసుకోవచ్చు. ఇందులో హై కెపాసిటీ లిథియం పాలిమర్​ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్​ ఛార్జ్ చేయడానికి మూడు గంటల టైం పడుతుంది. తర్వాత మరో మూడు గంటల వరకు వాడుకోవచ్చు. ఈ కెమెరా 60 గ్రాముల బరువు ఉంటుంది. దీన్ని వాడడం ఆపేస్తే.. ఐదు సెకన్లకు ఆటోమెటిక్​గా ఆఫ్​ అయిపోతుంది.

ధర: 6,690 రూపాయలు

మినీ మైక్రోస్కోప్​

చాలా చిన్నగా ఉండేవాటిని చూడ్డానికి మైక్రోస్కోప్​ని వాడుతుంటాం. అలాంటి మైక్రోస్కోప్​ కూడా చాలా చిన్నగా ఉంటే ఎలా ఉంటుంది? అవును ఈ బుల్లి మైక్రోస్కోప్​ కేవలం 30 మిల్లీ మీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. ఎస్​.ఎస్.​ఈ.ఏ. కంపెనీ తీసుకొచ్చిన ఈ మైక్రోస్కోప్​ చీకట్లో కూడా బాగా పనిచేస్తుంది. వస్తువులను స్పష్టంగా చూడొచ్చు. వస్తువులను స్పష్టంగా చూపించేందుకు ఇందులో రెండు ఎల్​ఈడీ లైట్లు కూడా ఉన్నాయి. 60X వరకు జూమ్​ చేయగలదు. దీని బరువు 25 గ్రాములు మాత్రమే. 
ధర: 275 రూపాయలు

వై బెస్ట్​ టీవీ

ఎక్కడైనా టీవీ పెద్దగా, రిమోట్​ చిన్నగా ఉంటాయి. వై బెస్ట్​ కంపెనీ తీసుకొచ్చిన ఈ టీవీ మాత్రం దాని రిమోట్​ కంటే తక్కువ పొడవు ఉంటుంది. అలాగని రిమోట్​ చాలా పెద్దదిగా ఉందేమో అనుకునేరు. ఈ టీవీ చాలా చిన్నగా ఉంటుంది. సైజులో చిన్నగా ఉన్నా.. ఫీచర్లు మాత్రం పెద్ద టీవీలో ఉన్నట్టే ఉంటాయి. చూడ్డానికి పాత మోడల్​ టీవీలా ఉంటుంది. కానీ.. ఇది ఆండ్రాయిడ్​ 7.1తో వస్తుంది. వైఫైకి కనెక్ట్​ చేసి వాడుకోవచ్చు. దాదాపు అన్ని రకాల స్ట్రీమింగ్​ యాప్​లను ఇన్​స్టాల్​ చేసుకోవచ్చు. ఇందులో కొన్ని నాస్టాల్జిక్ గేమ్‌లు కూడా ఇన్​బిల్ట్​గా వస్తాయి. యూఎస్​బీ బ్లూటూత్​ రిసీవర్​ కనెక్ట్​ చేసి, బ్లూటూత్​ డివైజ్​లు కూడా వాడుకోవచ్చు. దీనికి 3.5 అంగుళాల ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. బరువు కేవలం 400 గ్రాములు మాత్రమే.  
ధర: 16,837 రూపాయలు

మినీ కారు

సరిగ్గా వేలెడంత పొడవు కూడా ఉండదు ఈ కారు. కానీ.. మీద లైట్​ పడితే రయ్​.. రయ్​.. అని పరుగులు పెడుతుంది. ఇది సోలార్​ పవర్‌‌తో నడిచే అల్ట్రా-స్మాల్ టాయ్​ కారు. దీనికి బ్యాటరీలు అవసరం లేదు. దీని పొడవు32 మిల్లీమీటర్లు, ఎత్తు 22 మిల్లీమీటర్లు మాత్రమే. బరువు ఆరు గ్రాములు. దీన్ని షర్వీ ఎలక్ట్రానిక్స్​ వాళ్లు తీసుకొచ్చారు.
ధర: 259 రూపాయలు